Begin typing your search above and press return to search.

డిల్లీలో కేంద్రమంత్రికి ఎన్ని కష్టాలో

By:  Tupaki Desk   |   12 April 2015 9:44 AM GMT
డిల్లీలో కేంద్రమంత్రికి ఎన్ని కష్టాలో
X
ఢిల్లీలో సామాన్యులు ఇంటి కోసం కష్టాలు పడ్డారంటే అర్థముంది. కానీ సాక్షాత్తు కేంద్రమంత్రికి కూడా ఇంటి కష్టాలు తప్పడం లేదు. సౌమ్యుడిగా ఉండే తెలంగాణకు చెందిన కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయకు దేశరాజధాని ఢిల్లీలో అధికార నివాసం కరవైంది. ఢిల్లీలోని కొపర్నికస్‌ మార్గ్‌లోని 20వ నంబర్‌ బంగళాను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. అయితే దానిలో దత్తాత్రేయ ఉండలేకపోతున్నారు. ప్రస్తుతం ఆ బంగళాలో ఉన్న ఎంపీ దాన్ని ఖాళీ చేయకపోవడంతో దత్తన్న ఏపీభవన్‌లోని ఓ సాధారణ గదిలో బస చేయాల్సి వస్తోంది.

దత్తాత్రేయకు ప్రస్తుత కేటాయించిన భవనంలో 2014 వరకు ఎంపీగా ఉన్న కల్యాణ్‌సింగ్‌ నివసించేవారు. ప్రస్తుతం కల్యాణ్‌సింగ్‌ రాజస్థాన్‌ గవర్నర్‌గా వెళ్లారు. అయితే ఆ బంగళాలో కల్యాణ్‌సింగ్‌ కుమారుడు, ఎంపీ రాజ్‌వీర్‌సింగ్‌ ఉంటున్నారు. రాజ్‌వీర్‌ ఈ బంగళాను ఎందుకు ఖాళీ చేయడం లేదంటే ఆయనకు కేటాయించిన ఇంట్లో మరో ఎంపీ దుష్యంత్‌సింగ్‌ ఉంటున్నారు. రాజస్థాన్‌ ముఖ్యమంత్రి వసుంధరా రాజే కుమారుడు దుష్యంత్‌సింగ్‌!

దుష్యంత్‌ ఆ బంగళాను ఎందుకు ఖాళీ చేయలేదంటే... ఆయనకు కేటాయించిన బంగళాను రినోవేట్‌ చేస్తున్నారు. దీంతో ఆ పని పూర్తయ్యే వరకూ ఆయన ఖాళీ చేయరట! దుష్యంత్‌ బంగళాను ఖాళీ చేస్తేగానీ రాజ్‌వీర్‌ దత్తన్నకు కేటాయించిన బంగళాను ఖాళీ చేసే పరిస్థితి లేదు. కల్యాణ్‌సింగ్‌, వసుంధర రాజే బీజేపీలో సీనియర్‌ నాయకులు. దీంతో దత్తాత్రేయ వారిని గట్టిగా నిలదీయలేని పరిస్థితి. వాళ్లతో కయ్యం ఎందుకని సౌమ్యుడైన దత్తన్న తనకు వేరే బంగళా కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. అయితే కేంద్రం ఆయనపై పూర్తి స్థాయిలో శ్రద్ధ పెట్టడం లేదనే అభిప్రాయాలున్నాయి. సఫ్దర్‌జంగ్‌లోని ఓ భవనాన్ని ఆయనకు కేటాయించే ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలిసింది.

మొత్తంగా కేంద్రమంత్రి సైతం అతిథుల వలే ఏపీ భవన్‌లో ఉండటం ఇబ్బందికరమే. కేంద్రం ఆయన్ను ఎప్పుడు కనికరిస్తుందో మరి.