Begin typing your search above and press return to search.

పాద‌యాత్ర‌తో బండి ప‌రుగులు

By:  Tupaki Desk   |   14 July 2021 4:39 PM GMT
పాద‌యాత్ర‌తో బండి ప‌రుగులు
X
ప్ర‌తి ప‌క్షంలో ఉన్న పార్టీలు అధికారం చేజిక్కించుకోవ‌డానికి ఎన్నో వ్యూహాలు ర‌చిస్తాయి. మ‌రెన్నో ప్ర‌ణాళిక‌ల‌తో సిద్ధ‌మ‌వుతాయి. అధికారంలో ఉన్న పార్టీని గ‌ద్దె దించ‌డం ద‌గ్గ‌ర నుంచి త‌మ‌ అభ్య‌ర్థుల విజ‌యాల కోసం ప‌న్నాగాలు ప‌న్నుతాయి. అధికారం కోసం ప్ర‌జ‌ల మెప్పు పొందేందుకు చేసే ప్ర‌య‌త్నాల్లో పాద‌యాత్ర ఒక‌టి. ప్ర‌జ‌ల‌తో మ‌మేక‌మై సాగుతూ.. వాళ్ల స‌మ‌స్య‌ల‌ను వింటూ.. వాళ్ల‌లో ఒక‌డిగా క‌లిసిపోయి జ‌నాల న‌మ్మ‌కాన్ని చూరగొనేందుకు నాయ‌కుల‌కు ఇదో ప్ర‌ధానాస్త్రం. అప్ప‌టి మ‌హాత్మా గాంధీ మొద‌లు ఈ త‌రం నాయ‌కులు కూడా ఇదే పంథాలో సాగుతున్నారు.

ఇప్పుడు భార‌తీయ జ‌న‌తా పార్టీ తెలంగాణ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ కూడా ఇదే బాట‌లో అడుగులు వేయ‌నున్నారు. 2023 ఎన్నిక‌ల్లో తెలంగాణ‌లో అధికార‌మే ల‌క్ష్యంగా ఇప్పుడే పాద‌యాత్ర‌కు శ్రీకారం చుట్ట‌నున్నారు. ఆగ‌స్టు 9న ప్రారంభించే త‌న పాద‌యాత్ర‌తో రాష్ట్ర రాజ‌కీయాల్లో పెను మార్పులు సంభ‌విస్తాయ‌నే న‌మ్మ‌కంతో సంజ‌య్ ఉన్నారు. విడ‌త‌ల వారీగా ఏడాది పాటు పాద‌యాత్ర‌తో ప్ర‌జ‌ల్లోనే ఉండి రాష్ట్రంలో బీజేపీని మ‌రింత బ‌ల‌ప‌ర్చాల‌నే ల‌క్ష్యం పెట్టుకున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా లాంటి జాతీయ‌ నేత‌ల‌ను, కేంద్ర మంత్రుల‌ను ఈ పాద‌యాత్ర‌కు ఆహ్వానించి జ‌నాల‌ను ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేయ‌నున్నారు.

సంజ‌య్ పాద‌యాత్ర తొలి రెండు విడ‌త‌ల్లో హైద‌రాబాద్‌, రంగారెడ్డి, మెద‌క్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, క‌రీంన‌గ‌ర్ ఉమ్మ‌డి జిల్లాల్లో ఆ త‌ర్వాత ఖ‌మ్మం, వ‌రంగ‌ల్‌, న‌ల్గొండ‌, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌లో జిల్లాల్లో సాగుతుంద‌ని స‌మాచారం. ముందుగా హుజూరాబాద్ ఉప ఎన్నిక‌ల్లో బీజీపీ త‌ర‌పున పోటీ చేసే ఈటెల రాజేంద‌ర్‌ను గెలిపించుకోవ‌డ‌మే ఈ పాద‌యాత్ర తొలి ల‌క్ష్యంగా క‌నిపిస్తోంది. అంతే కాకుండా ఈ పాద‌యాత్ర‌తో రాష్ట్రంలో మారిన రాజ‌కీయ స‌మీక‌ర‌ణాల నేప‌థ్యంలో అటు అధికార పార్టీ టీఆర్ఎస్‌కు, ఇటు కాంగ్రెస్ పార్టీకి క‌ళ్లెం వేయాల‌నే ఉద్దేశ్యంతో సంజ‌య్ ఉన్న‌ట్లు రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. మ‌రి ఈ పాద‌యాత్ర‌తో రాష్ట్రంలో బీజేపీ త‌ల‌రాత మారుతుందేమో చూడాలి.

దేశంతో పాటు రాష్ట్ర రాజ‌కీయాల్లోనూ ఈ పాద‌యాత్ర‌లు, ర‌థ‌యాత్ర‌లు కొత్తేమీ కాదు. భార‌త స్వాతంత్య్ర ఉద్య‌మంలో ప్ర‌జ‌ల‌ను ఒక్క‌తాటిపైకి తెచ్చేందుకు గాంధీ లాంటి స‌మ‌ర యోధులు పాద‌యాత్ర‌నే ఎంచుకున్నారు. గ‌తంలో జాతీయ స్థాయిలో ఎల్‌కే అద్వానీ చేపట్టిన అయోధ్య ర‌థ‌యాత్ర గురించి అంద‌రికీ తెలిసిందే. ఇక తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే తెలుగు ప్ర‌జ‌ల ఆత్మ‌గౌర‌వ నినాదంతో టీడీపీని స్థాపించిన స్వ‌ర్గీయ ఎన్టీఆర్ ర‌థ‌యాత్ర‌తో పార్టీ పెట్టిన తొమ్మిది నెల‌ల్లోనే అధికారంలోకి వ‌చ్చారు. ప్ర‌జ‌ల క‌ష్టాల‌ను తెలుసుకునేందుకు క‌డ‌ప దాటి ప్ర‌తి గ‌డ‌ప‌కూ వెళ్లిన వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి ఉమ్మ‌డి రాష్ట్రంలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చారు. తండ్రి బాట‌లోనే సాగిన త‌న‌యుడు వైఎస్ జ‌గ‌న్‌, కూతురు ష‌ర్మిల పాద‌యాత్ర‌లు చేప‌ట్టిన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌డు తెలంగాణ‌లో తండ్రి పేరుతో పార్టీ పెట్టిన ష‌ర్మిల కూడా ఇక్క‌డ పాద‌యాత్ర చేసే ఆలోచ‌న‌లో ఉన్నారు.