Begin typing your search above and press return to search.

బాల‌యోగి వార‌సుడు!...ఎంపీగా కాదు ఎమ్మెల్యేగా!

By:  Tupaki Desk   |   14 March 2019 9:18 AM GMT
బాల‌యోగి వార‌సుడు!...ఎంపీగా కాదు ఎమ్మెల్యేగా!
X
సెంటిమెంట్ జిల్లాగానే కాకుండా తెలుగు నేల‌లోనే అత్య‌ధిక సంఖ్య‌లో సీట్లు క‌లిగిన తూర్పు గోదావ‌రి జిల్లాలో రోజురోజుకు ప‌రిణామాలు చాలా వేగంగా మారిపోతున్నాయి. విపక్షం వైసీపీ ప‌రిస్థితి కాస్త మెరుగ్గానే ఉన్నా... అధికార పార్టీలో మాత్రం నానాటికీ అల‌జ‌డి అధిక‌మ‌వుతోంది. ఎన్నికల షెడ్యూల్ విడుద‌లైన త‌ర్వాత అభ్య‌ర్థుల ఖ‌రారుపై కుస్తీలు ప‌డుతున్న టీడీపీ... తూర్పు గోదావ‌రి జిల్లాకు సంబంధించి సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. జిల్లాలో ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేల‌కు సీట్లు నిరాక‌రించేసిన పార్టీ అధినేత‌ - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు... ఆ మూడు సీట్ల‌నూ మూడు కొత్త ముఖాల‌కే ఇచ్చేశారు.

ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల‌కు ముందే పార్టీకి షాకిచ్చిన అమ‌లాపురం ఎంపీ పండుల ర‌వీంద్ర బాబు వైసీపీ గూటికి చేరితే... ఆ సీటును దివంగ‌త నేత‌ - లోక్ స‌భ మాజీ స్పీక‌ర్ జీఎంసీ బాల‌యోగి కుమారుడు హ‌రీశ్ కు కేటాయిస్తార‌ని వార్త‌లొచ్చాయి. అయితే ఆ వార్త‌ల‌ను అంత‌గా ప‌ట్టించుకోని చంద్ర‌బాబు... హ‌రీశ్ ను ఎంపీగా కాకుండా ఎమ్మెల్యేగా బ‌రిలోకి దించేందుకు నిర్ణ‌యం తీసుకున్నారు. ఇప్పుడు సిట్టింగ్ ల‌ను త‌ప్పించి ఖాళీ చేసిన మూడు స్థానాల్లో అమ‌లాపురం అసెంబ్లీని ఆయ‌న‌కు కేటాయించారు. ఇక సిట్టింగ్ ల‌ను త‌ప్పించిన మ‌రో రెండు సీట్ల‌కు కూడా చంద్ర‌బాబు కొత్త ముఖాల‌నే ఎంపిక చేశారు. అమ‌లాపురం ఎమ్మెల్యే ఆనంద్ రావుతో పాటు పి.గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యే పుల‌ప‌ర్తి నారాయ‌ణ మూర్తిల‌ను పూర్తిగా ప‌క్క‌న‌పెట్టేసిన చంద్ర‌బాబు... ప‌త్తిపాడు ఎమ్మెల్యే వ‌రుపుల సుబ్బారావుకు టికెట్ నిరాక‌రించినా... ఆయ‌న కుమారుడు వ‌రుపుల రాజాను ప‌త్తిపాడు బ‌రిలోకి దింపుతున్న‌ట్లుగా చంద్ర‌బాబు నిర్ణ‌యం తీసుకున్నారు.

ఇక సిట్టింగ్ కు నిరాక‌రించిన మ‌రో స్థానం పి.గ‌న్న‌వ‌రం స్థానాన్ని ఓ ప్ర‌ముఖ న్యాయ‌వాది కుమార్తెకు కేటాయించిన‌ట్టుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. అయితే ఆ న్యాయవాది - ఆయ‌న కుమార్తె ఎవ‌ర‌న్న విష‌యాన్ని మాత్రం టీడీపీ బ‌య‌ట‌పెట్ట‌లేదు. మొత్తంగా ఈ జిల్లాలో మొత్తం 19 అసెంబ్లీ సీట్లుండ‌గా... ఈ ముగ్గురు మిన‌హా మిగిలిన నియోజ‌క‌వ‌ర్గాల్లో పాత‌కాపుల‌కే టికెట్ల‌ను ఇస్తున్న‌ట్లుగా చంద్ర‌బాబు ఓ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ లెక్క‌ల‌న్నీ ఎలా ఉన్నా... ఈ ద‌ఫా జీఎంసీ బాల‌యోగి కుమారుడు హరీశ్ కు మాత్రం అవకాశం ల‌భించేసింది.