Begin typing your search above and press return to search.

రోజా ఇంట్లో జగన్ తో కేసీఆర్ డీల్ చేసుకున్నారా? ఇలాంటివెన్నో బండి నోట!

By:  Tupaki Desk   |   6 July 2021 11:30 AM GMT
రోజా ఇంట్లో జగన్ తో కేసీఆర్ డీల్ చేసుకున్నారా? ఇలాంటివెన్నో బండి నోట!
X
తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యవహారం చాలా సిత్రంగా ఉంటుంది. ఆయన మాటల్లో పాయింట్ కంటే కూడా.. నస ఎక్కువగా కనిపిస్తుంది. ఆవేశంగా మాట్లాడినట్లు ఉంటుంది కానీ.. ప్రత్యర్థుల్ని ఇరుకున పడేసే గుణం తక్కువగా ఉంటుంది. అందుకే ఆయన హడావుడి ప్రసంగాల ప్రభావం పెద్దగా కనిపించదని చెబుతారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో పాటు.. సాగర్ ఉప ఎన్నిక ఫలితంతో బీజేపీ జోరు రాష్ట్రంలోతగ్గిందనే చెప్పాలి. దీంతో.. గతంలో మాదిరి కాకుండా బండి జోరు కాస్త తగ్గిందనే చెప్పాలి. గడిచిన కొద్ది రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల పంచాయితీ అంతకంతకూ ముదురుతోన్న సంగతి తెలిసిందే.

ఏపీ చేపట్టిన రాయలసీమ ప్రాజెక్టుపై అభ్యంతరం వ్యక్తం చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. అంతకంతకూ తన విమర్శల జోరు పెంచటమే కాదు.. పలు నిర్ణయాలు తీసుకోవటం తెలిసిందే. దీనికి ప్రతిగా ఏపీ ప్రభుత్వం సైతం తెలంగాణ ప్రభుత్వ తీరును తప్పుపడుతోంది. ఇలా ఒకరిపై మరొకరు చేసుకుంటున్న విమర్శలు.. ఆరోపణలతో వాతావరణం వేడెక్కిన పరిస్థితి. ఇలాంటి వేళలో మౌనంగా ఉంటున్న బండి సంజయ్.. తాజాగా తన నోటికి పని చెప్పారు. ఈ సందర్భంగా ఆయనో ఆసక్తికర వాదనను వినిపించారు.

ఇవాల్టి రోజున కేసీఆర్ ఏమని వాదిస్తున్నారో.. ఆ విషయాలన్ని తాను గతంలోనే ప్రస్తావించానని.. అప్పట్లో తాము చేసిన ఫిర్యాదుల్లోని సారాన్ని తీసుకొని ఈ రోజున సీఎస్ చేత సీఎం కేసీఆర్ కేంద్రానికి లేఖలు రాస్తున్నట్లుగా చెప్పారు. అంతేకాదు.. అప్పట్లో నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా ఇంటికి సీఎం కేసీఆర్ వెళ్లిన సందర్భంగా.. ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో రహస్య ఒప్పందం జరిగిందని ఆరోపించారు. అందుకు తగ్గట్లే 203 జీవోను మే ఐదున జారీ చేస్తే తామే మొదట స్పందించామన్నారు. అంగేకాదు.. గత ఏడాది మే పదకొండున ఈ అంశం మీద కేంద్ర జలశక్తి మంత్రికి లేఖ రాసినట్లుగా చెప్పారు.

తాజా జలవివాదం మీద మాట్లాడిన బండి సంజయ్ పలు ప్రశ్నల్ని సంధించారు. ఆయన వేసిన ప్రశ్నల్ని ఆయన మాటల్లోనే చూస్తే..
- 2015లో జూన్ 18, 19 తేదీలలో మొదటిసారి జరిగిన సమావేశంలో నీటి పంపకాలపై తెలంగాణ సలహాదారు విద్యాసాగర్, హరీశ్ రావు అంగీకారం తెలిపిన మాట వాస్తవం కాదా?
- 2016 సెప్టెంబర్ 21న జరిగిన మొదటి అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో కేసీఆర్, చంద్రబాబులు మాట్లాడుకున్నారు. 299 టిఎంసీల నీళ్లు తెలంగాణకు, 512 టీఎంసీల నీళ్లు ఆంధ్రప్రదేశ్‌కు ఆనాడు కేటాయింపులు చేసుకున్న మాట వాస్తవం కాదా?
- 811 టీఎంసీలలో 575 టీఎంసీల నీళ్లు తెలంగాణకు రావాలని 2020 మే 12న రజత్ కుమార్ లేఖ రాశారు. అప్పటి కౌన్సిల్ సమావేశంలో తెలంగాణకు అన్యాయం జరిగేలా తొలుత ఒప్పుకుంది కేసీఆరే. 203 జీవోను జారీ చేస్తే.. గత ఏడాది మే 11న కేంద్ర జలశక్తి మంత్రికి లేఖ రాసింది నేనే. ఆ విషయాన్ని కేసీఆర్ కాదనగలరా?
- మేం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేంద్ర జలశక్తి.. కేఆర్ఎంబీని ఏపీ ప్రాజెక్టుల నిర్మాణం ఆపేలా లేఖ రాయించారు. ఈఏడేళ్ల వ్యవధిలో సీఎం చేసిన కార్యక్రమాలపై షెడ్యూల్ విడుదల చేయగలరా?
- మే మొత్తం లేఖల ద్వారా హెచ్చరంచినా ఆగస్టులో పనులు జరుగుతున్నాయని తెలిసినా.. సీఎం ఎందుకు మౌనంగా ఉన్నారు?
- ప్రాజెక్టు పనులు పూర్తయ్యే సమయానికి రెండు రాష్ట్రాల సీఎంలు పోలీసులు మోహరించేలా చేసి డ్రామాలు ఆడుతున్నారు. హుజూరాబాద్ ఎన్నికలు ముగిసే వరకుఈ డ్రామా నడుస్తుంది.
- ప్రాజెక్టులు నిర్మాణం జరిగే చోట అవసరమైతే రెండు రాష్ట్రాల పోలీసులు కొట్టుకుంటారు. కొత్త డ్రామాలకు తెర తీసి.. రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తున్నారు. గతంలోనే ఒప్పందం జరిగింది.