Begin typing your search above and press return to search.

చంద్ర‌బాబు ప‌ర్య‌టించే ప్రాంతాల‌పై నిషేధం.. పోలీసులు ఏం చేశారంటే!

By:  Tupaki Desk   |   25 Nov 2021 3:30 AM GMT
చంద్ర‌బాబు ప‌ర్య‌టించే ప్రాంతాల‌పై నిషేధం.. పోలీసులు ఏం చేశారంటే!
X
టీడీపీ అధినేత‌, మాజీ సీఎం చంద్ర‌బాబు.. ప్ర‌స్తుతం చిత్తూరు ప‌ర్య‌ట‌న‌లో ఉన్నారు. ఇక్క‌డ ఇటీవ‌ల కురిసిన వ‌ర్షాలు.. పోటెత్తిన వ‌ర‌ద‌ల‌తో ప్ర‌జ‌లు రోడ్డున ప‌డ్డారు. స‌ర్వం కోల్పోయారు. కేవలం క‌ట్టుబ‌ట్ట‌ల‌తో మిగిలారు. దాత‌లు అందిస్తున్న ఆహారం, తాగు నీటితో రోజులు గ‌డుపుతున్నారు. జ‌గ‌నన్న ప్ర‌భుత్వం క‌దిలి వ‌స్తుంది.. ఏదో చేస్తుంది..అని క‌ళ్ల‌లో కోటి ఆశ‌ల దీపాలు వెలిగించి.. క‌ష్టాన్ని పంటిబిగువున ప‌ట్టి ఎదురు చూస్తున్నారు. అయితే.. స‌ర్కారు పెద్ద‌గా చ‌లించ‌లేదు. దీనికి కార‌ణాలు `అనేకం` ఉండొచ్చు. కానీ.. క‌ష్టంలో ఉన్న‌వారిని క‌నీసం ప‌రామ‌ర్శించాలి క‌దా! అది కూడా చేయ‌లేదు. దీంతో విప‌క్ష నాయ‌కుడు.. చంద్ర‌బాబు రంగంలోకి దిగారు.

చిత్తూరు జిల్లాలోని రాయలచెరువును పరిశీలించేందుకు చంద్రబాబు వెళ్లారు. అయితే రాయలచెరువుకు వెళ్లొద్దని చంద్రబాబుకు పోలీసులు నోటీసులిచ్చారు. చంద్రబాబు పర్యటనకు అనుమతిలేదని తేల్చేశారు. వాస్త‌వానికి ఉద‌యం నుంచి చంద్ర‌బాబు అక్క‌డ ప‌ర్య‌టిస్తున్నారు. ఈ క్ర‌మంలో తీవ్ర‌స్తాయిలో దెబ్బ‌తిన్న రాయలచెరువును ప‌రిశీలించి.. ఇక్క‌డి బాధితుల‌కు ధైర్యం చెప్పే ప్ర‌య‌త్నం చేశారు. అయితే.. ఇది రాజ‌కీయంగా.. త‌మ‌కు ఇబ్బంది అవుతుంద‌ని భావించిన ప్ర‌భుత్వం.. వెంట‌నే ఈ ప్రాంతాన్ని రెడ్‌జోన్‌గా ప్రకటించేసింది. చంద్ర‌బాబు స‌హా టీడీపీ నేత‌లు ఎవ‌రూ అక్క‌డ‌కు వెళ్ల‌రాద‌ని.. నిషేధాజ్ఞ‌లు జారీ చేశారు. దీంతో టీడీపీ నేత‌లు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

ఇదిలావుంటే, వందకుపైగా గ్రామాలను, పది వేల మంది ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్న రాయలచెరువు వ్యవహారం ఈ స్థితికి చేరడానికి బాధ్యులెవరన్న ప్రశ్న ఇపుడు చర్చనీయాంశమవుతోంది. ఈ చెరువు దిగవన వందకు పైగా గ్రామాలకు ఈ నీళ్లు ప్ర‌యోజ‌నం. దీంతో పాటు ప్రమాదం కూడా కలిగించే స్థాయిలో ఉంటున్నాయి. చెరువు కింద రామచంద్రాపురం మండల పరిధిలో 112 గ్రామాలున్నాయి. వీటితో పాటు తిరుపతి రూరల్‌ మండలం పరిధిలో కుంట్రపాకం, తనపల్లి, పాడిపేట, ముళ్ళఊడి, తిరుచానూరు తదితర ప్రాంతాలకు కూడా భూగర్భ జలాల పరంగా ప్రయోజనాన్ని, కట్టతెగితే ఊళ్ళకు ఊళ్ళను కొట్టుకుపోయేలా చేసే ప్రమాదాన్ని కలిగించే స్థితిలో ఉంది. దీంతో ఇక్క‌డ ప‌ర్య‌టించి ప్ర‌భుత్వానికి సూచ‌న‌లు , స‌ల‌హాలు ఇవ్వాల‌ని అనుకున్న చంద్ర‌బాబుకు ప్ర‌భుత్వం మోకాల‌డ్డింది.