Begin typing your search above and press return to search.

సంజ‌య్ అన్నా.. ఈ మాత్రం లాజిక్ తెలియ‌దా.. కేంద్రం త‌గ్గిస్తే.. పెట్రో చార్జీలు అవే త‌గ్గిపోతాయి క‌దే

By:  Tupaki Desk   |   15 May 2022 4:31 PM GMT
సంజ‌య్ అన్నా.. ఈ మాత్రం లాజిక్ తెలియ‌దా.. కేంద్రం త‌గ్గిస్తే.. పెట్రో చార్జీలు అవే త‌గ్గిపోతాయి క‌దే
X
తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజ‌య్ శ‌నివారం తుక్కుగూడ‌లో నిర్వ‌హించిన స‌భ‌లో మాట్లాడుతూ.. సంచ‌ల‌న కామెంట్లు చేశారు. త‌మ‌కు అధికారం ఇవ్వాలంటూ.. ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ విజ్ఞ‌ప్తి చేశారు. ``ప్లీజ్.. బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వండి`` అని ఆయ‌న అభ్య‌ర్థించారు. అంతేకాదు.. దేశ‌వ్యాప్తంగా ప్ర‌స్తుతం కీల‌క చ‌ర్చ‌నీయాంశంగా ఉన్న‌.. పెట్రోలు, డీజిల్ ధ‌ర‌ల‌పై నా బండి సంజ‌య్ సంచ‌ల‌న కామెంటు చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే పెట్రోల్‌ డీజిల్‌పై వ్యాట్ తగ్గిస్తామ‌న్నారు.

కాంగ్రెస్‌కు ఓటు వేస్తే.. కేసీఆర్‌కు, టీఆర్ ఎస్‌కు వేసినట్లేన‌ని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. తెలంగాణలో కుటుంబ పాలనను అంతమొందించాల‌ని పిలుపునిచ్చారు. ఈ నేప‌థ్యంలోనే బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాన‌ని అన్నారు. ధర ణి పేరుతో ప్రజల భూములను టీఆర్ ఎస్‌ నేతలు లాక్కున్నారని మండిప‌డ్డారు. గోల్కొండ ఖిల్లా మీద కాషాయ జెండా ఎగరేయాలని పార్టీ నేత‌ల‌కు ఆయ‌న పిలుపునిచ్చారు. కేసీఆర్‌ కుటుంబ పాలనను అంతం చేసేందుకే అమిత్ షా వచ్చారని తెలిపారు.

స‌రే.. ఇవ‌న్నీ .. ఎలా ఉన్నా.. పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌ల‌పై సంజ‌య్ చేసిన వ్యాఖ్య‌ల‌ను నెటిజ‌న్లు ట్రోల్ చేస్తున్నారు. ``సంజ‌య్ అన్నా.. ఆ మాత్రం లాజిక్ తెలియదా?`` అంటూ కామెంట్లు కుమ్మ‌రిస్తున్నారు. కేంద్రం చెప్పిన‌ట్టు వినే.. చ‌మురు సంస్థ‌లే క‌దా.. ఇప్పుడు ధ‌ర‌లు పెంచుతున్నాయి. ధ‌ర‌ల పెంపున‌కు.. రాష్ట్రాల‌కు ఏమైనా సంబంధం ఉందా? అక్క‌డ కీ నొక్కితే.. ఇక్క‌డ ధ‌ర‌లు పెరుగుతున్నాయి. కేంద్రం త‌గ్గించ‌మ‌ని.. ఆదేశిస్తే.. చ‌మురు సంస్థ‌లు త‌గ్గిస్తాయి. దీంతో ఆటోమేటిక్‌గా.. రాష్ట్రాల్లోనూ చ‌మురు ధ‌ర‌లు త‌గ్గుముఖం ప‌డతాయి. అంతేకానీ.. ప్ర‌త్యేకంగా రాష్ట్రాలు త‌గ్గించేదేంది? అంటున్నారు.

అంతేకాదు.. గ‌త ఏడాది న‌వంబ‌రు నుంచి ఈ ఏడాది ఏప్రిల్ వ‌ర‌కు ఐదు రాష్ట్రాల్లో ఎన్నిక‌లు జ‌రిగిన సంద‌ర్భంగా.. కేంద్రం సూచ‌న‌లు.. ఆదేశాల మేర‌కు చ‌మురు సంస్థ‌లు పైసా కూడా పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌ల‌ను పెంచ‌లేదు. మ‌రి ఆ స‌మ‌యంలో ఎంత గ‌డ్డు ప‌రిస్థితి ఎదుర్కొన్నా.. రాష్ట్రాలు ఏమైనా.. పెట్రోల్ డీజిల్ ధ‌ర‌లు పెంచాయా? అంటే.. దీనిని బ‌ట్టి కేంద్ర‌మే క‌దా.. ఈ ధ‌ర‌ల పెరుగుద‌ల‌కు కార‌ణం.. నువ్వు ఇప్పుడొచ్చి.. రాష్ట్రంలో అధికారంలోకి రాగానే.. పెట్రోలు, డీజిల్ ధ‌ర‌ల‌ను త‌గ్గిస్తాన‌ని చెబుతున్నావు. అధికారంలోకి రాక‌పోతే.. రాష్ట్ర ప్ర‌జ‌లు అవ‌స‌రం లేదా? అని కొంద‌రు నిల‌దీస్తున్నారు..

ముందు ఈ ధ‌ర‌ల విష‌యంపై కేంద్రంతో కొట్లాడి ద‌మ్ముందా? పోనీ.. అడిగే ధైర్యం ఉందా? అని మ‌రికొంద‌రు ప్ర‌శ్నిస్తున్నారు. కేంద్ర ప్ర‌భుత్వ‌మే చ‌మురు ధ‌ర‌ల‌పై గుత్తాధిప‌త్యం చేస్తున్న విష‌యాన్ని బండి ఎందుకు మ‌రిచిపోతున్నారు? తెలియ‌క‌నా.. లేక తెలిసినా.. రాజ‌కీయ‌వ్యూహ‌మా? అధికారంలోకి వ‌చ్చాక త‌గ్గిస్తామ‌నే కంటే.. ముందు ఢిల్లీ వెళ్లి కూర్చోని.. ధ‌ర‌లు త‌గ్గించ‌మ‌ని అడిగి.. దానిని సాధించండి.. ఆటోమేటిక్‌గా రాష్ట్రంలోనూ ధ‌ర‌లు అదుపులోకి వ‌స్తాయ‌క‌దా.. అంటున్నారు. ఈ ప‌నిచేయ‌డం మానేసి.. అధికారం కోసం.. ఇలాంటి వాగ్దానాలు చేయుడు ఎందుకే! అని మ‌రికొంద‌రు అంటున్నారు. మొత్తానికి బండి చేసిన చ‌మురు వ్యాఖ్య‌లు.. రాజ‌కీయంగా.. ఆయ‌న‌కే చ‌మురు వ‌దిస్తుండ‌డం గ‌మ‌నార్హం.