Begin typing your search above and press return to search.

సరిహద్దుల్లో పాక్‌ గాలిబుడగల బెదిరింపు!!

By:  Tupaki Desk   |   2 Oct 2016 10:59 AM GMT
సరిహద్దుల్లో పాక్‌ గాలిబుడగల బెదిరింపు!!
X
పాక్ చేసే పనులను చిల్లర పనులు అనాలో, లేక చికాకు తెప్పించే కార్యక్రమాల్లో భాగాలు అనాలో కానీ... వారి చేసే పనులు భయాన్ని కలిగించవు సరికదా చికాకు తెప్పిస్తుంటాయి. తాజాగా అలాంటి చికాకు పనే ఒకటి సరిహద్దుల్లో జరిగింది. ప్రస్తుతం భారత్ సర్జికల్ స్ట్రైక్ అనంతరం సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న దశలో పాకిస్థాన్ హుందాగా వ్యవహరించాలి.. లేదా దైర్యంగా ముందుకు రావాలి.. అంతే కానీ చిల్లర పనుల్లో భాగంగా బుడగలతో బెదిరిస్తుంది. ఆ బుడగలను భారత్ వైపు ఎగరేసి, వాటికి కాగితాలు కట్టి, ఆ కాగితాలపై చిల్లరి రాతలు రాస్తుంది!

తాజాగా పాకిస్థాన్ నుంచి పెద్ద సంఖ్యలో బుడగలు (బెలూన్స్) భారత సరిహద్దులోకి వచ్చి వాలుతున్నాయి. ఈ చిల్లర పనులు ప్రస్తుతం సరిహద్దుల్లో కలకలం రేపుతున్నాయి. పంజాబ్‌ లో సరిహద్దుల మీదుగా ఎగురుతూవస్తున్న సుమారు 30 - 40 గాలిబుడగలను బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్‌ఎఫ్‌) సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. పఠాన్‌కోట్‌, అమృతసర్‌, ఫీరోజ్‌పూర్‌ ఆర్మీ ఔట్‌పోస్టుల ఈ గాలిబుడగలు వద్ద అత్యధిక సంఖ్యలో దొరికాయి. అలా పాక్ నుంచి ఎగిరొచ్చిన వాటిగా చెబుతున్న ఈ గాలిబుడగలకు ఉర్దూ బాషలో భారత్‌ వ్యతిరేక సందేశాలున్న కాగితాలు కట్టి ఉన్నాయి. భారతీయ సైనికులను బెదిరిస్తూ, భారతీయ మహిళలను దూషిస్తూ అసభ్య వ్యాఖ్యలతో కూడిన ఈ బెలూన్స్ అధికసంఖ్యలో వస్తున్నాయి. వీటిలో మరికొన్ని బుడగలపై నరేంద్రమోడీకి సవాళ్లు విసురుతున్న సందేశాలు కూడా ఉన్నాయి. "పాకిస్థాన్‌ సైన్యం సత్తా ఏమిటో తెలుసుకోవాలంటే.. నేరుగా తలపడి చూసుకో మోడీ" అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఈ బెలూన్స్ కు కట్టిన కాగితాల్లో ఉన్నాయి.

కాగా గత జనవరిలో కూడా గణతంత్ర దినోత్సవం సందర్భంగా పాకిస్థాన్‌ నుంచి రాజస్థాన్‌ మీదుగా ఒక భారీ హెలియం బెలూన్‌ ప్రయాణించింది! అమెరికాలో తయారైందిగా గుర్తింపబడ్డ ఈ బెలూన్‌ 25వేల అడుగుల ఎత్తులో ఉండగానే భారత వైమానిక దళం (ఐఏఎఫ్‌) గుర్తించి కూల్చేసిన సంగతి తెలిసిందే. తమ దేశం నుంచి బెలూన్లు ఎగిరి వెళితే భారత్‌ స్పందన ఎలా ఉంటుంది? వాటిని ఎంతసేపటిలో గుర్తిస్తారు? అనే విషయాలు తెలుసుకోవడానికి పాక్‌ సైన్యం ఇలాంటి చిల్లర పనులకు పాల్పడుతుందేమో అని భారత సైనికాధికారులు అనుమానిస్తున్నారట!!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/