Begin typing your search above and press return to search.

తెలుగు రాష్ట్రాలకు ఇద్దరు చంద్రులు గ్రహణంలా పట్టారట

By:  Tupaki Desk   |   13 July 2019 10:30 AM GMT
తెలుగు రాష్ట్రాలకు ఇద్దరు చంద్రులు గ్రహణంలా పట్టారట
X
కొన్ని విమర్శలు కొందరు నుంచి సాధారణంగా ఊహించం. కాంగ్రెస్ వీహెచ్, సీపీఐ నారాయణ, టీడీపీ రాజేంద్ర ప్రసాద్, వైసీపీ అంబటి రాంబాబు ఇలాంటి నేతలు ఎలాంటి వ్యాఖ్యలు చేసినా ఎవరూ ఆశ్చర్యపోరు. కానీ బీజేపీకి చెందిన బండారు దత్తాత్రేయ, టీడీపీకి చెందిన అశోకగజపతి రాజు ఇలా కొందరు నేతలు ఏవైనా ఘాటు వ్యాఖ్యలు చేస్తే అందరూ ఆలోచిస్తారు. తాజాగా బండారు దత్తాత్రేయ తన సహజ శాంత శైలికి భిన్నమైన విమర్శలు చేసి వార్తల్లో కనిపించారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, టీడీపీ అధినేత చంద్రబాబు తెలుగు రాష్ట్రాలకు గ్రహణంలా పట్టారని దత్తాత్రయే తీవ్రమైన విమర్శ చేశారు. వీరిద్దరు పేదల సంక్షేమ పథకాలకు కేంద్రం నిధులు ఇస్తే వాటిని ప్రాజెక్టుల కోసం వాడేశారని, కేసీఆర్ ఇప్పటికీ అదే పనిచేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కరీంనగర్ లో బి.వినోద్, నిజామాబాద్ లో కల్వకుంట్ల కవిత ఓటమితో టీఆర్ఎస్ పతనం ప్రారంభమయిందని, వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కమలం వికసిస్తుందని అన్నారు. టీఆర్ ఎస్, కాంగ్రెస్ పార్టీల నుంచి కొందరు లోక్ సభ సభ్యులు త్వరలోనే బీజేపీలో చేరుతారని దత్తాత్రేయ సంచలన ప్రకటన చేశారు. టీఆర్ఎస్ నేత డి.శ్రీనివాస్ తో పాటు చాలామంది బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు.

సాధారణంగా దత్తాత్రేయ ఇంత ఘాటు వ్యాఖ్యలు చేయరు. మరి బీజేపీతో పాటు కాలగమనంలో ఆయన కూడా మారిపోయినట్టున్నారు. ప్రతి బీజేపీ నేత ఈ మధ్యకాలంలో అగ్రెసివ్ గా మాట్లాడటం చూసి అలా ఉంటేనే అధిష్టానం చల్లగా చూస్తుందేమో అని ఆయన భావిస్తున్నట్టున్నారు. బహుశా ఆ క్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారామో.

ఈ సందర్భంగా ఆయన మరిన్ని వ్యాఖ్యలు చేశారు. దత్తన్న మాటలతో తెలంగాణలో బీజేపీ చాలా అగ్రెసివ్ మోడ్ లో ఉందన్న విషయం అర్థమవుతోంది. ఇప్పటికే కర్ణాటకలో ప్రభుత్వాన్ని నెలకొల్పే పనిలో బిజీగా ఉన్న బీజేపీ ఆ ఆపరేషన్ ముగిశాక తెలంగాణలో దృష్టిపెట్టే అవకాశం ఉందని దత్తన్న వ్యాఖ్యలను బట్టి అర్థమవుతోంది.