Begin typing your search above and press return to search.

కాపుల్లో రిజర్వేషన్ కు ముందే వర్గీకరణ?

By:  Tupaki Desk   |   4 Jan 2017 6:06 AM GMT
కాపుల్లో రిజర్వేషన్ కు ముందే వర్గీకరణ?
X
రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిణామాలు.. ముఖ్యంగా కుల రాజకీయాలు రోజుకో రూటు పడుతున్నాయి. కీలక సామాజికవర్గమైన కాపులకు రిజర్వేషన్ కోరుతూ ఉద్యమాలు పెరిగిన నేపథ్యంలో రాజీకీయాల్లో వారి ప్రాధాన్యం పెరుగుతోంది. అయితే.. ఇదే సమయంలో ఆ వర్గంలో వస్తున్న చీలికలు రాజకీయాలను కొత్త మలుపులు తెస్తున్నాయి. మొత్తంగా కాపుల రిజర్వేషన్ ఉద్యమాన్ని బలహీనపరిచేందుకే ఈ చీలికలు తెస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో కాపు-బలిజ సంక్షేమం కోసం చంద్రబాబునాయుడు సర్కారు ఏర్పాటు చేసిన కాపుకార్పొరేషన్ పేరు-నిధులకు ఎసరొచ్చేలా ఉంది. ఇప్పటివరకూ కలిసి ఉన్న కాపు-బలిజల మధ్య గత కొద్దిరోజుల నుంచి దూరం పెరిగి - ఎవరి దారిన వారు ఉద్యమించాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో, ఇప్పుడు తమకూ ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటుచేయాలన్న డిమాండుకు బలిజలు పదునుపెడుతున్నారు. ఒకవేళ తమకు ప్రత్యేకంగా బలిజ కార్పొరేషన్ ఏర్పాటుచేయకపోతే, ప్రస్తుతం కొనసాగుతున్న కాపు కార్పొరేషన్‌నే రెండుగా చేసి, తమ వర్గానికి చెందిన నేతకు చైర్మన్ పదవి ఇవ్వాలన్న డిమాండును తెరమీదకు తీసుకురానున్నట్లు సమాచారం. దానితోపాటు ప్రస్తుతం కార్పొరేషన్‌ కు ఇస్తున్న నిధులను కూడా జనాభా ప్రాతిపదికన విభజించి, కొత్తగా ఏర్పాటుచేసే బలిజ కార్పొరేషన్‌ కు వాటిని పంపిణీ చేయాలని బలిజ నేతలు డిమాండ్ చేస్తున్నారు. కాపు-బలిజల కోసమే కార్పొరేషన్ ఏర్పాటుచేసినప్పటికీ, అందులో ఎక్కువ మంది కాపులకే రుణాలు అందుతున్నాయన్న అసంతృప్తే బలిజ కార్పొరేషన్ డిమాండుకు ప్రధాన కారణమని తెలుస్తోంది.

తూర్పు - పశ్చిమ గోదావరిలో అధికంగా - కృష్ణా - గుంటూరు జిల్లాల్లోని కొంత భాగం జనాభా ఉన్న కాపులకు ప్రస్తుత కార్పొరేషన్ నిధులను ఆ జనాభా ప్రాతిపదికన కేటాయించి.. అనంతపురం - చిత్తూరు - కర్నూలు - కడప - ప్రకాశం - నెల్లూరు జిల్లాల్లో అధిక జనాభా ఉన్న తమ వర్గానికి మిగిలిన నిధులు కేటాయించేలా చర్యలు తీసుకోవాలన్న డిమాండును తెరపైకి తీసుకువస్తున్నారు బలిజలు. అంతేకాదు.. కాపుల కంటే బలిజలే అధిక సంఖ్యలో ఉన్నారన్న నిజాన్ని వారు తెరపైకి తెచ్చి తమ వాదన వినిపిస్తున్నారు. దీంతో కాపులకు రిజర్వేషన్ రావడం ఎంతవరకు సాధ్యమో కానీ వారు మాత్రం రిజర్వేషన్లకు ముందే వర్గీకరించుకుంటున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/