Begin typing your search above and press return to search.

హైదరాబాద్ లో చార్మినార్ భాగ్యలక్ష్మి.. మునుగోడుకు యాదాద్రి.. బండి సంజయ్ సెంటిమెంటచ్

By:  Tupaki Desk   |   28 Oct 2022 1:30 PM GMT
హైదరాబాద్ లో చార్మినార్ భాగ్యలక్ష్మి.. మునుగోడుకు యాదాద్రి.. బండి సంజయ్ సెంటిమెంటచ్
X
ఎన్నికలను సున్నితమైన మత అంశాలకు ముడిపెట్టి అవకాశంగా మలుచుకోవడంలో బీజేపీ తర్వాతే దేశంలో ఏ పార్టీ అయినా..? దీనిని కూడా ఓ పద్ధతిగా చేసుకుంటూ పోతుంది ఆ పార్టీ.గుజరాత్ లో నరేంద్ర మోదీ అనుసరించిన ఈ వ్యూహం 20 ఏళ్లుగా ఆ రాష్ట్రంలో బీజేపీని అధికారంలో కొనసాగేలా చేస్తోంది. మరోవైపు జాతీయ రాజకీయాల్లోకి వచ్చాక కూడా మోదీ ఈ తరహా ధోరణిని వీడలేదు.

కీలక ఎన్నికల సందర్భంగా పుణ్య క్షేత్రాల సందర్శన.. యూపీ ఎన్నికలకైతే అయోధ్య రామాలయ ప్రస్తావన.. గుజరాత్ ఎన్నికలుండగా బిల్కిస్ బానో కేసు నిందితుల విడుదల.. ఇలా ఎన్నో అంశాలున్నాయి. అయితే, యూపీలో పూర్తిగా మతపరమైన ఎజెండాతోనే బీజేపీ గెలిచిందని చెప్పలేం. అక్కడ యోగి మార్కు పాలన ఆ పార్టీని గెలిపించింది.

మునుగోడుకు యాదాద్రి ప్రమాణం తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా మారిన మునుగోడు ఉప ఎన్నికకు.. మధ్యలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు బీజేపీ వందల కోట్ల రూపాయిల ఎర అంశం అనేక మలుపులు తిప్పింది. దీంతో మునుగోడు కాస్త రెండు పార్టీల రణగోడు అయింది. దీంట్లో తమ తప్పేమీ లేదని నిరూపించుకోవాల్సిన బాధ్యత బీజేపీపై పడింది. ఈ క్రమంలో ఆ పార్టీ అనేక ప్రయాసలు పడుతోంది.మరోవైపు బీజేపీపై పూర్తిగా భారం నెట్టేసిన టీఆర్ఎస్ చిద్విలాసంగా జరిగేదంతా చూస్తోంది. ఈ వ్యవహారాన్ని ఢిల్లీ స్థాయిలో తేల్చుకోవాలని భావిస్తోంది.

కాగా, ఎమ్మెల్యేల కొనుగోలు తమ తప్పేమీ లేదని.. అసలు అలాంటిదేమీ జరగలేదని నిరూపించుకునేందుకు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ఏకంగా యాదాద్రిలో ప్రమాణం అంశాన్ని తెరపైకి తెచ్చారు. శుక్రవారం మునుగోడు ప్రచారం నుంచి యాదాద్రి చేరుకున్న ఆయన "మేం తప్పు చేయలేదు" అంటూ.. యాదాద్రిలో తడిబట్టలతో ప్రమాణం చేశారు. లక్ష్మీనరసింహ స్వామి పాదాల సాక్షిగా ఆయన తడిబట్టలతో ప్రమాణం చేశారు. ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలో తప్పు లేకుంటే.. కేసీఆర్‌ కూడా తనలాగే ప్రమాణం చేయాలని సంజయ్‌ సవాల్‌ విసిరారు. కాగా, ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు జరిగిన వ్యవహారంతో తమకు సంబంధం లేదని భాజపా నేతలు మొదటి నుంచి చెబుతున్నారు. ఈ క్రమంలో సంజయ్‌ మరో అడుగు ముందుకేసి.. సీఎం కేసీఆర్‌కు సవాల్‌ విసిరారు. కాగా శుక్రవారం మునుగోడు నుంచి కార్యకర్తలతో కలిసి యాదాద్రి చేరుకున్నారు.

హైదరాబాద్ లో భాగ్యలక్ష్మి గతంలో పార్టీ పరంగా ఏదైనా కార్యక్రమాన్ని ప్రారంభించాలన్నా.. సమస్యను ఎదుర్కొనాలన్నా బండి సంజయ్ హైదరాబాద్ లోని భాగ్యలక్ష్మి ఆలయాన్ని ఎంచుకునేవారు. జాతీయ నేతలు ఎవరు వచ్చినా ఈ ఆలయ సందర్శనను ఓ కార్యక్రమంగా చేపట్టేవారు. హైదరాబాద్ కు ఉన్న సునిశిత రీత్యా ఇది బాగానే వర్కవుట్ అయ్యేది. మరోవైపు పాతబస్తీలో ఎంఐఎంకు దీటుగా భాగ్యలక్ష్మి ఆలయం వద్ద కార్యక్రమం చేపట్టారన్న పేరు కూడా వచ్చేది.

అలా భాగ్యలక్ష్మి ఆలయాన్ని సంజయ్ వ్యూహాత్మకంగా వినియోగించుకునేవారు. ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా యాదాద్రి ఆలయాన్ని తన ప్రమాణానికి వేదికగా మార్చుకున్నారు. చిత్రమేమంటే.. యాదాద్రి సీఎం కేసీఆర్ మానస పుత్రిక. తనకెంతో ఇష్టమైన ఈ ఆలయాన్ని ఆయన ప్రత్యేక శ్రద్ధతో పునర్ నిర్మించారు. అలాంటిచోట సంజయ్ విసిరిన సవాల్ కు వస్తారా? చూద్దాం ఏం జరుగుతుందో?


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.