Begin typing your search above and press return to search.

ఆర్ఆర్ఆర్ ని అవమానించిన బండి సంజయ్!

By:  Tupaki Desk   |   30 Aug 2022 6:00 AM GMT
ఆర్ఆర్ఆర్ ని అవమానించిన బండి సంజయ్!
X
తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ పాదయాత్రకు తెలంగాణలోని బీజేపీ సీనియర్ల మద్దతు లేదన్నది ఇన్ సైడ్ టాక్. కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి కూడా ఇది ఇష్టం లేదని.. కానీ సొంతంగా ఎదిగేందుకు ఈ పాదయాత్రను చేపట్టాడని వాళ్లు భావిస్తున్నారు. అందరినీ కలుపుకుపోకుండా సొంత మైలేజ్ కోసం ఆరాటపడుతున్నాడని.. సీఎం కుర్చీ కోసం ఇదంతా చేస్తున్నాడన్న విమర్శలున్నాయి.

అయితే బండి సంజయ్ ఎంత పాదయాత్ర చేసినా బీజేపీలోని గ్రూపులు ఆయనకు సహకరించలేదన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే బలంగా ఉన్న కిషన్ రెడ్డి వర్గం బండి పాదయాత్రలో పాలుపంచుకోలేదని అంటున్నారు. బండితోపాటు పెద్ద నేతలు ఎవరూ పాదయాత్రలో పాలుపంచుకోలేదని.. కొందరు అసలు పట్టించుకోలేదన్న టాక్ నడుస్తోంది.

బండి సంజయ్ ఇక సొంత పార్టీలోని సీనియర్ నేతలను పట్టించుకోవడం లేదట.. బీజేపీ ఎమ్మెల్యేలుగా గెలిచిన బలమైన ‘ఆర్ఆర్ఆర్’ వర్గాన్ని కూడా అవమానిస్తున్నట్టుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రజా సంగ్రామ యాత్ర చివరి రోజున మీటింగ్ పెట్టి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో బీజేపీకి ఊపు తెచ్చిన ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్ రావులను విస్మరించారని.. వాళ్ల పేర్లు మొదట పలకకుండా ఎమ్మెల్యేలు కానీ వారి పేర్లు చెప్పి.. చివరలో చెప్పడం వారిని వారికి తీవ్ర అవమానాన్ని మిగిల్చిందట.. ఇదే విషయంపై ఇప్పుడు బీజేపీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోందట..

ఇక సస్పెండ్ అయిన రాజాసింగ్ విషయంలోనూ బీజేపీ మెతక వైఖరి అవలంభిస్తోందని.. అతడు బీజేపీతో టచ్ లోనే ఉన్నాడని అంటున్నారు. తెరవెనుక ఉండి రాజాసింగ్ ను నడిపిస్తున్నారనే ఆరోపణలను ఇటీవల ఎంఐఎం అధినేత అసదుద్దీన్ చేశారు.

బండి సంజయ్ కావాలనే తనకంటే సీనియర్లు, బలమైన నేతలైన ఈటల రాజేందర్ ను.. రఘునందన్ రావును పెద్దగా పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నాడని.. అతడే హీరో మాదిరి ప్రజల్లోకి వెళ్లేలా చూస్తున్నారని బీజేపీలో చర్చ సాగుతోంది. ఈటల రాజేందర్ మంత్రి అయినప్పుడు అసలు బండి సంజయ్ గల్లీ లీడర్. అప్పుడే కరీంనగర్ లోని ఒక వార్డుకు కార్పొరేటర్ గా గెలిచాడు. ఉద్యమంలో ఈటల పతాకస్థాయిలో ఉన్నప్పుడు బండి సంజయ్ కార్పొరేటర్ గా అసలు ఉనికిలోనే లేడు.

ఏదో ఊపులో బీజేపీ తరుఫున వచ్చి గెలిచాడు కానీ.. బండికి అంత సీన్ లేదంటారు. అలాంటి బండి ఇప్పుడు ఇన్ని సార్లు గెలిచి మంత్రి కూడా అయిన ఈటల రాజేందర్ విషయంలో.. అపార రాజకీయ అనుభవం ఉన్న రఘునందన్ ల విషయంలో వ్యవహరిస్తున్న తీరు బీజేపీ వాదులకు కూడా మింగుడు పడడం లేదు.

బీజేపీ జాతీయ అధ్యక్షుడు హాజరైన సభలో మొదట గౌరవించాల్సింది బీజేపీ సొంత ఎమ్మెల్యేలు అయిన ఈటల, రఘునందన్ లనే. కానీ కావాలనే వారికి మైలేజ్ రాకుండా దూరం పెడుతున్నాడని బండిపై ఆరోపణలున్నాయి. తనకు ఎక్కడ పోటీ వస్తారో..? తనను తాను బీజేపీలో హీరో అనిపించుకోవాలని ఇలా బలమైన నేతలను బండి సంజయ్ తొక్కేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఇదే జరిగితే బీజేపీలో అసమ్మతి చెలరేగి 2023లో ఆ పార్టీకి ఓటమి ఖాయమని అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.