Begin typing your search above and press return to search.

ఈటలను అంత మాట అనాల్సిన అవసరం ఉందంటావా బండి?

By:  Tupaki Desk   |   31 July 2022 7:30 AM GMT
ఈటలను అంత మాట అనాల్సిన అవసరం ఉందంటావా బండి?
X
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ గురించి.. ఆయన మాటలు ఎలా ఉంటాయన్న విషయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ భాషకే తట్టుకోలేని వారికి బండి సంజయ్ మాట్లాడుతుంటే.. తట్టుకోలేని వారెందరో కనిపిస్తారు. అయితే.. ఆయనలోని ఊపు.. ఉత్సాహం.. పోరాడే తత్త్వం ఇప్పుడున్న స్థానానికి తీసుకొచ్చిందని చెప్పాలి. అయితే.. మాత్రం మాట్లాడే వేళలో వెనుకా ముందు చూసుకోవాల్సిన అవసరం ఉంది. తాజాగా తమ పార్టీకే చెందిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.

మిగిలిన బీజేపీ నేతలకు ఈటలకు కాస్త తేడా ఉందని చెప్పాలి. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కొద్దిమంది టీఆర్ఎస్ నేతల్లో ఈటల ఒకరు. ఒకప్పుడు కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న ఈటలతో తర్వాతి కాలంలో తేడా రావటం.. పార్టీ నుంచి బయటకు వచ్చేయటం తెలిసిందే. పార్టీ నుంచి బయటకు వచ్చి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన అనంతరం.. ఈటలకు ఎదురైనన్ని సమస్యల చిట్టా అందరికి తెలిసిందే. తన వ్యక్తిగత ఛరిష్మాతో ఉప ఎన్నికల్లో విజయం సాధించిన ఈటల.. మిగిలి టీ బీజేపీ నేతలకు భిన్నమని చెప్పాలి. సొంతంగా భారీ క్యాడర్ ఉన్న ఈటలకు సరిపోయే నేత బీజేపీలో లేరనే చెప్పాలి.

అలాంటి ఈటలను ఉద్దేశించి ఒక మాట మాట్లాడే వేళలో ఆచితూచి అన్నట్లు వ్యవహరించాలి.సీఎం కేసీఆర్ పై యుద్ధాన్ని ప్రకటించిన ఈటల.. తాను వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ఎక్కడ పోటీ చేస్తే తాను అక్కడ పోటీ చేస్తానంటూ చేసిన ప్రకటన సంచలనంగా మారటం తెలిసిందే. తనను తీవ్రంగా ఇబ్బంది పెట్టిన కేసీఆర్ కు సరైన గుణపాఠం చెప్పలన్న పట్టుదలతో ఈటల ఉన్నట్లుగా ఆయన సన్నిహితులు చెబుతుంటారు. ఈ కారణంతోనే వచ్చే ఎన్నికల్లో సీఎం కేసీఆర్ ఎక్కడ పోటీ చేస్తే.. తాను అక్కడి నుంచి పోటీ చేస్తానని అదే పనిగా ఈటల చెబుతున్నారు.

ఇదిలా ఉంటే.. ఈటల వ్యాఖ్యలపైన పరోక్షంగా రియాక్టు అయ్యారు బండి సంజయ్. తాజాగా మీడియాతో మాట్లాడిన సందర్భంలో ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు బదులిచ్చిన బండి సంజయ్.. ''నేతలు సొంతంగా నియోజకవర్గాలను ఎంచుకునే పద్దతి బీజేపీలో లేదు. ఎవరైనా సరే పార్టీ జెండా కింద పని చేయాల్సిందే. టికెట్ ఇవ్వాలా? వద్దా? ఎవరెక్కడ నుంచి పోటీ చేయాలి? లాంటివన్నీ కూడా జాతీయ నాయకత్వమే నిర్ణయిస్తుంది. నాతో సహా అందరికీ ఇదే వర్తిస్తుంది'' అంటూ వ్యాఖ్యానించారు.

బండి వ్యాఖ్యలు.. ఈటల చిన్నబుచ్చుకునేలా ఉన్నాయని చెప్పక తప్పదు. బండి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో టీఆర్ఎస్ నేతల నుంచి సైతం ఈటలకు పంచ్ లు తప్పవన్న మాట వినిపిస్తోంది. నిజానికి ఈటలను సమ్ థింగ్ స్పెషల్ గానే బీజేపీ ట్రీట్ చేయాలే తప్పించి.. ఆయన్ను కట్టడి చేయాలన్న ఆలోచన సరి కాదంటున్నారు. పార్టీ లైన్ లో ఉండాలని కోరటం తప్పేం కాదు. దానికి చాలానే వేదికలు ఉన్నాయి. దాన్ని వదిలేసి.. ఈటల చిన్నబోయేలా బండి వ్యాఖ్యలు ఉన్నాయని చెబుతున్నారు. ఎంత పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అయితే మాత్రం.. ఈటల లాంటి నేతను ఉద్దేశించి అన్నట్లుగా ఉండే మాటల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్న మాట వినిపిస్తోంది.