Begin typing your search above and press return to search.

తెలంగాణ క‌రోనా లెక్క‌ల‌పై సంజ‌యుడి లేఖాస్త్రం!

By:  Tupaki Desk   |   3 May 2020 6:50 AM GMT
తెలంగాణ క‌రోనా లెక్క‌ల‌పై సంజ‌యుడి లేఖాస్త్రం!
X
మొద‌టి నుంచి తెలంగాణలో భిన్న‌మైన రాజ‌కీయ వాతావ‌ర‌ణం ఉంటోంది. ముఖ్యంగా టీఆర్‌ ఎస్ - బీజేపీ మ‌ధ్య‌. ఢిల్లీలో ఒక‌లా రాష్ట్రంలో మ‌రోలా ఆ రెండు పార్టీల మ‌ధ్య రాజ‌కీయం కొన‌సాగుతోంది. అధిష్టానం తీరుతో స్థానికంగా బీజేపీ నాయ‌కులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్ర ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను - సంక్షేమ కార్య‌క్ర‌మాల‌ను కేంద్ర మంత్రులు - బీజేపీ సీనియ‌ర్ ప్ర‌‌శంస‌లు కురిపిస్తున్నారు. కానీ స్థానిక నాయ‌కులు మాత్రం టీఆర్ ఎస్ ప్ర‌భుత్వంపై తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తుండ‌డం మ‌నం గ‌మ‌నించే ఉంటాం. ఇప్పుడు ‌కరోనా స‌మ‌యంలోనూ అదే జ‌రుగుతోంది. తెలంగాణ‌లో తీసుకుంటున్న చ‌ర్య‌ల‌ను కేంద్ర మంత్రుల‌తో పాటు - కేంద్రం బృందం ప్ర‌తినిధులు భేష్ అంటూ ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. అయితే రాష్ట్రంలో మాత్రం పార్టీ నాయ‌కులు విమ‌ర్శ‌లు చేస్తున్నారు. తాజాగా పార్టీ నూత‌న అధ్య‌క్షుడు బండి సంజ‌య్ కొన్ని రోజులుగా రాష్ట్ర ప్ర‌భుత్వంతో ఢీకొడుతున్నారు. వైద్య పరీక్షలు - క‌రోనా లెక్క‌లపై వైద్యారోగ్య శాఖ మంత్రి ఈట‌ల రాజేందర్‌ ను త‌ప్పుబ‌డుతున్నారు. దీంతో ఈట‌ల‌కు బండికి మధ్య మాటల యుద్దం కొన‌సాగుతోంది.

రాష్ట్రంలో టెస్టులు సరిగా చేయడం లేదని సంజయ్ ఆరోపిస్తున్నారు. తాజాగా ఆయ‌న మ‌రోసారి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో వాస్తవ పరిస్థితిని తెలుసుకునేందుకు మరో ఇంటర్‌ మినిస్ట్రియల్ సెంట్రల్‌ టీమ్‌ ను పంపించాలని ఈ సంద‌ర్భంగా కేంద్ర ప్ర‌భుత్వానికి లేఖ రాశారు. ఇటీవ‌ల ప‌ర్య‌టించిన కేంద్రం బృందాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా తప్పుదోవ పట్టించిందని ఆరోపించారు. పూర్తి స్థాయిలో కరోనా వైద్య పరీక్షలు చేయడం లేద‌ని తెలిపారు. వ్యాధి కారక మూలాలు తెలుసుకునే ప్రయత్నాలు జరగట్లేదని విమ‌ర్శించారు. గాంధీ ఆస్ప‌త్రిలో సరిపడా వాష్‌రూమ్‌లు లేకపోవడం, ఉన్నవాటిలోనూ చాలా సమస్యలు ఉండటం - గదులు - వార్డులకు ప్రత్యేక బాత్‌ రూమ్‌ లు సౌకర్యం లేవ‌ని త‌మ‌కు ఫిర్యాదు వ‌చ్చాయ‌ని వివ‌రించారు. ఐసీఎంఆర్ ఇచ్చిన ప్రోటోకాల్‌ ను ఎక్కడా పాటించడం లేదని చెప్పారు. నిర్దేశించిన ప్రమాణాల కంటే అది తక్కువ స్థాయిలో ఉందని తెలిపారు. ఆస్ప‌త్రిలో శిక్షణ పొందిన ఆరోగ్య నిపుణులు - సహాయక సిబ్బంది సరిపడే సంఖ్యలో లేరని ఆరోపించారు. రోగులను గుర్తించడంలో - పరీక్షించడంలో ప్రభుత్వం తీవ్ర వైఫల్యం చెందిందని లేఖ‌లో పేర్కొన్నారు.

ఏప్రిల్ 26 - 27 - 28 హెల్త్ బులెటిన్ త‌ప్పుడు స‌మాచారం ఉంద‌ని ఆరోపించారు. కానీ కేసుల సంఖ్యను, మరణాలను ఎందుకు తక్కువ చేసి చూపించాలనుకుంటున్నారని సంజ‌య్ ప్ర‌శ్నించారు. కరోనా ప్రభావాన్ని తక్కువగా చూపించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ప్రయత్నాలు చేస్తున్నప్పుడు మీ దృష్టికి తీసుకురావడం నైతిక బాధ్యతగా అంటూ లేఖ‌లో కేంద్ర ప్ర‌భుత్వానికి తెలిపారు.