Begin typing your search above and press return to search.

బండి సంజయ్ ను అడగకుండానే అలా చేశారట

By:  Tupaki Desk   |   17 April 2021 8:30 AM GMT
బండి సంజయ్ ను అడగకుండానే అలా చేశారట
X
సొంత పార్టీ నేతల చేతిలో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు షాక్ తగిలిందా? ఆయన్ను సంప్రదించకుండా.. మాట కూడా చెప్పకుండా స్థానిక నేతలు.. పెద్ద నిర్ణయం తీసుకున్నారా? అంటే అవునని చెబుతున్నారు. గ్రేటర్ పరిధిలోని లింగోజీ గూడా డివిజన్ ను గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ గెలుచుకున్న సంగతి తెలిసిందే. అయితే.. ఎన్నికల్లో గెలిచిన ఆకుల రమేశ్ గౌడ్ ప్రమాణస్వీకారం చేయకుండానే మరణించారు. దీంతో.. లింగోజీగూడ డివిజన్ ఉప ఎన్నిక అనివార్యమైంది.

ఇదిలాఉండగా.. ఈ డివిజన్ లోఉప ఎన్నికకు బదులు.. ఆకుల రమేశ్ గౌడ్ కుటుంబ సభ్యులు బరిలో నిలిచి.. ఏకగ్రీవం కావాలన్న ఆలోచనను బీజేపీ స్థానిక నేతలు భావించారు. బీజేపీ మాజీ ఎమ్మెల్సీ రామచందర్.. రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి.. జాతీయ కార్యవర్గ సభ్యులు పేరాల శేఖరరావు తదితరులుకలిసి.. ప్రగతిభవన్ లో మంత్రి కేటీఆర్ ను కలిశారు.

ప్రమాణస్వీకారం చేయకుండానే రమేశ్ గౌడ్ మరణించిన నేపథ్యంలో.. ఉప ఎన్నికలో పోటీకి దిగకుండా.. ఏకగ్రీవం చేద్దామన్న బీజేపీనేతల ప్రతిపాదనకు ఆయన ఓకే చెప్పారు. అయితే.. ఈ ఉదంతంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను సంప్రదించకపోవటం.. ఆయనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే మంత్రిని నేరుగా కలిసినట్లుగా చెబుతున్నారు. దీనిపై బండి సంజయ్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

తనకు చెప్పకుండానే నగర నేతలు మంత్రి కేటీఆర్ ను ఎలా కలుస్తారని నిలదీసినట్లుగా చెబుతున్నారు. కచ్ఛితంగా గెలిచే స్థానాన్ని.. ఎన్నికల్లో పోరాడి గెలవాలి కానీ.. ఇలా ఏకగ్రీవం కోసం ఎందుకు ప్రయత్నించారు? అయినా.. అసలు ఎలా వెళ్లారు? ఇలా రాష్ట్ర పార్టీకి చెప్పకుండా వ్యవహరిస్తే ఊరుకునేది లేదంటూ సీరియస్ అయినట్లు చెబుతున్నారు. ఇప్పటికే తెలంగాణ బీజేపీలో లుకలుకలు ఉన్నాయన్న ప్రచారం జరుగుతున్న వేళ.. ఆ విషయాన్ని బయటపెట్టేలా తాజా ఎపిసోడ్ చోటు చేసుకోవటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.