Begin typing your search above and press return to search.

బీజేపీలో హాట్ టాపిక్ గా ‘బండి’.. పాట్నా సదస్సు చెప్పిందిదే

By:  Tupaki Desk   |   2 Aug 2022 4:42 AM GMT
బీజేపీలో హాట్ టాపిక్ గా ‘బండి’.. పాట్నా సదస్సు చెప్పిందిదే
X
తాను టార్గెట్ చేసిన రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే వరకు విశ్రమించని పార్టీగా బీజేపీని చెప్పాలి. మోడీషాల సారథ్యంలో పార్టీ ఎంతటి పోరాటపటిమను ప్రదర్శిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. తాజాగా ఆ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారం కోసం పడుతున్న శ్రమ అంతా ఇంతా కాదు. ఇటీవల కాలంలో ఎప్పుడు ఇవ్వనంత ప్రాధాన్యతను బీజేపీ తెలంగాణ రాష్ట్రానికి ఇస్తోంది. పార్టీ జాతీయ సమావేశాల్లోనూ తెలంగాణ రాష్ట్ర ప్రస్తావన పదే పదే రావటం ఆసక్తికరంగా మారింది.

తాజాగా బిహార్ రాజధాని పాట్నాలో బేజీపీకి చెందిన వివిధ మోర్చాలకు సంబంధించిన సమావేశాల్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ జాతీయ సదస్సుల్లో తెలంగాణలో బీజేపీ చేస్తున్న పోరాటాల్ని.. తెలంగాణ పార్టీ నేతల్ని.. వారు నిర్వహిస్తున్న కార్యక్రమాల్ని పదే పదే పలువురు బీజేపీ నేతలు ప్రస్తావించటం విశేషం. మొత్తంగా మరే రాష్ట్రానికి దక్కనంత ప్రాదాన్యత తెలంగాణ బీజేపీ నేతలకు దక్కినట్లుగా చెబుతున్నారు.

ఈ సందర్భంగా తెలంగాణలోని కేసీఆర్ సర్కారు తీరును తప్పు పడుతూ.. పార్టీ నేతలు.. కార్యకర్తలు చేస్తున్న పోరాటాలను ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ.. వారి స్ఫూర్తిని జాతీయ స్థాయిలో జరుగుతున్న సదస్సులో పలువురు జాతీయ నాయకులు పదే పదే ప్రస్తావించటంతో తెలంగాణకు చెందిన వివిధ మోర్చాల నేతలకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చినట్లైంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు.. కేంద్ర మంత్రి అమిత్ షాలు ఇద్దరు తమ ప్రసంగాల్లో తెలంగాణ ప్రస్తావనను పదే పదే తేవటం ఒక ఎత్తు అయితే.. కేసీఆర్ సర్కారుపై పోరాడుతున్న తెలంగాణ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ మీదా ప్రశంసల వర్షం కురిపించారు.

రానున్న రోజుల్లో తెలంగాణలో పార్టీ అధికారంలోకి రావటం ఖాయమన్న ధీమాను వ్యక్తం చేయటం గమనార్హం. తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో ఇటీవల జాతీయ పార్టీ నాయకులు రెండు రోజుల పాటు క్షేత్ర స్థాయిలో పర్యటించిన వైనాన్ని ప్రస్తావించిన అమిత్ షా.. నడ్డాలు.. పార్టీ నేతలు ఇచ్చిన ఫీడ్ బ్యాక్ ను ప్రస్తావించారు. తెలంగాణ బీజేపీ నేతలు .. కార్యకర్తలు చేస్తున్న పోరాటాలను ప్రస్తావిస్తూ.. వారిని పొగడ్తలతో ముంచెత్తారు. అంతేకాదు.. తమ ప్రసంగాల్లో తెలంగాణలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న బండి సంజయ్ చేస్తున్న పోరాటాల్ని పేర్కొంటూ.. ఆయన చేస్తున్న పాదయాత్రల్ని వివరించటం విశేషంగా మారింది. పార్టీ జాతీయ సదస్సులో తమ రాష్ట్రం గురించి.. తాము చేస్తున్న పోరాటాల గురించి పదే పదే జాతీయ నాయకులు ప్రస్తావించటంతో తెలంగాణకు చెందిన వివిధ మోర్చాలకు చెందిన నేతలు.. కార్యకర్తలు చాలా హ్యాపీగా ఫీల్ కావటంతో పాటు.. చప్పట్లతో తమ హర్షాతిరేకాల్ని వ్యక్తం చేశారు.

ఇదిలా ఉంటే.. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేస్తున్న పోరాటాలను పదేపదే ప్రస్తావనకు రావటం గమనార్హం. బండి సంజయ్ చేస్తున్న పాదయాత్రలు, యాత్రలను గురించి అమిత్ షా.. నడ్డాలు వివరించారు. వారు చేస్తున్నట్లుగానే మోర్చా నాయకులు చేస్తే బీజేపీ గెలుపు కచ్చితంగా సాధ్యం అవుతుందని అన్నారు. జాతీయ కార్యక్రమాల్లో తెలంగాణ ప్రస్తావన పదే పదే రావడంతో వివిధ మోర్చాలకు చెందిన తెలంగాణ నాయకులు చప్పట్లు కొట్టారు. ఆనందాన్ని వ్యక్తం చేశారు. తాము పడుతున్నకష్టాలను జాతీయ నాయకత్వం గుర్తించడం తమకు చాలా సంతోషాన్ని ఇస్తుందన్నారు.

రాబోయే రోజుల్లో తెలంగాణలో గెలుపే లక్ష్యంగా జాతీయ స్థాయి నేతల నుంచి కార్యకర్తల వరకు పని చేస్తారని చెప్పటం ద్వారా బీజేపీకి తెలంగాణ రాష్ట్రం ఎంత ముఖ్యమన్న విషయాన్ని అమిత్ షా.. జేపీ నడ్డాలు తమ ప్రసంగంలో పదే పదే ప్రస్తావించారు. జులై 28 నుంచి 31 వరకు పాట్నాలో పార్టీకి సంబంధించిన వివిధ మోర్చాల భేటీ సాగింది. తెలంగాణ.. పశ్చిమ బెంగాల్ లో పార్టీని అధికారంలోకి తీసుకురావటమే తమ లక్ష్యంగా అభివర్ణించటం చూస్తే.. ఈ రెండు రాష్ట్రాల్లో విజయానికి జాతీయ పార్టీ ఎంతటి ప్రాధాన్యతను ఇస్తుందో ఇట్టే అర్థమైపోతుందని చెప్పక తప్పదు.