Begin typing your search above and press return to search.

కొత్త జిల్లా కోసం ఆత్మహత్య

By:  Tupaki Desk   |   24 Aug 2016 6:18 AM GMT
కొత్త జిల్లా కోసం ఆత్మహత్య
X
ప్రతి రాజకీయ అంశాన్నికొందరు సీరియస్ గా తీసుకుంటున్నారా?.. తాము అనుకున్నది జరగకపోతే ఆత్మహత్య చేసుకునే వరకూ వెళుతున్నారా? అన్న ప్రశ్న వేసుకుంటే అవుననే సమాధానం లభిస్తోంది. ప్రతి విషయానికి తీవ్ర భావోద్వేగానికి గురి కావటం లేనిపోని సమస్యలకు దారి తీయటంతో పాటు.. ఆత్మహత్యల్లాంటి కారణాలతో వారిని నమ్ముకున్నకుటుంబాలు దారుణంగా దెబ్బ తినే పరిస్థితి నెలకొంది. సుదీర్ఘకాలం నాన్చిన తెలంగాణ రాష్ట్ర డిమాండ్ విషయంలో కేంద్రం అనుసరించిన విధానాలతో పెద్ద ఎత్తున ఆత్మహత్యలు సాగాయి. ఈ ఉదంతాల కారణంగా వందలాది కుటుంబాలు తీవ్ర ప్రభావానికి గురయ్యే పరిస్థితి.

కోట్లాది మంది కోరుకున్న తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత.. తాజాగా తాము కోరుకున్న జిల్లా ఏర్పడటం లేదన్న బాధతో ఆత్మహత్య చేసుకోవటం కలకలం రేపుతోంది. ప్రతి విషయానికి ప్రాణత్యాగం సమాధానం కాదన్న విషయాన్ని పార్టీలకు అతీతంగా నేతలు స్పష్టం చేయాల్సి ఉంది. కొన్ని సందర్భాల్లో కొన్ని డిమాండ్లు తీర్చటం సాధ్యం కాకపోవచ్చు. అంతమాత్రాన ప్రాణత్యాగం చేయటం ఏమటన్న ప్రశ్న వేయాల్సిన అవసరం ఉంది. తాజాగా తెలంగాణ ప్రభుత్వం కొత్త జిల్లాల్ని ఏర్పాటు చేసేందుకు తీవ్ర కసరత్తు చేస్తోంది. దసరా నాటికి కొత్త జిల్లాల్ని తీసుకురావాలన్న ఆలోచనలో భాగంగా ప్రస్తుతం కొత్త జిల్లాలకు సంబంధించిన ముసాయిదాను విడుదల చేసింది.

అయితే.. ప్రభుత్వం విడుదల చేసిన ముసాయిదాలో జానగామ జిల్లా లేకపోవటంపై తీవ్ర మనస్తాపానికి గురైన వరంగల్ జిల్లా బచ్చన్నపేటకు చెందిన కొన్నె బాలరాజు ఆత్మహత్య చేసుకోవటం సంచలనంగా మారింది. పాతికేళ్ల బాలరాజు కుటుంబ సభ్యులు చెబుతున్న దాని ప్రకారం.. జనగామ జిల్లా సాధన కోసం జరుగుతున్న ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నట్లుగా వెల్లడించారు.

ఐకాస నేతలు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షలో పాల్గొని వచ్చాడని.. అదే సమయంలో విడుదలైన ముసాయిదాను చూసి తీవ్ర మనస్తాపానికి గురైనట్లుగా వారు చెబుతున్నారు. జనగామ జిల్లా సాధన సాధ్యం కాదన్న వేదనతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని చనిపోయినట్లుగా చెబుతున్నారు. ఏది ఏమైనా ఇలాంటి ఆత్మహత్యల్ని నిలువరించటంతో పాటు.. కొత్త జిల్లాల కోసం జరుగుతున్న ఉద్యమాలపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించి.. వారితో చర్చలు జరపటం లాంటివి చేసి.. అందరిని సమాధాన పర్చటం ఎంతైనా అవసరం. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వ విధానాలకు మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడటం ఆందోళన కలిగించే అంశమన్న భావన పలువురు తెలంగాణ వాదులు వ్యక్తం చేస్తున్నారు.