Begin typing your search above and press return to search.

మరీ అంతలా పిసికేస్తే ఎలా దత్తన్న?

By:  Tupaki Desk   |   29 Aug 2016 5:29 AM GMT
మరీ అంతలా పిసికేస్తే ఎలా దత్తన్న?
X
బీజేపీలో వ్యక్తి పూజ రోజురోజుకీ పెరుగుతోంది. బీజేపీకి అన్నీ తానైనట్లుగా మారిన ప్రధాని నరేంద్ర మోడీని పొగిడే కార్యక్రమం ఒకటి ఆ మధ్యన మొదలైంది. ఈ పొగడ్తల ఎపిసోడ్ లో దేశంలోని మరే ప్రాంతానికి చెందిన బీజేపీ నేతలు చేయనంత భజన కార్యక్రమాన్నితెలుగురాష్ట్రాల బీజేపీ నేతలు చేయటం కనిపిస్తోంది. కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు మొదలు ఓ మోస్తరు నేత వరకూ మోడీ బాకా కార్యక్రమాన్ని భారీగా నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో కనిపించే వ్యక్తిపూజ కార్యక్రమం.. బీజేపీలో ఈ మధ్యన ఎక్కువైందని చెప్పాలి. వాజ్ పేయ్.. అద్వానీ హయాంలో లేనంత పీక్ స్టేజ్ కి వ్యక్తిపూజ పెరిగింది. దీన్ని స్వాగతించే ధోరణిలో మోడీ ఉండటంతో.. నేతలు మరింతగా చెలరేగిపోతున్నారు.

సాక్ష్యాత్తు కేంద్రమంత్రులే.. మోడీని దైవాంశ సంభూతడన్న రీతిలో పొగిడేయటం గమనార్హం. కనిపించని దేవుడితో మోడీని కంపేర్ చేస్తూ.. కనిపించే దేవుడన్న రీతిలో పొగుడుతున్న వైనం రాజకీయవర్గాల్లో విస్మయానికి గురి చేస్తుంది. వ్యక్తిత్వ వికాస నిపుణుడిగా తరచూ మాటలు చెప్పే మోడీ.. తనను దేవుడితో పోలుస్తూ చేస్తున్న పొగడ్తల్ని ఎందుకు అడ్డు చెప్పరు? అలాంటి ధోరణి ఏ మాత్రం మంచిది కాదన్న విషయాన్ని పార్టీ నేతలకు అర్థమయ్యేలా ఎందుకు మాట్లాడరన్నది కోటి రూపాయల ప్రశ్నగా చెప్పాలి.

పొగడ్తలతో పిసికే కార్యక్రమం ఒకసారి మొదలయ్యాక.. దాన్ని ఆపకపోతే పీక్స్ కు వెళ్లటం మామూలే. ఇప్పుడు ఆ బాటలోనే పయనిస్తున్న మరో కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ. వెంకయ్యనాయుడు లాంటి వాళ్లు మోడీని ఒక రకంగా పొగిడితే.. దత్తన్న మోడీకి సరికొత్త ఇమేజ్ ను తీసుకొచ్చే ప్రయత్నంలో తొలి అడుగు వేశారు. స్వాతంత్ర్యం వచ్చాక విభాగాలుగా.. సంస్థానాలుగా ఉన్న దేశాన్ని ఏక్ భారత్ గా తీర్చి దిద్దగా.. తాజాగా ప్రధాని మోడీ దేశాన్ని శ్రేష్ఠ భారత్ గా చేస్తున్నారంటూ పొగిడేశారు. మోడీని బీజేపీ నేతలు పొగడటాన్ని ఎవరూ కాదనరు. కానీ.. దానికి ఒక హద్దు ఉండాలిగా. వల్లభాయ్ పటేల్ తో మోడీని ఎలా పోలుస్తారన్నది ఒక ప్రశ్న. ఆయన దేశంలోని సంస్థానాలన్నీ భారత్ లోకి విలీనం అయ్యేలా చేశారు. కానీ.. మోడీ తన విధానాలతో దేశంలోని పలు రాష్ట్రాల్లో ఆందోళనలు పెరిగేలా చేస్తున్న విషయాన్ని మర్చిపోకూడదు. అలాంటప్పుడు పటేల్ తో మోడీని ఎలా కంపేర్ చేస్తారన్నది పెద్ద ప్రశ్న. పొగడ్తలు పొగిడే వారికే కాదు.. పొగిడించుకునే వారికి కూడా స్థాయిని పెంచేలా ఉండాలే కానీ.. ప్రశ్నలు లేవనెత్తేలా ఉండకూడదన్న విషయాన్ని దత్తన్న లాంటి వారు అర్థం చేసుకుంటే మంచిది. లేకుంటే తమ పొగడ్తలతో మోడీకి మంచి జరగకపోగా ప్రజల్లో ఏహ్యభావం కలిగే ముప్పు ఉందన్న విషయాన్ని గుర్తిస్తే మంచిది.