Begin typing your search above and press return to search.

అధికార, ప్రతిపక్ష అధ్యక్షులు కుమ్మకయ్యారంట

By:  Tupaki Desk   |   24 July 2016 10:08 AM GMT
అధికార, ప్రతిపక్ష అధ్యక్షులు కుమ్మకయ్యారంట
X
ఇద్దరూ తమ పార్టీలకు జిల్లా అధ్యక్షులే. వైకాపా నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి - తెలుగుదేశం తరఫున దామచర్ల జనార్దన్‌ ఒంగోలుపై ఆధిపత్యంకోసం ఒకరిపై ఒకరు తలపడుతున్నారు. ప్రకాశం రాజకీయాల్లో ఒంగోలు కీలకం. జిల్లా కేంద్రంలో విజయం మిగిలిన వాటిపైనా ప్రభావం చూపిస్తుంది. ఇక్కడ పట్టు సాధించేందుకు అన్ని రాజకీయపక్షాలు తమ శక్తియుక్తులను కేంద్రీకరిస్తాయి. ఈ నియోజకవర్గం నుంచి శాసనసభకు గెలవడం ఎంత ముఖ్యమో, ఇక్కడ నగరపాలక ఎన్నికల్లో విజయం సాధించడమూ అంతే అవసరం. అందుకేనేమో రెండు పార్టీలు ఇప్పుడు నగరాన్ని కదనక్షేత్రంగా మలచుకుంటున్నాయి. వైకాపా అధ్యక్షుడిగా ఇటీవలే బాధ్యతలు స్వీకరించిన బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీ పిలుపు మేరకు ఈ నెల 8 నుంచి నగరంలో గడపగడపకు వైకాపా యాత్ర ప్రారంభించారు. మరోవైపు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు దామచర్ల జనార్దన్‌ కూడా రెండేళ్లుగా తాను చేసిన అభివృద్ధిని వివరిస్తూ జనం బాట పట్టారు. అయితే ఇద్ద‌రు నేత‌లు వ్య‌క్తిగత విమ‌ర్శ‌లకు దిగ‌క‌పోవ‌డం కొత్త చ‌ర్చ‌కు తెర‌లేపుతోంది.

2012లో వైకాపా నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి - 2014లో తెలుగుదేశం తరఫున దామచర్ల జనార్దన్‌ విజయం సాధించారు. తర్వాత రెండేళ్లపాటు జిల్లా కేంద్రం చల్లబడింది. తాజాగా వీరిద్దరూ మళ్లీ ప్రజాక్షేత్రంలోకి అడుగులు వేస్తున్నారు. నగరపాలకంలో ఢీకొనేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో జిల్లా కేంద్రంలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కుతున్నాయి. వైకాపాకు జిల్లాలో కీలక నేత ఎవరంటే ముందు వినిపించేది బాలినేని పేరే. 2014 ఎన్నికల్లో వైకాపా తరఫున పోటీ చేసిన ఆయన జిల్లా కేంద్రంలో ఓటమి పాలయ్యారు. ఒంగోలు లోక్‌ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన బంధువు వైవీ సుబ్బారెడ్డి విజయం సాధించారు. ఎన్నికల ముందు నుంచే వీరిద్దరి మధ్య సఖ్యత లేదనే ప్రచారం జోరుగా సాగుతోంది. దానికి తగ్గట్టుగానే బాలినేని నియోజకవర్గానికి రెండేళ్లుగా కొంత దూరంగా ఉంటున్నారు. గతంలో అధినేత జగన్మోహనరెడ్డి స్వయంగా చెప్పినా ఆయన బయటకు రాలేదు. ఒక సమయంలో పార్టీ మారతారనే ఊహాగానాలు కూడా వచ్చాయి. వీటన్నిటి నేపథ్యంలో ఆయన గత నెలలో వైకాపా జిల్లా బాధ్యతలు స్వీకరించడం పార్టీ వర్గాలనే ఒకింత ఉత్సాహంలో నింపింది. జిల్లాకు వచ్చిన ఆయనకు కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. అనంతరం పార్టీ పిలుపు మేరకు నిర్వహిస్తున్న ‘గడపగడపకు వైకాపా’ కార్యక్రమాన్ని ఒంగోలు నుంచే ప్రారంభించిన ఆయన పార్టీ ఆదేశానుసారం ప్రభుత్వాన్ని మాత్రమే లక్ష్యంగా చేసుకుని విమర్శలు సంధిస్తుండటం కూడా రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రెండు ఎన్నికల్లో తన ప్రత్యర్థిగా ఉన్న దామచర్లను గాని - తెదేపాను గాని పల్లెత్తు మాట అనకుండా ముందుకు వెళ్తుండటం గమనార్హం. రాజకీయ పరిణతితో ఇలా చేస్తున్నారా? వ్యూహం ఏమైనా ఉందా? అనేవి వైకాపా నేతల సందేహం.

గత ఎన్నికల్లో ఒంగోలు నుంచి విజయం సాధించిన ఎమ్మెల్యే జనార్దన్‌ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా మరోమారు తన స్థానాన్ని పదిలం చేసుకున్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం అధికారంలోకి రావడంతో జిల్లా రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసుకుంటున్నారు. రెండేళ్ల సమయంలో నియోజకవర్గంలో రూ.400 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానంటున్న ఆయన వార్డుల వారీగా వాటిని ప్రజల్లోకి తీసుకెళ్తానని గతంలోనే ప్రకటించారు. అయితే తన రాజకీయ ప్రత్యర్థి జనంలోకి వెళ్తున్న సమయంలోనే ఆయన కూడా వార్డులబాట పట్టడం నగరంలో చర్చను రేకెత్తిస్తోంది. జనార్దన్‌ నగరపాలక అధికారులతో కలిసి డివిజన్లలో పర్యటిస్తున్నారు. ఆయన కూడా తన ప్రత్యర్థిని లక్ష్యంగా చేసుకోకుండా ముందుకు సాగుతుండటాన్ని తెదేపా వర్గాలు గుర్తు చేస్తున్నాయి.

నాయకులిద్దరూ ఎవరి తీరున వారు నడుస్తున్నా ఇద్దరి లక్ష్యం త్వరలో జరగనున్న ఒంగోలు నగరపాలక సంస్థ ఎన్నికలే అని రాజకీయ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. నవంబరు నాటికి వీటిని నిర్వహిస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. అందుకే తమకున్న పట్టణ ఓటుబ్యాంకును పదిలం చేసుకోవాలని అధికార తెలుగుదేశం పార్టీ ప్రయత్నిస్తోంది. వైకాపా పరంగా కార్యకర్తల్లో ఉత్సాహం నింపి వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గాలి వీచేలా చూసుకోవాలని ఆ పార్టీ నాయకులు తపిస్తున్నారు. వీరిద్దరి వ్యూహ, ప్రతివ్యూహాలకు ప్రజల జవాబు ఎలా ఉండబోతోందనేది మరో నాలుగు నెలల్లో తేలనుంది.