Begin typing your search above and press return to search.

బ‌ల్మూరి.. బ‌ల‌వుతారా? బ‌ల‌మ‌వుతారా?

By:  Tupaki Desk   |   4 Oct 2021 8:32 AM GMT
బ‌ల్మూరి.. బ‌ల‌వుతారా? బ‌ల‌మ‌వుతారా?
X
తెలంగాణ‌లో రాజ‌కీయ కాక పుట్టిస్తున్న హుజూరాబాద్ ఉప ఎన్నిక‌ల సంద‌డి మ‌రో స్థాయికి చేరింది. నామినేష‌న్లు ప్ర‌చారంతో అభ్య‌ర్థులు సంద‌డి చేస్తున్నారు. ఇక ఈ ఎన్నిక విష‌యంలో చాలా కాలం పాటు స్త‌బ్ధుగా ఉన్న కాంగ్రెస్‌.. ఎట్ట‌కేల‌కు త‌మ అభ్య‌ర్థిని ప్ర‌క‌టించి పోటీలో దిగుతున్నామ‌నే విష‌యాన్ని స్ప‌ష్టం చేసింది. ఇన్ని రోజుల స‌రైన అభ్య‌ర్తి కోసం తంటాలు ప‌డ్డ కాంగ్రెస్‌.. వేచి చూసే ధోర‌ణి అవ‌లంబించింది. ఇక నోటిఫికేష‌న్ కూడా విడుద‌ల కావ‌డం ఈ నెల‌లోనే ఎన్నిక ఉండ‌డంతో విద్యార్థి నాయ‌కుడు బ‌ల్మూరి వెంక‌ట్ న‌ర్సింగ‌రావును అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించింది.

హుజూరాబాద్‌లో కాంగ్రెస్ జెండా ఎగ‌రేస్తాన‌ని ఆత్మ‌విశ్వాసంతో చెప్తున్న వెంక‌ట్‌కు అక్క‌డ అనుకూలమైన ప‌రిస్థితులు ఉన్నాయా? అన్న‌ది ఇప్పుడు వినిపిస్తున్న ప్ర‌శ్న‌. రాజ‌కీయాల్లో ప్ర‌త్య‌ర్థిని ఢీ కొట్టాలంటే ముందు మ‌నం బ‌లంగా ఉండాలి. కానీ హుజూరాబాద్‌లో వెంక‌ట్ త‌ల‌ప‌డే ప్ర‌త్య‌ర్థులే అత‌ని కంటే ఎన్నో రెట్లు బ‌లంగా ఉన్నారు. పైగా వాళ్ల‌కు ఆ నియోజ‌క‌వ‌ర్గంలో మంచి ప‌ట్టుంది. బీజేపీ అభ్య‌ర్థి ఈట‌ల రాజేంద‌ర్‌కు సుదీర్ఘ‌మైన రాజ‌కీయ అనుభ‌వం ఉంది. ఆయ‌న ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. టీఆర్ఎస్ ప్ర‌భుత్వంలో మంత్రిగానూ ప‌నిచేశారు. ఇక ఈ ఎన్నిక‌లో విజ‌యం ఆయ‌న స‌ర్వ‌శ‌క్తులూ ఒడ్డుతున్నారు. మ‌రోవైపు టీఆర్ఎస్ అభ్య‌ర్థి గెల్లు శ్రీనివాస్ యాద‌వ్కు టీఆర్ఎస్వీ అధ్య‌క్షుడిగా ప‌ని చేసిన అనుభ‌వం ఉంది. రాజ‌కీయంగా ఆయ‌న‌కు పెద్ద పేరు లేన‌ప్ప‌టికీ.. టీఆర్ఎస్ విజ‌యం కోసం ఇప్ప‌టికే ఆ నియోజ‌క‌వ‌ర్గంలో మంత్రులు పాగా వేశారు. అధికార పార్టీ అండ‌దండ‌లు గెల్లుకు ఉన్నాయి.

ఈ నేప‌థ్యంలో ప్ర‌ధాన పోటీ బీజేపీ టీఆర్ఎస్ మ‌ధ్య‌నే ఉండ‌నుంది. ఈ రెండు పార్టీల‌ను ఎదుర్కోవ‌డం కాంగ్రెస్‌కు క‌ష్ట‌మే. అలాంటి ప‌రిస్థితుల్లో బ‌ల్మూరి వెంక‌ట్ పేరును ఖ‌రారు చేయ‌డం వెన‌క కాంగ్రెస్ వ్యూహం వేరే ఉంద‌ని అర్థ‌మవుతోంది. ఓట‌మి ముందే తెలిసినా.. పోటీ చేయ‌క‌పోతే పరువు పోతుంద‌ని భావించిన కాంగ్రెస్‌.. వెంట్రుక‌తో కొండ‌ను లాగుదామ‌నే ప్ర‌య‌త్నం చేస్తోంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు. ఓడిపోతే పెద్ద‌గా ఎలాంటి ప్ర‌భావం ఉండ‌దు. కానీ గెలిస్తే మాత్రం అది సంచ‌ల‌న‌మే. ఈ నేప‌థ్యంలో బ‌ల్మూరి కాంగ్రెస్ వ్యూహానికి బ‌లంగా మార‌తారా? లేదా బ‌ల‌వుతారా? అనే అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి సంఘం ఎన్ఎస్‌యూఐ అధ్య‌క్షుడిగా అనుభ‌వం ఉన్న వెంక‌ట్‌కు పెద్ద‌గా ఛ‌రిష్మా లేద‌నే చెప్పాలి. రెండు ప్ర‌ధాన పార్టీల‌కు పోటీగా నిల‌బ‌డుతున్న‌పుడు అంద‌రికీ తెలిసిన అభ్య‌ర్థిని పోటీలోకి దించాల్సి ఉంటుంది. కానీ బ‌ల్మూరికి ఎక్కువ‌గా ప్రాచుర్యం లేద‌నేది నిజం. కానీ ఆత్మ‌విశ్వాసంతో క‌నిపిస్తున్న అత‌ను.. ఆ నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీకి ఉన్న బ‌లాన్ని తిరిగి రాబ‌డితే మెరుగైన ఫ‌లితాలు సాధించే అవ‌కాశం ఉంద‌న్న అభిప్రాయాలు వ్య‌క్త‌మవుతున్నాయి. గ‌త ఎన్నిక‌ల్లో ఆ పార్టీ త‌ర‌పున పోటీ చేసిన కౌశిక్ రెడ్డి ఈట‌ల త‌ర్వాత రెండో స్థానంలో నిలిచారు. దీన్ని బ‌ట్టి చూస్తే అక్క‌డ కాంగ్రెస్‌కు ఓటు బ్యాంకు ఉంద‌నేది స్ప‌ష్ట‌మ‌వుతోంది. దాన్ని ఎలా స‌ద్వినియోగం చేసుకుంటార‌న్న‌దే అస‌లు విష‌యం. తెలంగాణ‌లో కాంగ్రెస్ ఇప్ప‌టివ‌ర‌కూ ఒక్క ఉప ఎన్నిక‌లోనూ గెల‌వ‌లేదు. హుజూర్న‌గ‌ర్ దుబ్బాక నాగార్జున‌సాగ‌ర్‌లో ఓట‌మే ఎదురైంది. ఈ నేప‌థ్యంలో హుజూరాబాద్‌లో బ‌ల్మూరి ఎలాంటి ప్ర‌ద‌ర్శ‌న చేస్తాడో చూడాలి.