Begin typing your search above and press return to search.

‘బండి’ పాదయాత్రతో బీజేపీకి మైలేజ్ రాలేదా?

By:  Tupaki Desk   |   2 Oct 2021 10:33 AM GMT
‘బండి’ పాదయాత్రతో బీజేపీకి మైలేజ్ రాలేదా?
X
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు ఏం ఆశించి పాదయాత్ర చేపట్టారో కానీ ఆ ఫలితం దక్కలేదన్న చర్చ రాజకీయవర్గాల్లో సాగుతోంది. వత్రం చెడ్డా ఫలితం దక్కలేదన్న సామెత ఇక్కడ కనిపిస్తోందంటున్నారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టి ప్రజాసంగ్రామ యాత్ర మొదటి విడత ముగింపు ఈరోజు జరుగనుంది. హుజూరాబాద్ లో ఎన్నికల కోడ్ కారణంగా పక్కనే ఉన్న హుస్నాబాద్ లో ముగింపు సూభ నిర్వహిస్తున్నారు. హుస్నాబాద్ లో రోడ్ షో, ముగింపు సభకు బీజేపీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్రమంత్రి స్మృతి ఇరానీ రాబోతున్నారు.

బండి సంజయ్ మొత్తం 36 రోజుల పాటు 438 కి.మీల మేర పాదయాత్ర చేశారు. ఎనిమిది జిల్లాల్లోని 19 అసెంబ్లీ, 6 పార్లమెంట్ నియోజకవర్గాలను టచ్ చేస్తూ ఆయన ముందుకు సాగారు. మొత్తం 35 సభలు.. రైతులు, నిరుద్యోగులు, మహిళలు సహా వివిధ వర్గాల నుంచి సుమారు 11 వేలకు పైగా వినతి పత్రాలు స్వీకరించారు.

ఇక ఈ పాదయాత్రలో పాల్గొన్న ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు, ఆరుగురు కేంద్రమంత్రులు, పలువురు జాతీయ నాయకులు పాల్గొన్నారు. బండి సంజయ్ చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్ర తొలి దశ పాదయాత్ర ఆగస్టు 28న చార్మినార్ భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయం చెంత నుంచి ప్రారంభమైంది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో ముగుస్తోంది.

బండి సంజయ్ తన పాదయాత్రలో ప్రజలను కలుస్తూనే వారి సమస్యలు వింటూనే భరోసానిచ్చారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. సీఎం కేసీఆర్ సర్కార్ ను టార్గెట్ చేశారు. కేంద్రం తెలంగాణకు ఇస్తున్న నిధుల వివరాలను వెల్లడించి ఇరుకునపెట్టారు. 34 సభలు నిర్వహించి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.

అయితే బండి సంజయ్ ఎంత పాదయాత్ర చేసినా బీజేపీలోని గ్రూపులు ఆయనకు సహకరించలేదన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే బలంగా ఉన్న కిషన్ రెడ్డి వర్గం బండి పాదయాత్రలో పాలుపంచుకోలేదన్న టాక్ ఉంది. బండితోపాటు పెద్ద నేతలు ఎవరూ పాదయాత్రలో పాలుపంచుకోలేదని.. కొందరు అసలు పట్టించుకోలేదన్న టాక్ నడుస్తోంది.

ఇక రేవంత్ రెడ్డి పీసీసీ కావడం.. ఆయన సభలు, సమావేశాలు పెట్టడం కూడా బండి సంజయ్ పాదయాత్రకు ఊపు తగ్గించిందని అంటున్నారు. రేవంత్ రెడ్డి స్టామినా, ప్రజాదరణ ముందు బండి సంజయ్ కు అంతగా ప్రాధాన్యం దక్కలేదని అంటున్నారు. రేవంత్ రెడ్డిలా మాస్ ఫాలోయింగ్ వాగ్ధాటి లేని బండి సంజయ్ అందులో తేలిపోయాడని అంటున్నారు. ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టడంలో రేవంత్ రెడ్డి ముందు బండి సంజయ్ ప్లాన్లు వర్కవుట్ కాలేదని చెబుతున్నారు. ముఖ్యంగా డ్రగ్స్ ఇష్యూలో కోర్టుకు వెళ్లి మరీ రేవంత్ రెడ్డి నోరు మూయించారు ఓ తెలంగాణ మంత్రి. ఇదే విషయాన్ని ఎలుగెత్తి చాటడంలో బండి విఫలమయ్యాడని అంటున్నారు. మొత్తంగా రేవంత్ రెడ్డి ఊపులో బండి సంజయ్ పాదయాత్ర కొట్టుకుపోయిందని అంటున్నారు.