Begin typing your search above and press return to search.

జూనియ‌ర్ ఎన్టీఆర్‌పై ఆ రెండూ త‌ప్పేనంటున్న బండి సంజ‌య్!

By:  Tupaki Desk   |   8 Sep 2022 8:32 AM GMT
జూనియ‌ర్ ఎన్టీఆర్‌పై ఆ రెండూ త‌ప్పేనంటున్న బండి సంజ‌య్!
X
ఇటీవ‌ల ప్ర‌ముఖ క‌థానాయ‌కుడు జూనియ‌ర్ ఎన్టీఆర్‌తో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా హైద‌రాబాద్లో స‌మావేశ‌మ‌యిన సంగ‌తి తెలిసిందే. దీనిపై నాటి నుంచి ర‌క‌ర‌కాల చ‌ర్చ‌లు, ఊహాగానాలు సాగుతూనే ఉన్నాయి. ఆర్ఆర్ఆర్ సినిమాలో జూనియ‌ర్ ఎన్టీఆర్ న‌ట‌న అమిత్ షాకు న‌చ్చింద‌ని.. అందుకే ఆయ‌న‌ను అభినందించ‌డానికి పిలిపించార‌ని కొంత‌మంది చెప్పుకున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా కోసం కాద‌ని.. జూనియ‌ర్ ఎన్టీఆర్ ను బీజేపీలోకి ఆహ్వానించ‌డానికి లేదా బీజేపీ త‌ర‌ఫున వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్ర‌చారం చేయ‌డం కోసం అమిత్ షా పిలిపించార‌ని.. ఇలా ర‌క‌ర‌కాల ఊహాగానాలు చెల‌రేగాయి.

తెలంగాణ బీజేపీకి జూనియ‌ర్ ఎన్టీఆర్ ను అధ్య‌క్షుడిని చేస్తార‌ని.. ఏపీలో మ‌రో ప్ర‌ముఖ న‌టుడు ప‌వ‌న్ క‌ల్యాణ్‌ని, తెలంగాణ‌లో జూనియ‌ర్ ఎన్టీఆర్ ను త‌మ కుడి, ఎడ‌మ భుజాలుగా బీజేపీ పెట్టుకోబోతోంద‌ని ఇలా ఎవ‌రికి తోచిన రీతిలో వారు ఊహాగానాలు చేశారు. అయితే అటు అమిత్ షా కానీ, ఇటు జూనియ‌ర్ ఎన్టీఆర్ కానీ ఆ స‌మావేశంపై స్పందించ‌క‌పోవ‌డంతో ఉత్కంఠ పెరిగిపోయింది.

ఏపీ బీజేపీ అధ్య‌క్షుడు సోము వీర్రాజు కూడా జూనియ‌ర్ ఎన్టీఆర్ సేవ‌ల‌ను తాము వాడుకుంటామ‌ని కొద్ది రోజుల క్రితం ప్ర‌క‌టించారు. జూనియ‌ర్ ఎన్టీఆర్ కు ఎక్క‌డ మ‌ద్ద‌తు ఉంటే అక్క‌డ ఆయ‌న‌తో ప్ర‌చారం చేయిస్తామ‌ని వెల్లడించారు. జూనియ‌రే కాకుండా ఇంకొంత‌మంది న‌టులు కూడా బీజేపీలోకి వ‌స్తార‌ని సోము వీర్రాజు చెప్పిన సంగ‌తి తెలిసిందే.

ఈ నేప‌థ్యంలో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, క‌రీంన‌గ‌ర్ ఎంపీ బండి సంజ‌య్ కూడా జూనియ‌ర్ ఎన్టీఆర్- అమిత్ షాల భేటీపై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. "అమిత్ షా జూనియ‌ర్ ఎన్టీఆర్‌ను క‌ల‌వ‌టంపై కొంద‌రు టీడీపీకి చెక్ పెట్ట‌డానికి అనుకుంటున్నారు.. కొంద‌రేమో సంధి కుదుర్చుకోవ‌టానికి అంటున్నారు. ఈ రెండూ త‌ప్పే అని బండి సంజ‌య్ తాజాగా కామెంట్స్ చేశారు.

ఆర్ఆర్ఆర్ సినిమా చూసిన‌ప్పుడు కూడా అమిత్ షా.. ఎన్టీఆర్‌తో ఫోన్ చేసి మాట్లాడార‌ని బండి సంజ‌య్ తెలిపారు. ఈ నేప‌థ్యంలో అమిత్ షా గారు మునుగోడు ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన‌ప్పుడు.. ఆయ‌న‌కు గుర్తొచ్చి ఆయ‌నే ఫోన్ చేసి క‌లిశార‌ని వెల్ల‌డించారు. వారిద్ద‌రి మ‌ధ్య‌ సినిమాల‌ ప‌రంగానే చ‌ర్చ జ‌రిగిందే త‌ప్ప‌.. మ‌రింకే విధ‌మైన‌ చ‌ర్చ జ‌ర‌గ‌లేద‌న్నారు.

అమిత్ షా, జూనియ‌ర్ ఎన్టీఆర్ భేటీ జ‌రిగిన‌ప్పుడు అక్క‌డ తాను కూడా ఉన్నాన‌న్నారు. సినిమాల‌ గురించే సంభాష‌ణ అంతా జ‌రిగింద‌ని తెలిపారు. సీనియ‌ర్ ఎన్టీఆర్ గురించి, వారి కుటుంబ స‌భ్యులు గురించి అమిత్ షా మాట్లాడార‌ని వివ‌రించారు. రాజ‌కీయాలు గురించి మాట్లాడ‌లేద‌ని తేల్చిచెప్పారు. వీరిద్ద‌రి భేటీపై పెడార్థాలు తీయాల్సిన అవ‌సరం లేద‌న్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.