Begin typing your search above and press return to search.

రూ.2కే బాలయ్య చికెన్‌ బిరానీ!

By:  Tupaki Desk   |   14 Dec 2022 7:41 AM GMT
రూ.2కే బాలయ్య చికెన్‌ బిరానీ!
X
ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఓవైపు సినిమాలు, మరోవైపు ఓటీటీ షో అన్‌స్టాపబుల్, ఇంకోవైపు రాజకీయాలు... ఇలా అన్ని రంగాల్లో తనదైన శైలిలో రాణిస్తున్నారు. అఖండ వంటి సూపర్‌ హిట్‌ తర్వాత వస్తున్న వీరనరసింహారెడ్డి ఈ సంక్రాంతికి సందడి చేయనుంది.

కాగా బాలయ్య ప్రస్తుతం హిందూపురం ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇక్కడ నుంచి ఆయన వరుసగా రెండుసార్లు 2014, 2019ల్లో విజయం సాధించారు. కాగా ఇప్పటికే అన్న క్యాంటీన్‌ ద్వారా అతి తక్కువ ధరకే సొంత ఖర్చులతో హిందూపురం ప్రజలకు భోజన సౌకర్యాన్ని బాలయ్య అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే.

అలాగే మొబైల్‌ వైద్య శాలను కూడా హిందూపురం ప్రజలకు బాలకృష్ణ అందుబాటులోకి తెచ్చి సేవలు అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో అన్న క్యాంటీనును పెట్టి 200 రోజులు పూర్తి కావడం, మరోవైపు తన తండ్రి ఎన్టీఆర్‌ శత జయంతి సంవత్సరం కావడంతో రూ.2కే చికెన్‌ బిర్యానీని బాలకృష్ణ అందుబాటులోకి తెచ్చారు.

ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రూ.2కే కిలోబియ్యం పథకానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బాలయ్య ఆ కార్యక్రమాన్ని మనసులో పెట్టుకుని అన్న క్యాంటీన్‌ ద్వారా రూ.2కే నిత్యం భోజనం అందిస్తున్నారు. ఇప్పుడు రూ.2కే చికెన్‌ బిర్యానీని అందుబాటులోకి తెచ్చారు.

అన్న క్యాంటీన్‌ ఏర్పాటు చేసి 200 రోజులు పూర్తి కావడంతో రూ.2కే చికెన్‌ బిర్యానీ, గుడ్డు, స్వీటును 500 మందికి అందించారు. హిందూపురం ప్రభుత్వాస్పత్రి వద్ద ఈ కార్యక్రమాన్ని టీడీపీ నేతలు నిర్వహించారు. రూ.2 కే చికెన్‌ బిర్యానీ, స్వీటు, గుడ్డు అందిస్తుండటంతో దీని కోసం ప్రజలు బారులు తీరారు. మాకు మాకంటూ ఎగబడ్డారు. తిన్నవారంతా జై బాలయ్య అంటూ ఆనందంతో నినాదాలు సైతం చేశారు.

గతంలో బాలయ్య నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉండటం లేదనే విమర్శలు వచ్చేవి. దీంతో ఆయన ఇటీవల కాలంలో ఎక్కువగా నియోజకవర్గంలోనే గడుపుతున్నారు. తరచూ నియోజకవర్గాన్ని సందర్శిస్తున్నారు. ప్రజలకు ఏ సమస్య వచ్చినా పరిష్కారానికి ముందుంటున్నారు. కార్యకర్తలకు సైతం అండగా ఉంటున్నారని చెబుతున్నారు. దీంతో ప్రజలు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.