Begin typing your search above and press return to search.

బండి మాటకు అర్థం అదేనా? పవన్ కు దూరంగా టీ బీజేపీ

By:  Tupaki Desk   |   2 April 2021 5:49 AM GMT
బండి మాటకు అర్థం అదేనా? పవన్ కు దూరంగా టీ బీజేపీ
X
తెలుగు రాష్ట్రాల విషయంలో బీజేపీ అనుసరిస్తున్న వ్యూహం ఆసక్తికరంగా మారింది. ఆ పార్టీకి తగ్గట్లే.. ఆ పార్టీ మిత్రుడు కూడా అదే విధానాన్ని అనుసరిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఏపీలో జనసేనతో దోస్తీ చేస్తున్న బీజేపీ.. తెలంగాణ వరకు వచ్చేసరికి.. ఆ పార్టీ నీడను టచ్ చేయటానికి ఇష్టపడటం లేదు. ఆ మాటకు వస్తే.. జనసేన అధినేత పవన్ కు దూరంగా ఉంటున్న వైనం ఆసక్తికరంగా మారింది. అదే సమయంలో.. తమ అవసరానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటున్న తెలంగాణ బీజేపీ తీరుకు ఏ మాత్రం తీసిపోని రీతిలో జనసేన అధినేత నిర్ణయాలు ఉంటున్నాయి.

తాజాగా జరుగుతున్న సాగర్ ఉప ఎన్నికల్లో ఏ పార్టీ మద్దతు తమకు అవసరం లేదని.. ఒంటరిగా బరిలో నిలిచినట్లుగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పష్టం చేస్తున్నారు. ఇంతకీ.. ఈ మాటల వెనుక మర్మం ఏమిటంటే.. అసలు కారణం వేరే ఉందన్న మాట వినిపిస్తోంది. గ్రేటర్ ఎన్నికల్లో జనసేన పోటీ చేయాలని భావించటం.. చివర్లో టీ బీజేపీ ఒత్తిడి తీసుకొచ్చి.. పోటీకి దూరంగా ఉండేలా జనసేన అధినేతను ఒప్పించారు.

ఇదిలా ఉంటే.. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ సాధించిన అనూహ్య గెలుపు విషయంలో జనసేనకు ఇవ్వాల్సిన క్రెడిట్ ఇవ్వకపోవటం తర్వాత.. అసలు ఆ ప్రస్తావన తేకపోవటంపై జనసేన అధినేత గుర్రుగా ఉన్నారని చెబుతారు. టీ బీజేపీకి షాకిచ్చేలా ఇటీవల ముగిసిన పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో హైదరాబాద్ అభ్యర్థి సురభి వాణిదేవికి మద్దతు ప్రకటించి షాకిచ్చారు. ఈ నిర్ణయంతో టీ బీజేపీకి.. జనసేనకు మధ్య దూరం పెరిగింది.

ఇదిలా ఉండగా.. తాజాగా జరుగుతున్న సాగర్ ఉప ఎన్నికల్లో తమ పార్టీకి చెందిన ఏపీ మిత్రుడి సాయం తీసుకుంటారా? లేరా? అన్న సందేహం వ్యక్తమైంది. దీనిపై స్పష్టత ఇచ్చిన బండి సంజయ్.. సాగర్ ఉప ఎన్నికల్లో తాము సొంతంగా పోటీ చేస్తున్నామని.. ఎవరి మద్దతు తీసుకోవటం లేదన్నారు. దీని అర్థం.. జనసేనను తాము దూరం పెట్టామన్న విషయాన్ని ఆయన తన మాటలతో చెప్పకనే చెప్పారని అర్థమవుతోంది.