Begin typing your search above and press return to search.

మీ ప్ర‌ధాని అభ్య‌ర్థి ఎవ‌రు కేటీఆర్?

By:  Tupaki Desk   |   11 March 2019 4:15 AM GMT
మీ ప్ర‌ధాని అభ్య‌ర్థి ఎవ‌రు కేటీఆర్?
X
పెద్ద‌మ‌నిషిగా ఉంటూ.. హాట్ హాట్ గా విమ‌ర్శ‌లు చేయ‌కుండా.. సున్నితంగా.. సుతిమెత్త‌గా మాట్లాడే త‌త్త్వం ఉన్న బీజేపీ సీనియ‌ర్ నేత బండారు ద‌త్తాత్రేయ‌కు కోపం వ‌చ్చింది. కొద్ది రోజులుగా తెలంగాణ రాష్ట్రంలోని 17 ఎంపీ స్థానాల‌కు ఒక స్థానం త‌మ మిత్రుడికి వ‌దిలేయ‌గా.. మిగిలిన 16 స్థానాల్ని సొంతం చేసుకుంటామంటూ ఆయ‌న చేస్తున్న ప్ర‌చారంపై ద‌త్తాత్రేయ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

రాష్ట్రంలోని 16 సీట్లు తామేన‌ని చెప్పే కేటీఆర్.. కేంద్రంలో చ‌క్రం తిప్పుతామ‌ని చెబుతున్నార‌ని.. ముందు మీ కూట‌మి ప్ర‌ధాని అభ్య‌ర్థి ఎవ‌రో చెప్పండి? అంటూ ప్ర‌శ్నించారు. త‌న ప్ర‌శ్న‌కు కేటీఆర్ స‌మాధానం చెప్ప‌గ‌ల‌రా? అంటూ స‌వాల్ విసిరారు. బీజేపీ.. ఓబీసీ మోర్చా ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన బీసీల ఆత్మ‌గౌర‌వ స‌భ‌లో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా ఎన్నిక‌ల శంఖారావాన్ని ఆయ‌న పూరించారు.

ప‌వ‌ర్లో కాంగ్రెస్ ఉన్న‌ప్పుడు బీసీల‌కు అన్యాయం జ‌రిగింద‌న్న ఆయ‌న మోడీ హ‌యాంలో బీసీల‌కు మేలు జ‌రిగింద‌న్నారు. ఎవ‌రెన్ని కుట్ర‌లు చేసినా న‌రేంద్ర మోడీ మ‌రోసారి ప్ర‌ధాన‌మంత్రి అవుతార‌న్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న‌ప్పుడు విద్య‌.. ఉద్యోగాల్లో బీసీల‌కు తీవ్ర అన్యాయం జ‌రిగింద‌న్నారు. కొన్నేళ్లుగా కాంగ్రెస్ బీసీల‌ను ఓటు బ్యాంక్ గా వాడుకుంద‌న్న ఆయ‌న‌.. మోడీ హ‌యాంలో మాత్రం బీసీ క‌మిష‌న్ ను ఏర్పాటు చేసి మేలు చేశార‌న్నారు.

బీసీ అయిన మోడీ కేవ‌లం ఆ వ‌ర్గానికే కాకుండా ఆగ్ర‌వ‌ర్ణాల్లోని ఆర్థికంగా వెనుక‌బ‌డిన వారికి కూడా రిజ‌ర్వేష‌న్లు క‌ల్పిస్తూ మేలు చేశార‌న్నారు. కులం రంగు పులుముకోకుండా అన్ని వ‌ర్గాల వారికి మేలు చేసిన క్రెడిట్ మోడీకే ద‌క్కుతుంద‌న్న ఆయ‌న‌.. తాజా ఎన్నిక‌ల్లో బీజేపీని అత్య‌ధిక ఎంపీ సీట్ల‌లో గెలిపించాల‌న్నారు. ద‌త్త‌న్న విసిరిన స‌వాల్ కు కేటీఆర్ రియాక్ట్ అవుతారా? ఆయ‌న సూటి ప్ర‌శ్న‌కు అంతే సూటిగా జ‌వాబు ఇస్తారా? లేదంటే వాక్ చాతుర్యంతో రివ‌ర్స్ స‌వాలు విసిరి.. స‌మాధానం చెప్ప‌కుండా త‌ప్పించుకుంటారా? అన్న‌ది చూడాలి.