Begin typing your search above and press return to search.

గులాబీపై కమలం ప్రేమలో మార్పొస్తోందా?

By:  Tupaki Desk   |   10 Nov 2015 3:53 AM GMT
గులాబీపై కమలం ప్రేమలో మార్పొస్తోందా?
X
తెలంగాణలో తెలుగుదేశం- భాజపా మిత్రపక్షాలు అనే సంగతి అందరికీ తెలుసు. కానీ కమలదళం మాత్రం.. గులాబీ పార్టీకి కూడా తాము మిత్రపక్షమే అన్నట్లుగానే చాలా సందర్భాల్లో వ్యవహరిస్తూ వస్తోంది. ఏదో మొక్కుబడిగా కొన్ని ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాలు చేయడమూ పాదయాత్రలు గట్రా నడిపించడమూ, ధర్నాలు, ఓట్ల తొలగింపు నిరసనలూ చేశారే తప్ప.. నిర్దిష్టంగా కేసీఆర్‌ సర్కారు పాలనకు వ్యతిరేకంగా వారు చెలరేగడం అంటూ ఏమీ జరగలేదు. అదే సమయంలో కమలదళంలో బాధ్యతలు వాటాలు పంచుకున్నట్లుగా కొందరు నాయకులు మొక్కుబడి ఆందోళనలు చేస్తోంటే.. కొందరు కేసీఆర్‌ ను సుతిమెత్తని పొగడ్తలతో స్నేహబంధాలు కొనసాగించడానికి మాట్లాడుతుండేవారు. అదే రీతిలో కేసీర్‌ కుటుంబ నేతలు, గులాబీ ప్రముఖులు కూడా కొన్ని కీలక సందర్భాల్లో మోడీ సర్కారు భేష్‌ అన్న సందర్భాలూ లేకపోలేదు.

కానీ బీహార్‌ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో వ్యవహారాలు అన్నీ రూపు మారుతున్నట్లు అనిపిస్తోంది. ఒకవైపు మోడీ సర్కార్ లో పాజిటివ్‌ అంశాల్ని మాత్రమే ఇన్నాళ్లూ గమనిస్తూ వచ్చిన ఎంపీ కవిత... ఇప్పుడు మోడీకి బుద్ధి వస్తుందంటూ వ్యాఖ్యానిస్తున్నారు. తెలంగాణను చిన్నచూపు చూసే వైఖరి కేంద్రానికి ఇకనైనా తగ్గాలంటూ ఆమె హెచ్చరిస్తున్నారు. అదే సమయంలో.. కేసీఆర్‌ సర్కారు పట్ల చక్కెరపూత వంటి విమర్శలు చేస్తూ ఉండే భాజపా కేంద్రమంత్రి దత్తాత్రేయ కూడా తీరు మార్చినట్లుగా కనిపిస్తోంది. కేసీఆర్‌ సర్కారు గురించి నిశిత విమర్శలు చేయడంలో ఆయన తీరు కాస్త మారినట్లు కనిపిస్తోంది. కేసీఆర్‌ ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తున్నారంటూ విరుచుకుపడుతున్నారు.

కేంద్రంలో అంతా సవ్యంగా ఉన్నంత వరకు పరిస్థితి వేరు! ఒక్క రాష్ట్రంలోని ఫలితాలతో తేడా కనిపించగానే.. దేశవ్యాప్తంగా మోడీ సర్కారు పట్ల స్థానిక పార్టీలు అనుసరించే ఎప్రోచ్‌ లో ఎంతో మార్పు వచ్చేస్తుందని ఈ తాజా దృష్టాంతం మనకు సాధికారికంగా నిరూపిస్తూ ఉంది. అయినా రాజకీయాల్లో ఇలా అగ్రపూజ అందుకున్న వారు శత్రువులైనా పైకి కనిపించకుండా భజన చేయడం, వారి హవా పడిపోయిందని తెలిస్తే రాళ్లు విసరడం మామూలే ఏమో!