Begin typing your search above and press return to search.

ప్ర‌భుత్వంపై మండిప‌డ్డ అధికార పార్టీ ఎంపీ

By:  Tupaki Desk   |   19 Sep 2015 5:15 AM GMT
ప్ర‌భుత్వంపై మండిప‌డ్డ అధికార పార్టీ ఎంపీ
X
అధికార పార్టీ ఎంపీ అంటే ఎలా ఉండాలి? అది కూడా ముఖ్య‌మంత్రికి, ఆయన కుటుంబానికి న‌మ్మిన బంటు లాంటి వ్య‌క్తి అయితే...అబ్బో ఆ సేనే వేరేగా ఉంటుంది క‌దా. నాయ‌కుల ఫాలోయింగ్‌....అధికారుల అండ‌దండ‌లు...చెప్పిన ప‌ని క్ష‌ణాల్లో అయిపోవ‌డం ఇలా ఎన్నో ఉంటాయి. అయితే అలాంటివేమీ లేక‌పోవ‌డం ఇపుడు తెలంగాణ‌లోని అధికార పార్టీ ఎంపీ గుస్సాకు కార‌ణం అయింది. ఆగ్ర‌హంతో త‌న కులం గురించి చిన్న‌బుచ్చుకునే స్థాయికి చేరింది.

పెద్దపల్లి ఎంపీ బాల్క సుమ‌న్ తెలంగాణ సీఎం కేసీఆర్ కుటుంబానికి స‌న్నిహితుడు అనే పేరుంది. ఓయూ విద్యార్థిగా ఉన్న‌ప్ప‌టినుంచి ఆయ‌న టీఆర్ ఎస్ భావ‌జాలంతో ఉన్నారు. కేసీఆర్ చ‌ల‌వ వ‌ల్ల ఎంపీ టికెట్ పొంది సీనియ‌ర్ నాయ‌కుడు అయిన జి.వివేక్‌ పై గెలుపొందారు. అయితే ఆయ‌న‌కు స‌రైన గౌర‌వం దక్క‌ట్లేద‌ట‌. అది కూడా కులం కార‌ణంగాన‌ట‌. ఇదేదో గాసిప్ అనుకునేరు. సాక్షాత్తు ఎంపీగారే ఈ ర‌కంగా ఫైర‌య్యారు మ‌రి.

కరీంనగర్‌ కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో కరీంనగర్‌ ఎంపీ వినోద్‌ కుమార్‌ అధ్యక్షతన విజిలెన్స్‌, మానిటరింగ్‌ సెల్‌ కమిటీ సమావేశం జ‌రిగింది.

ఉదయం 11 గంటలకు ప్రారంభమైన స‌మావేశానికి మధ్యాహ్నం 2 గంటలకు హాజరైన ఎంపీ బాల్క సుమన్‌ వచ్చీరావడంతోనే అధికారులపై మండిపడ్డారు. సమావేశం మధ్యాహ్నం 2 గంటలకు అని చెప్పి.. ఉదయం 11 గంటలకే ఎలా ప్రారంభిస్తారని ఆయన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను పెద్దపల్లి ఎంపీనని, ఆ నియోజకవర్గం కరీంనగర్‌ జిల్లాలోనే ఉందన్న విషయాన్ని అధికారులు గుర్తుంచుకోవాలని ఆయన మండిపడ్డారు. @నేను కరీంనగర్‌ జిల్లాకు చెందిన ఎంపీనే. ప్రొటోకాల్ ప్ర‌కారం న‌న్ను గౌర‌వించ‌డం లేదు. ప్ర‌భుత్వ స‌మావేశాల‌కు, కార్యక్రమాలకు పిలవకుండా నన్ను అవమానపరుస్తున్నారు. నా పేరు వెనక సుమన్‌ శర్మనో.. సుమన్‌ రావు అనో.. లేదంటే సుమన్‌ రెడ్డి అనో ఉంటే పిలిచేవారేమో’’ అంటూ జిల్లా అధికారులపై బాల్క సుమన్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శిలాఫలకాలపైనా తన పేరును ఎక్కడో చేరుస్తున్నారని, ప్రొటోకాల్‌ సరిగా పాటించడం లేదని మండిపడ్డారు.

తెలంగాణ ప్ర‌భుత్వంలో కూడా అధికారులు మాట విన‌డం లేదంటూ ఈ యువ ఎంపీ చిర్రుబుర్రులాడారు. అయితే సీఎం కేసీఆర్ కుటుంబానికి ఎంతో ద‌గ్గ‌ర అని తెలిసినా అధికారులు బాల్క సుమ‌న్‌ ను ప‌ట్టించుకోవ‌డం లేదంటే... ఆలోచించాల్సిన విష‌య‌మే.