Begin typing your search above and press return to search.

అరేయ్ పిచ్చోడా... కేటీఆర్‌ పై బండి సంజ‌య్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

By:  Tupaki Desk   |   23 April 2022 5:30 PM GMT
అరేయ్ పిచ్చోడా... కేటీఆర్‌ పై బండి సంజ‌య్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
X
తెలంగాణ‌లో విమ‌ర్శ‌లు, ప్ర‌తి విమ‌ర్శ‌లు దూకుడు వ్యాఖ్య‌ల ప‌రంప‌ర కొనసాగుతోంది. టీఆర్ఎస్ పెట్టిన భిక్షవల్లే తనకు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి వచ్చిందంటూ టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. " అరేయ్ పిచ్చోడా... ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వమున్న పార్టీ బీజేపీ. నరేంద్రమోడీ ఆధ్వర్యంలో నీతివంతమైన పాలన అందిస్తున్న పార్టీ. మీది తోక పార్టీ. దొంగ దీక్షలు, దొంగ హామీలతో మోసం చేసి అధికారంలోకి వచ్చిన పార్టీ. అవినీతి అక్రమాలకు కేరాఫ్ అడ్రస్ కేసీఆర్ కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడే సహారా, ఈఎస్ఐ స్కాంలకు పాల్పడితే సీబీఐ విచారణ జరిగింది. మీరా దేశం, ధర్మం కోసం పనిచేస్తున్న బీజేపీపై విమర్శలు చేసేది. మీకా నైతిక అర్హతే లేదు"అంటూ మండిపడ్డారు.

బండి సంజయ్ పాదయాత్ర 100 కి.మీల నడక పూర్తయిన సందర్భంగా... అభిమానులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు సంజయ్ పై పూలు చల్లి, కేక్ కట్ చేసి సంబురాలు జరుపుకున్నారు. ఇతర పార్టీల కు చెందిన స్థానిక నాయకులు, కార్యకర్తలు సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరారు. అనంతరం బండి సంజయ్ వారిని ఉద్దేశించి ప్రసంగిస్తూ తనకు పార్టీ పదవి రావడం టీఆర్ఎస్ పెట్టిన భిక్ష అంటూ ఆ పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలపై స్పందించారు.

''తెలంగాణ కోసం కొట్లాడిన పార్టీ బీజేపీ. వందల మంది యువకులు చనిపోతుంటే... మీరు బలిదానం చేయొద్దు. తెలంగాణ రాబోతుందంటూ ప్రకటన చేయడమే కాకుండా పార్లమెంట్ లో తెలంగాణ బిల్లు పెట్టేలా ఒత్తిడి తెచ్చి రాష్ట్రం వచ్చేలా చేసిన వ్యక్తి సుష్మాస్వరాజ్.

ఆనాడు సుష్మస్వరాజ్ ను తెలంగాణ ఆడ పడుచుగా పొగిడిన కేసీఆర్ ఈరోజు కనీసం ఆ ప్రస్తావన తీసుకురాకపోవడం సిగ్గు చేటు. తెలంగాణ రావడంవల్లే కేసీఆర్ కు సీఎం, ఆ పార్టీ నేతలకు పదవులు వచ్చాయి. టీఆర్ఎసోళ్లకు పదవులు బీజేపీ పెట్టిన భిక్ష అని గుర్తుంచుకోవాలి’ అని అన్నారు.

ఇతరుల చావును కోరుకునే మూర్ఖులు టీఆర్ఎస్ పార్టీ నేత‌లు అంటూ బండి సంజ‌య్ ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. ''బండి సంజయ్ చస్తే కూడా రైతు బీమా వస్తుందంటూ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నరు. నాకు గుంట భూమి లేదు.

రైతు బీమా ఎట్లిస్తరు? నాచావును కోరుకునే మూర్ఖులకే ఆ ఇన్సూరెన్స్ డబ్బులిస్తా. కేసీఆర్ అరాచకాలపై పోరాడదాం రండి. ఎత్తిన జెండా దించకండి. తెగించి కొట్లాడండి. గొల్ల కొండ కోటపైన కాషాయ జెండా ఎగరేసేదాకా ఉద్యమిద్దాం.'' అంటూ బండి సంజ‌య్ వ్యాఖ్యానించారు.