Begin typing your search above and press return to search.

తిట్టిపోసిన నోళ్లే తియ్యగా మాట్లాడుతున్నాయ్

By:  Tupaki Desk   |   15 Dec 2015 9:30 AM GMT
తిట్టిపోసిన నోళ్లే తియ్యగా మాట్లాడుతున్నాయ్
X
రాజకీయాల్లో బద్ధ విరోధులు కూడా ఒక్కోసారి ఎంతో మంచివారిగా, గౌరవ ప్రదమైన వ్యక్తులుగా కనిపిస్తారు. తాజాగా చంద్రబాబు - కేసీఆర్ ల భేటీ సందర్బంగా తెలంగాణకు చెందిన ఇద్దరు నేతలకు తమ ప్రత్యర్థులు చేసిన పనులు ఎంతో పసందుగా అనిపించాయి. దానిపై వారు తమ ఆనందం అందరితో పంచుకోవడం చూసి అంతా షాకవుతున్నారు.

పెద్దపల్లి బాల్క సుమన్ సంగతి తెలియనివారు లేరు. విద్యార్థి నేతగా ఉన్న ఆయన స్ట్రాంగ్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న వివేక్ పై గెలిచి పెద్దపల్లి ఎంపీ అయ్యారంటే అది చిన్న విషయం కాదు. తెలంగాణ - టీఆరెస్ వేవ్ ఆయనకు కొంత కలిసి రావడంతో పాటు అంతకుముందు తెలంగాణ ఉద్యమంలో భాగంగా ఆయన ఆంధ్ర నేతలు, ప్రత్యేకించి చంద్రబాబుపై విరుచుకుపడిన విధానం వీరతెలంగాణ వాదులకు బాగా నచ్చింది కూడా. ఆయన నోరు విప్పితే చంద్రబాబుపై ఎగిరిపడేవారు. అలాంటి బాల్క సుమన్ ఇప్పుడు చంద్రబాబు సూపర్ అంటున్నారు. ''అబ్బబ్బ... ఏం భోజనం పెట్టారండీ" అంటూ ఇంకా త్రేన్చుతున్నారు. చంద్రబాబును కలవడానికి వెళ్లిన కేసీఆర్ వెంట బాల్క సుమన్ కూడా వెళ్లారు.. కేసీఆర్ కు మర్యాద చేసినట్లే చంద్రబాబు.. రాజకీయంగా చిన్న అన్నది ఏమీ పెట్టుకోకుండా హుందాగా బాల్క సుమన్ ను కూడా శాలువా కప్పి సత్కరించి మర్యాదలు చేశారు. దీంతో సుమన్ కూడా చంద్రబాబు చేసిన మర్యాదలకు ఫిదా అయిపోయారు. మరీ ముఖ్యంగా 15కి పైగా వంటకాలతో ఏర్పాటు చేసిన విందు సుమన్ ను పిచ్చెక్కెంచేసిందట. అందుకే విజయవాడ నుంచి వచ్చిన తరువాత ఆయన చంద్రబాబును తెగ పొగిడేశారు. ముఖ్యమంత్రి కెసిఆర్ తో కలిసి విజయవాడ వెళ్లి రావడం సంతోషంగా ఉందని, చంద్రబాబు ఇచ్చిన విందు చాలా బాగుందని ఆయన అన్నారు. తాను మొదటిసారి విజయవాడ వెళ్లానని ఆయన చెప్పారు. రెండు రాష్ట్రాల మద్య మరింత మంచి వాతావరణం ఏర్పడడానికి ఇది ఉపయోగపడుతుందని సుమన్ అన్నారు.

అదేవిధంగా కేసీఆర్ అంటే గయ్య్ మని లేచే టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ చేసిన పనిని మెచ్చుకోవడం విశేషం. అయుత చండీయాగానికి చంద్రబాబును ఇంటికెళ్లి మరీ కేసీఆర్ ఆహ్వానించడం చాలా మంచిపని అని రేవంత్ అంటున్నారు. ఇంట్లో కార్యక్రమం కాబట్టి మరో సీఎంను పిలవడంలో ఎలాంటి తప్పూ లేదన్నారు రేవంత్. కాంగ్రెసోళ్లు ఎన్ని కామెంట్లు చేస్తున్నా రేవంత్ రెడ్డి మాత్రం తమ బాస్ ను పిలిచి కేసీఆర్ చాలా మంచి పని చేశారని ప్రశంసలు కురిపించారు.

అయితే... సుమన్ అయినా, రేవంత్ అయినా తమ ప్రత్యర్థులపై ప్రశంసలు కురిపించడానికి కారణమేంటో అందరికీ తెలిసిందే. స్వయంగా ప్రత్యర్థులైన తమ బాస్ లే భుజంభుజం రాసుకుంటే మధ్యలో మాకెందుకు అనుకోవడమే దానికి కారణం.