Begin typing your search above and press return to search.

లోక్ స‌భ‌లో కేసీఆర్ పైన బండి సంజ‌య్ తీవ్ర వ్యాఖ్య‌లు

By:  Tupaki Desk   |   3 July 2019 12:41 PM GMT
లోక్ స‌భ‌లో కేసీఆర్ పైన బండి సంజ‌య్ తీవ్ర వ్యాఖ్య‌లు
X
గ‌డిచిన మూడు నాలుగు రోజులుగా గ‌మ‌నిస్తున్నారా? తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రిని టార్గెట్ చేసుకునే రీతిలో కొన్ని ప‌రిణామాలు వ‌రుస‌గా సాగిపోతున్నాయి. ఆదివారం అటవీశాఖాధికారి మీద టీఆర్ ఎస్ ఎమ్మెల్యే సోద‌రుడు దాడి చేసిన విష‌యం ఏకంగా కేంద్ర‌మంత్రి పార్ల‌మెంటులో ప్ర‌స్తావించారు.

మ‌రోవైపు రాష్ట్రప‌తిని క‌లిసిన తెలంగాణ బీజేపీ నేత‌లు ఇంట‌ర్ ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌లో నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించార‌ని.. ఈ కార‌ణంగానే 27 మంది విద్యార్థులు ఆత్మ‌హ‌త్య‌ల‌కు కార‌ణ‌మ‌య్యార‌ని.. ఈ అంశంపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు. ఇంత‌లోనే గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ రివ్యూ పెట్టి ఇంట‌ర్ ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ తీరుపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌టం తెలిసిందే.

ఇలా సాగుతున్న ప‌రిణామాల‌కు మ‌రొక‌టి జ‌త చేరింది. ఇటీవ‌ల జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో కేసీఆర్ ఫ్యామిలీకి దిమ్మ తిరిగేలా షాకిచ్చిన బండి సంజ‌య్.. తాజాగా లోక్ స‌భ‌లో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి పాల‌న నీరోను త‌ల‌పిస్తుంద‌న్న ఆయ‌న‌.. ఇంట‌ర్ ప‌రీక్ష‌ల్లో ప్ర‌భుత్వ వైఫ‌ల్యం కార‌ణంగా 27 మంది విద్యార్థుల మ‌ర‌ణానికి కార‌ణ‌మ‌య్యార‌ని ఆరోపించారు.

హిందీలో మాట్లాడ‌టం మొద‌లెట్టిన ఆయ‌న‌.. తాను తెలుగులో మాట్లాడ‌తాన‌ని చెప్పారు. ముఖ్య‌మంత్రి కేసీఆర్ నిర్ల‌క్ష్యం వ‌ల్లే 27 మంది ఇంట‌ర్ విద్యార్థులు ఆత్మ‌హ‌త్య‌లు చేసుకున్నార‌ని.. అనుభ‌వం లేని గ్లోబ‌రీనా సంస్థ‌కు కాంట్రాక్టు క‌ట్ట‌బెట్టార‌న్నారు. ఎనిమిది ల‌క్ష‌ల మంది విద్యార్థులు ప‌రీక్ష‌లు రాస్తే మూడు ల‌క్ష‌ల మంది ఫెయిల్ అయ్యార‌ని.. త్రీ మ్యాన్ క‌మిటీ మీద ఎలాంటి చ‌ర్య‌లు లేవ‌న్నారు. గ‌వ‌ర్న‌ర్ కూడా ఇదే అంశంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశార‌ని గుర్తు చేశారు.

ఇంత జ‌రిగినా ముఖ్య‌మంత్రి కేసీఆర్ స్పందించ‌లేద‌ని.. ఏ ఒక్క బాధిత కుటుంబాన్ని ప‌రామ‌ర్శించ‌లేద‌న్నారు. ఏ ఒక్క నిర్ణ‌యాన్ని తీసుకోకుండా నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని.. చ‌ర్య‌లు కూడా చేప‌ట్ట‌లేద‌ని త‌ప్పు ప‌ట్టారు. పెద్ద పెద్ద వాళ్లు చ‌నిపోతే స్వ‌యంగా వెళ్లి ప‌రామ‌ర్శించే ముఖ్య‌మంత్రి 27 మంది విద్యార్థులు చ‌నిపోతే వారి కుటుంబాల‌ను క‌నీసం పరామ‌ర్శించ‌లేద‌న్నారు. తెలంగాణ రాష్ట్రంలో నీరో పాల‌న సాగుతుంద‌ని.. కేంద్రం చ‌ర్య‌లు తీసుకోవాల‌ని మండిప‌డ్డారు. కేసీఆర్ పాల‌న‌ను నేరుగా విమ‌ర్శించిన బండి సంజ‌య్ మాట‌లు ఇప్పుడు సంచ‌ల‌నంగా మారాయి.