Begin typing your search above and press return to search.

బండి.. వేముల‌వాడ నుంచి

By:  Tupaki Desk   |   30 Jan 2022 2:31 PM GMT
బండి.. వేముల‌వాడ నుంచి
X
తెలంగాణ‌లో వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు ఎంపీ బండి సంజ‌య్ బ‌రిలో దిగుతారా? అంటే అవున‌నే స‌మాధానాలు వినిపిస్తున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికార టీఆర్ఎస్‌ను గ‌ద్దె దించ‌డ‌మే ల‌క్ష్యంగా ముందుకు సాగుతున్న సంజ‌య్‌.. శాస‌న స‌భ ఎన్నిక‌ల్లో పోటీ ప‌డ‌డం ఖాయ‌మేన‌న్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయితే ఆయ‌న ఏ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేస్తార‌న్న‌ది ప్ర‌స్తుతానికి స‌స్పెన్స్‌గా మారింది. ఆయ‌న సొంత జిల్లా క‌రీంన‌గ‌ర్‌. కానీ గ‌త రెండు సార్లు క‌రీంన‌గ‌ర్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసిన ఆయ‌న ఓడిపోయారు. గ‌త లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో క‌రీంన‌గ‌ర్ పార్ల‌మెంట్ స్థానం నుంచి అనూహ్యంగా గెలిచి ఎంపీ అయ్యారు. అక్క‌డి నుంచి ఆయ‌న జోరు మాములుగా లేదు.

అందుకే బ‌రిలో..
2020లో పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడిగా బాధ్య‌త‌లు స్వీక‌రించినప్ప‌టి నుంచి పార్టీని ప‌రుగులు పెట్టిస్తున్నారు. బీజేపీ విధానాల‌తో దూకుడుగా ముందుకు సాగే సంజ‌య్ సార‌థ్యంలోనే తెలంగాణ‌లో పార్టీ అధికారంలోకి వ‌స్తుంద‌ని ఆ పార్టీ శ్రేణులు న‌మ్ముతున్నాయి. అధిష్ఠానం కూడా సంజ‌య్‌పై న‌మ్మ‌కంతో ఉంది. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేయాల‌ని ఆయ‌న డిసైడ్ అయిన‌ట్లు ప్ర‌చారం సాగుతోంది. గ‌తంలో తాను పోటీ చేసిన క‌రీంన‌గ‌ర్ నుంచి కాకుండా మ‌రో అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి బ‌రిలో దిగాల‌నే ఆలోచ‌న‌లో ఆయ‌న ఉన్న‌ట్లు స‌మాచారం. అందుకే గ‌త కొంత‌కాలం నుంచి ఆయ‌న వేముల‌వాడ‌పై ఎక్కువ‌గా ఫోక‌స్ పెట్టార‌ని తెలుస్తోంది. అక్క‌డి నేత‌ల‌తో ఆయ‌న త‌ర‌చుగా స‌మావేశ‌మ‌వుతున్నార‌ని స‌మాచారం.

ఈ సీటు సేఫ్ అని..
వేముల‌వాడు నుంచి పోటీ చేస్తే సేఫ్ అని సంజ‌య్ భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది. కరీంన‌గ‌ర్‌తో పోలిస్తే వేముల‌వాడ నుంచి విజ‌యాలు సాధించే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్న‌ట్లు చెబుతున్నారు. మ‌రోవైపు క‌రీంన‌గ‌ర్‌లో కొంత‌మంది బీజేపీ నేత‌లు సంజ‌య్‌కు వ్య‌తిరేకంగా ప‌ని చేస్తున్నార‌ని అంటున్నారు. దీనికి తోడు క‌రీంన‌గ‌ర్‌లో మైనార్టీల ప్రభావం కూడా కాస్త ఎక్కువ‌గానే ఉంటుంది. అక్క‌డ కాంగ్రెస్‌, టీఆర్ఎస్‌, బీజేపీ మ‌ధ్య త్రిముఖ పోటీ ఏర్ప‌డితే త‌న‌కు ఇబ్బంది అని సంజ‌య్ వేముల‌వాడ మీద ఎక్కువ ఫోక‌స్ పెట్టార‌ని చెబుతున్నారు. అయితే పౌర‌స‌త్వ వివాదం కార‌ణంగా ప్ర‌స్తుత వేముల‌వాడ టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్న‌మ‌నేని ర‌మేశ్ ప‌ద‌విపై ఎప్పుడైనా వేటు ప‌డొచ్చ‌నే ప్ర‌చారం సాగుతోంది. అలా అయితే ఉప ఎన్నిక‌లో బీజేపీని గెలిపించుకోవ‌డం కోసం ఇప్ప‌టి నుంచే సంజ‌య్ అక్క‌డ దృష్టి పెట్టార‌నే మ‌రో వాద‌న కూడా వినిపిస్తోంది.