Begin typing your search above and press return to search.

ముద్ర‌గ‌డ‌కు షాక్ః కాపు నేత‌ల్లో చీలిక‌

By:  Tupaki Desk   |   28 Dec 2016 6:35 AM GMT
ముద్ర‌గ‌డ‌కు షాక్ః కాపు నేత‌ల్లో చీలిక‌
X
బీసీ రిజర్వేషన్ డిమాండ్‌ తో సర్కారును వణికిస్తోన్న కాపు ఉద్య‌మ నేత ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభంకు ఊహించ‌ని షాక్ ఎదురైంది. ఇకపై కాపులతో కలసి ఉద్యమించేది లేదన్న బలిజ నేతల స్పష్టం చేశారు. ఈ ప‌రిణామంతో కాపు ఉద్యమం బలహీనపడే అవకాశం కనిపిస్తోంది. జనాభా పరంగా కాపుల కంటే బలిజల సంఖ్యనే ఎక్కువ కావడంతో భవిష్యత్తులో కాపు ఉద్యమం మునుపటిలా ఉద్ధృతంగా జరిగే అవకాశాలు సన్నగిల్లటంతో పాటు ముద్రగడ నాయకత్వం కూడా కేవలం మూడు జిల్లాలకే పరిమితం కానుందనే ఆందోళన కాపు నేతల్లో వ్యక్తవౌతోంది.జనాభాపరంగా కాపుల కంటే ఎక్కువ సంఖ్యలో ఉన్న బలిజలను చూపించి - కోస్తా కాపు నేతలు రాజకీయ ప్రయోజనాలు సాధిస్తుండటం బలిజలకు చాలాకాలం నుంచీ మింగుడుపడటం లేదు. అయితే బీసీ రిజర్వేషన్ల కోసం పోరాడుతున్న సమయంలో తాము గళం విప్పితే ఎక్కడ నష్టపోతామోననే భయంతో ఇప్పటివరకూ మౌనంగా ఉన్న బలిజలు ఇప్పుడు నేరుగా కాపుల నాయకత్వంలో ఇక పనిచేసేది లేదని స్పష్టం చేస్తుండటంతో, కాపు ఉద్యమంలో చీలిక అనివార్యం కానుంది.

నెల్లూరు - కడప - చిత్తూరు - కర్నూలు - అనంతపురంతో పాటు కృష్ణా - గుంటూరు - ప్రకాశం జిల్లాల్లోని కొన్ని నియోజకవర్గాల్లో ఎక్కువ జనాభాగా ఉన్న బలిజలు ఇప్పటివరకూ కాపు నేతలతో కలిసి ఉద్యమాల్లో పాల్గొంటున్నారు. అయితే ఉద్యమంలో తమ పాత్రను పరిమితం చేసి, తమను చూపించి కాపు నేతలు ఏ ప్రభుత్వం ఉన్నా, ఏ పార్టీలోనయినా లబ్ధి పొందుతున్నారే తప్ప తమకొచ్చిన ప్రయోజనమేమీ లేదని వారంటున్నారు. కేవలం ఉభయ గోదావరి - కృష్ణా - గుంటూరు జిల్లాల్లో మాత్రమే మెజారిటీగా ఉన్న కాపులు తమ రాజకీయ ప్రయోజనాల కోసం సీమలో ఎక్కువ సంఖ్యలో ఉన్న తమను చూపించి ప్రభుత్వం - పార్టీలో పదవులు పొందుతున్నారని బలిజ నేతలు విశ్లేషిస్తున్నారు. కాపు నేతగా ఎదిగిన ముద్రగడ కూడా కేవలం కాపుల గురించే మాట్లాడుతూ కాపు నేతలనే ప్రోత్సహిస్తున్నారు తప్ప, బలిజల గురించి మాట్లాడకపోవడంపై ఆ వర్గంలో ఆగ్రహం వ్యక్తమౌతోంది. సాంకేతికంగా బీసీలుగా ఉన్న ఉత్తరాంధ్ర తూర్పు కాపులు కూడా కాపు ఉద్యమం గురించి మాట్లాడటంపై విస్మయం వ్యక్తమ‌వుతుతోంది.

