Begin typing your search above and press return to search.

కేసీఆర్ సర్కారు కూల్చేందుకు గూండాయిజం చేస్తారట.. ఇవేం మాటలు బండి?

By:  Tupaki Desk   |   15 Aug 2022 4:05 AM GMT
కేసీఆర్ సర్కారు కూల్చేందుకు గూండాయిజం చేస్తారట.. ఇవేం మాటలు బండి?
X
మాటలు తూటాల మాదిరి పేలుతున్నాయి. కొద్ది నెలల్లో జరిగే మునుగోడు ఉప ఎన్నికకు ముందే.. భావోద్వేగాన్ని రగిలించి.. భారీగా లబ్ది పొందే ఆలోచనలో బీజేపీ ఉందా? అంటే అవునన్న మాట వినిపిస్తోంది. తెలంగాణలో తమకు బలం పెరిగిందన్న విషయాన్ని చాటి చెప్పాలని భావిస్తున్న బీజేపీకి..మునుగోడు ఉప ఎన్నిక ఒక చక్కటి అవకాశంగా చెప్పొచ్చు.

నిజానికి నల్గొండ జిల్లాలో కాషాయ ప్రభావం ఉండదు. అలాంటి జిల్లాలో ఒక అసెంబ్లీ స్థానాన్ని సొంతం చేసుకోవటం ద్వారా.. నైతిక స్థైర్యాన్ని పెంచుకోవటంతో పాటు.. తెలంగాణలో తాము త్వరగా విస్తరిస్తున్న విషయాన్ని తెలంగాణ ప్రజలకు చాటి చెప్పాలన్న పట్టుదలతో బీజేపీ ఉంది.

తాజాగా ప్రజా సంగ్రామ యాత్రను నిర్వహిస్తున్న తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తన యాత్రలో భాగంగా పన్నెండో రోజు నడక చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి.. కుటుంబ నియంత్రత్వ పాలనను తరిమి కొట్టేందుకు అవసరమైతే గూండాయిజాన్ని కూడా చేస్తామంటూ వ్యాఖ్యానించారు.

తెలంగాణలో దేశ భక్తుల రాజ్యం రావాల్సిందేనని చెప్పిన ఆయన.. ఒక్క కాంగ్రెస్ కుటుంబం వల్ల దేశానికి స్వాతంత్య్రం రాలేదని.. ముస్లిమేతర సమాజం వల్లనే స్వరాజ్యం వచ్చిందన్నారు. మోడీ వచ్చిన తర్వాత అనేక కార్యక్రమాలతో నిజమైన చరిత్ర తెలుస్తోందన్నారు.

కేంద్రంలోని మోడీ సర్కారు ఈడీని వాడుకోవాలని అనుకుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఎప్పుడో లోపల వేసేదని.. అలా చేస్తే టీఆర్ఎస్ లో ఒక్కరు కూడా మిగలరని.. అందరూ జైలుకు వెళతారన్ారు. 2014, 2018లో ఇచ్చిన అఫిడవిట్లను పరిశీలిస్తే వారెంత అవినీతికి పాల్పడ్డారన్న విషయం.. ఎంతలా సంపాదించారన్నది అర్థమవుతుందన్నారు.

కాంగ్రెస్ ఎంపీ వెంకట్ రెడ్డి తమతో టచ్ లో ఉన్నారని తానెప్పుడూ చెప్పలేదన్న బండి సంజయ్.. ఉప ఎన్నికకు ముందే టీఆర్ఎస్.. కాంగ్రెస్ పార్టీలు పారిపోయాయన్నారు. కమ్యునిస్టులు ఎప్పుడు ఎటువైపు.. ఎలా ఉంటారో తెలీదన్నారు. కార్యకర్తలు మంచోళ్లే కానీ.. నాయకులే అమ్ముడు పోయేటోళ్లంటూ ఘాటు విమర్శలు చేశారు. చూస్తుంటే.. పాదయాత్ర సాగే కొద్దీ.. బండి సంజయ్ నోటి నుంచే వచ్చే మాటలు మరింత వాడి.. వేడిగా ఉంటున్నాయి. రానున్న రోజుల్లో మరింత డోసు పెంచినా పెంచొచ్చన్న మాట వినిపిస్తోంది.