Begin typing your search above and press return to search.

చార్మినార్ దగ్గర ఇలాంటి ఫోటో మీరెప్పుడైనా చూశారా?

By:  Tupaki Desk   |   29 Aug 2021 8:36 AM GMT
చార్మినార్ దగ్గర ఇలాంటి ఫోటో మీరెప్పుడైనా చూశారా?
X
చెప్పినట్లే తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రను షురూ చేశారు. ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో శనివారం ఉదయం మొదలు పెట్టిన యాత్ర మొదటి రోజు ముగిసింది. ఈ సందర్భంగా ఇప్పటివరకు ఏ హైదరాబాదీ (గడిచిన 30-40 ఏళ్లలో) చూడని సీన్ ఒకటి చూపించారు బండి సంజయ్. ఆయన పాదయాత్రను పాతబస్తీలోని చార్మినార్ వద్దనున్న భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద నుంచి షురూ చేశారు. అమ్మవారి దర్శనం అనంతరం ఆయన తన పాదయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా చార్మినార్ చుట్టుపక్కల మొత్తం కాషాయపతాకాలు రెపరెపలాడటమేకాదు.. బీజేపీ జెండా భారీ జెండాలు కనిపించాయి.

చార్మినార్ వద్ద మజ్లిస్ మినహా మరే ఇతర పార్టీ కూడా ఈ తరహాలో ఇంతటి భారీ ఊరేగింపును.. భారీ సభను ఏర్పాటు చేయలేదనే చెప్పాలి. చార్మినార్ ముగింట్లో భారీ వేదికను ఏర్పాటు చేసిన వైనం హాట్ టాపిక్ గా మారింది. హైదరాబాద్ లో బీజేపీ బలం ఎంతలా పెరిగిందన్న దానికి నిదర్శనంగా తాజా యాత్ర చెప్పకనే చెప్పేసిందని చెప్పాలి. యాత్రలో భాగంగా చార్మినార్ వద్ద ఏర్పాటు చేసిన సభలో టీఆర్ఎస్.. మజ్లిస్ లక్ష్యంగా చేసుకొని బండి సంజయ్ ప్రసంగించారు. ఘాటైన విమర్శలు చేసేందుకు వెనుకాడని సంజయ్ మాటలకు బీజేపీ కార్యకర్తలు.. అభిమానులు పెద్ద ఎత్తున స్పందించారు. పాతబస్తీ నడిబొడ్డున ఉన్న చార్మినార్ వద్ద హోరెత్తిన నినాదాలు.. ఎగిసిపడుతున్న బీజేపీ శ్రేణుల ఉత్సామం నడుమ వేలాది మంది కార్యకర్తలు కదలిరాగా.. అక్కడి వాతావరణం కోలాహలంగా మారింది.

ఏళ్లకు ఏళ్లు హైదరాబాద్ లో ఉన్న వారు.. హైదరాబాద్ లోనే పుట్టి పెరిగిన వారు.. చార్మినార్ వద్ద బండి సంజయ్ మొదలు పెట్టిన పాదయాత్ర చాలామందిని విపరీతంగా ఆకర్షించింది. తాజా కార్యక్రమం బీజేపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఇప్పటివరకు ఎప్పుడూ చూడని సీన్ ను హైదరాబాదీయులకు చూపించిన బండిసంజయ్.. తన పాదయాత్రకు అవసరమైన బజ్ ను వచ్చేలా చేశారని చెప్పాలి. చార్మినార్ నుంచి మొదలు పెట్టాలన్న ఆలోచన బాగా వర్కువుట్ అయ్యిందన్న మాట వినిపిస్తోంది.