Begin typing your search above and press return to search.

బండి సంజ‌య్ కి మొద‌లైన అస‌మ్మ‌తి స్వ‌రం..!

By:  Tupaki Desk   |   13 Jan 2022 9:52 AM GMT
బండి సంజ‌య్ కి మొద‌లైన అస‌మ్మ‌తి స్వ‌రం..!
X
భార‌తీయ జ‌న‌తా పార్టీ తెలంగాణ శాఖ అధ్య‌క్ష బాధ్య‌త‌లు చేప‌ట్టిన‌ప్ప‌టి నుంచి బండి సంజ‌య్ దూకుడుగా వెళుతున్నారు. ఏ రోజు కూడా విశ్రాంతి ఇవ్వ‌కుండా వ‌రుస ప‌ర్య‌ట‌న‌లు, పాద‌యాత్ర‌ల‌తో బిజీగా గ‌డుపుతున్నారు. రైతులు, నిరుద్యోగుల స‌మ‌స్య‌ల‌పై ఆందోళ‌న‌కు దిగుతూ.. నిర‌స‌నలు చేస్తూ ప్ర‌భుత్వాన్ని ముప్పుతిప్ప‌లు పెడుతున్నారు. పార్టీని సంస్థాగ‌తంగా బ‌లోపేతం చేసేందుకు వంద శాతం కృషి చేస్తూ ముందుకు సాగుతున్నారు.

బండి సంజ‌య్ పార్టీ కోసం ఇంత‌గా క‌ష్ట‌ప‌డుతుంటే మ‌రికొంద‌రు ఆయ‌న‌ను వ‌ద్ద‌నుకుంటున్నార‌ట‌. ఆయ‌న వ్య‌వ‌హార శైలిని త‌ప్పు ప‌డుతున్నార‌ట‌. ఇది ఎక్క‌డో కాదు.. బండి సంజ‌య్ సొంత జిల్లా క‌రీంన‌గ‌ర్ లోనే. బండి ఏక‌ప‌క్ష ధోర‌ణితో జిల్లాలో పార్టీ బ‌ల‌హీన‌పడుతోంద‌ని అస‌మ్మ‌తి నేత‌లు చెప్పుకొస్తున్నారు. పార్టీలో మొద‌టి నుంచీ ఉన్న త‌మ‌ను ప‌ట్టించుకోకుండా కొత్త వారిని ప్రోత్స‌హిస్తున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. పార్టీ అధిష్ఠానానికి ఫిర్యాదు చేయాల‌ని కూడా వారు భావిస్తున్నారు.

క‌రీంన‌గ‌ర్ బీజేపీ అస‌మ్మ‌తి నేత‌లు బుధ‌వారం జిల్లా కేంద్రంలో స‌మావేశం పెట్టుకున్నారు. దీనికి ఆత్మాభిమాన స‌మావేశం అని నామ‌క‌ర‌ణం కూడా చేశారు. ఈ స‌మావేశంలో పార్టీకి చెందిన పాత సీనియ‌ర్ నేత‌లంద‌రూ పాల్గొన్నారు. క‌రీంన‌గ‌ర్ ఉమ్మ‌డి జిల్లాగా ఉన్న‌ప్పుడు అధ్య‌క్ష బాధ్య‌త‌లు చేప‌ట్టిన మీస అర్జున‌రావు ఆధ్వ‌ర్యంలో ఈ స‌మావేశం జ‌రిగింది. బీజేపీ రాష్ట్ర మాజీ ఉపాధ్య‌క్షుడు గుజ్జుల రామ‌కృష్ణా రెడ్డి, కిసాన్ మోర్చా జాతీయ మాజీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సుగుణాక‌ర్‌రావు త‌దిత‌రుల సీనియ‌ర్ నేత‌ల‌తో పాటు సుమారు 50 మంది వ‌ర‌కు జిల్లా కీల‌క నేత‌లు ఇందులో పాల్గొన్నారు.

ఈ స‌మావేశం ఎజెండా బండి సంజయ్ ని నిలువ‌రించ‌డ‌మేన‌ట‌. మొద‌టి నుంచీ పార్టీలో అంకిత‌భావంతో ప‌ని చేస్తున్న త‌మ‌ను కాద‌ని.. ఇత‌ర పార్టీల నుంచి వ‌చ్చిన వారికి పెద్ద‌పీట వేస్తున్నార‌ని అసంతృప్తి వ్య‌క్తం చేశార‌ట‌. జాతీయ స్థాయి నాయ‌క‌త్వం దృష్టికి త‌మ స‌మ‌స్య‌ను తీసుకెళ్లేందుకు త్వ‌ర‌లో రాష్ట్ర స్థాయి ఆత్మాభిమాన స‌మావేశం నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించార‌ట‌. స‌మావేశంలో పాల్గొన్న కొంద‌రు మాదిగ‌, ఇతర ఉప కులాల వారిని చిన్న చూపు చూస్తున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశార‌ట‌.

పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో ఏ ఒక్క ద‌ళిత నేత‌కు ప‌ద‌వి ఇవ్వ‌లేద‌ని.. హిందుత్వాన్ని వ్య‌తిరేకించే వారికి ప‌ద‌వులు క‌ట్టబెట్టార‌ని అసంతృప్తి వ్య‌క్తం చేశారట‌. ఇదంతా ఈటెల రాజేంద‌ర్ వ‌ర్గాన్ని దృష్టిలో పెట్టుకొని చేస్తున్న‌ట్లున్న‌ద‌ని మ‌రికొంద‌రు చ‌ర్చించుకుంటున్నారు. ఏది ఏమైనా బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడి సొంత జిల్లాలోనే ఆత్మాభిమాన స‌మావేశాలు నిర్వ‌హించ‌డం పార్టీ శ్రేణుల్లో తీవ్ర చ‌ర్చ‌కు దారి తీసింది. ఇటీవ‌ల పెద్ద‌ప‌ల్లి జిల్లా నేత‌లు అసంతృప్తి వ్య‌క్తం చేయ‌డం.. ఇప్పుడు క‌రీంన‌గ‌ర్ జిల్లా నేత‌ల గొడ‌వ‌తో బండికి బ్రేకులు త‌ప్పేలా లేదు.