మ‌రోవైపు తూర్పు కాపులకు చెందిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళావెంకట్రావు - మంత్రి మృణాళిని - బొత్స సత్యనారాయణ వంటివారికి ముద్రగడ ఇస్తున్న ప్రాధాన్యం బలిజ నేతలకు ఇవ్వకపోవడం వారిని ఆగ్రహానికి గురిచేస్తోంది. వీరంతా రాజకీయ ప్రయోజనాల కోసమే కాపుకార్డు వాడుతున్నారని, గతంలో కాంగ్రెస్ హయాంలో బొత్స బీసీ - కాపుకార్డును సందర్భోచితంగా వాడి పీసీసీ చీఫ్‌ గా పనిచేసి - ముఖ్యమంత్రి పదవి కోసం ప్రయత్నించిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు. ఉద్యమాలు, కేసులకే తాముగాని పదవులు మాత్రం కాపులు తీసుకుంటున్నారని బలిజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెదేపా కాపు ఎమ్మెల్యేలు - మంత్రులు - నేతలు కూడా తమ పేరుచెప్పి నాయకత్వం వద్ద బలోపేతం అవుతుంటే అందులో బలిజలు కనిపించరని స్పష్టం చేస్తున్నారు. ఇకపై కాపునాడుతో కలిసి ఉద్యమించే ప్రసక్తే లేదని, తమకు సొంతంగా పోరాడే శక్తి ఉందని, తమకు ముద్రగడ గ్లామర్‌ తో పనిలేదని, ఆయనకే తమ వాటా ముఖ్యమని స్పష్టం చేస్తున్నారు. బలిజలు విడిపోతే తాము 3 జిల్లాలకే పరిమితమవుతామన్న భయంతోనే బీసీ రిజర్వేషన్ ముసుగులో తమను కాపుల వెంట తిప్పుకుంటున్నారేతప్ప - తమపై ప్రేమతో వారంటున్నారు. గత ఎన్నికల్లో 3 జిల్లాల్లోని కాపులకు 26 సీట్లు ఇస్తే ఐదారు జిల్లాల్లో ఉన్న బలిజలకు కేవలం రెండు సీట్లే ఇచ్చినప్పుడు ముద్రగడ ఎందుకు మాట్లాడలేదని బలిజ నేతలు ప్రశ్నిస్తున్నారు.

బలిజ యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్ - టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు ఓవీ రమణ ఇదే విష‌యాన్ని ప్ర‌శ్నిస్తున్నారు. ‘మాకు కాపులతో కలిసి ఉద్యమించినందున వచ్చే లాభమేమీ లేదు. మేం బ్రిటీషుకాలం నుంచే బీసీల్లో ఉన్నాం. ఇంకా వారికే ఆ సౌకర్యం లేదు. మూడు జిల్లాల్లో ఉన్నవాళ్లే ఉద్యమిస్తుండగా లేనిది, 6 జిల్లాల్లో బలంగా ఉన్న మేమెందుకు సొంతంగా ఉద్యమించకూడదు? అందుకే మేం దీనిపై జిల్లాల్లో పర్యటించి బలిజల్లో చైతన్యం తెస్తాం. బలిజలు చాలామంది ఇంకా కాపు నాయకత్వంపై భ్రమల్లో ఉన్నారు. మాకు 5 జిల్లాల్లో ఇప్పటికీ రాజకీయ ప్రాతినిధ్యం లేకపోయినా, ఏ ఒక్క కాపు నేత కూడా మాట్లాడలేదు. ఇకపై కాపులు వేరు, బలిజలు వేరు. ఎవరి ఉద్యమాలు వారివి. కాపులకు బీసీ హోదా ఇవ్వవద్దని మేం చెప్పం. మా రాజకీయ ప్రాధాన్యం కోసం పోరాటం చేస్తాం. సంక్రాంతి నుంచి కార్యాచరణకు దిగుతాం’ అని వెల్లడించారు. తాజా పరిణామాల నేపథ్యంలో కాపు ఉద్యమంలో చీలిక అనివార్యంగా కనిపిస్తోంది.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/