Begin typing your search above and press return to search.

అడ్డు లేకుండా చూసుకుంటున్న బండి

By:  Tupaki Desk   |   26 Feb 2022 6:01 AM GMT
అడ్డు లేకుండా చూసుకుంటున్న బండి
X
తెలంగాణ‌లో బ‌లోపేతంపై దృష్టి పెట్టిన బీజేపీ.. ఆ దిశ‌గా పూర్తిస్థాయిలో క‌స‌ర‌త్తులు చేస్తోంది. టీఆర్ఎస్‌కు తామే ప్ర‌త్యామ్నాయ‌ని భావిస్తూ ముందుకు సాగుతోంది. మ‌రోవైపు సీఎం కేసీఆర్ కూడా కేంద్రంలోని బీజేపీ స‌ర్కారును టార్గెట్ చేయ‌డంతో రాష్ట్రంలోనూ ఆ పార్టీకి హైప్ వ‌చ్చింద‌ని విశ్లేష‌కులు అంటున్నారు. కేసీఆర్‌కు కౌంట‌ర్ ఇస్తూ రాష్ట్ర బీజేపీ నేత‌లు సాగుతున్నారు. ఇదే జోరు కొన‌సాగించాల‌ని అధిష్ఠానం నుంచి కూడా పూర్తి మ‌ద్ద‌తు ద‌క్కుతోంది. ఈ నేప‌థ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ దూకుడు ప్ర‌ద‌ర్శిస్తున్నారు. కేసీఆర్‌పై పోరుబాట‌లో సాగుతూనే.. మ‌రోవైపు సొంత పార్టీలో అసంతృప్తిపై దృష్టి సారించారు.

వాళ్ల‌ను చ‌ల్ల‌బ‌రిచేందుకు..

ఇటీవ‌ల బండి సంజ‌య్ నాయ‌క‌త్వంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ పార్టీలోని సీనియ‌ర్ నేత‌లు ర‌హ‌స్య స‌మావేశాలు నిర్వ‌హించ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. సంజ‌య్ సొంత జిల్లా క‌రీంన‌గ‌ర్‌కు చెందిన నేత‌లే ఈ స‌మావేశాల్లో కీల‌క పాత్ర పోషించ‌డం ఆయ‌న‌కు త‌ల‌నొప్పిగా మారింది. ఈ ర‌హ‌స్య స‌మావేశాల‌పై బీజేపీ అధిష్టానం కూడా ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. పార్టీలో అంద‌రినీ క‌లుపుకొని పోవాల‌ని.. అసంతృప్తి లేకుండా చూసుకోవాల‌ని సంజ‌య్‌కు ఆదేశాలు అందాయి. దీంతో అసంతృప్తి నేత‌ల‌తో తాజాగా సంజ‌య్ స‌మావేశ‌మ‌య్యారు. వాళ్ల‌కు పార్టీలో త‌గిన ప్రాధాన్య‌త ఇస్తామ‌ని హామీ ఇచ్చిన సంజ‌య్‌.. అసంతృప్తిని చ‌ల్ల‌బ‌రిచే ప్ర‌య‌త్నం చేశారు.

సాఫీగా సాగేలా..

తెలంగాణలో మారుతున్న రాజ‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలో బీజేపీకి ప్ర‌జ‌ల ఆద‌ర‌ణ పెరుగుతుంద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. వ‌చ్చే ఎన్నికల్లో అధికారం ద‌క్కించుకోవ‌డ‌మే ల‌క్ష్యంగా పార్టీ సాగుతోంది. ఒక‌వేళ బీజేపీ పార్టీలోకి వస్తే బండి సంజ‌య్ ముఖ్య‌మంత్రి రేసులో ఉండే అవ‌కాశం ఉంది. అందుకే త‌న‌పై ఎలాంటి అసంతృప్తి ఉండ‌కూండా చూసుకునేందుకు ఆయ‌న తాజా స‌మావేశం నిర్వ‌హించార‌ని విశ్లేష‌కులు అంటున్నారు. ధ‌ర్మారావు, గుజ్జులు రామ‌కృష్ణారెడ్డి, సుగుణాక‌ర్‌రావు, చింతా సాంబ‌మూర్తి, రాములు, మ‌ల్లారెడ్డి, ప‌ద్మజారెడ్డి త‌దిత‌ర నేత‌ల‌తో రాష్ట్ర మాజీ అధ్య‌క్షుడు న‌ల్లు ఇంద్ర‌సేనారెడ్డితో క‌లిసి సంజ‌య్ స‌మావేశ‌మ‌య్యారు. నాలుగు గంట‌ల‌కుపైగా ఈ స‌మావేశం సాగింది.

త‌మ‌కు స‌ముచిత ప్రాధాన్య‌త ఇవ్వాల‌ని సీనియ‌ర్లు కోరితే సంజ‌య్ అంగీక‌రించిన‌ట్లు తెలిసింది. 20 ఏళ్లుగా పార్టీలో ముఖ్య ప‌ద‌వులు, ఎమ్మెల్యే టికెట్లు పొందిన వాళ్లు కూడా ఇంకా ప‌ద‌వుల కోస‌మే ప‌నిచేస్తున్నార‌ని ఈ అసంతృప్త నాయ‌కులు కొంత‌మంది నేత‌ల తీరును త‌ప్పుప‌డుతున్నారు. వాళ్ల అస‌హ‌నానికి ముగింపు ప‌లికే దిశ‌గా సంజ‌య్ త‌గిన హామీలు ఇచ్చార‌ని తెలిసింది.