Begin typing your search above and press return to search.
పవన్ దేవుడే..సీఎం రమేశ్ మాత్రం స్నేహితుడు
By: Tupaki Desk | 30 Jun 2018 5:11 AM GMTఆయన పవన్ కళ్యాన్ కు వీరాభిమాని.. తెలుగు సినిమాల్లో కమెడియన్ గా మొదలైన ఆయన ప్రస్థానం.. ఆ తర్వాత నిర్మాతగా ఎదిగేలా చేసింది. సినిమాలతో అనుబంధం పెంచుకుంటూనే పవన్ కల్యాణ్ కు వీరాభిమానిగా పేరు తెచ్చుకున్నారు. పవన్ కళ్యాణ్ తో ‘గబ్బర్ సింగ్ - తీన్ మార్ లాంటి సినిమాలు తీసిన బండ్ల గణేష్ ఈ మధ్య సినిమాలు వదిలేసి రాజకీయాలపై దృష్టి పెట్టడం హాట్ టాపిక్ గా మారింది.
బండ్ల గణేష్ ఈ మధ్య ఢిల్లీ వెళ్లి ప్రధాని మోడీని కలిసి శాలువ కప్పి సన్మానించారు. పవన్ కళ్యాన్ ‘నా దేవుడు’ అని ప్రకటించిన బండ్ల ఇలా పవన్ తిడుతున్న మోడీని కలవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఓహో ఈయన బీజేపీలో చేరుతున్నారు కావచ్చు అని అంతా అనుకున్నారు..
ఇక తాజాగా టీడీపీ ఎంపీ సీఎం రమేశ్ ఆమరణ నిరాహార దీక్ష వేదికపై బండ్ల కనిపించి అందరికీ షాక్ ఇచ్చాడు. అక్కడే మాట్లాడారు. ‘తనకు అత్యంత సన్నిహితుడైన సీఎం రమేష్ నిరాహార దీక్ష చేస్తుంటే చూడడానికి వచ్చానని.. అయినా రెండు రోజుల్లో దీక్ష ముగిసిపోతుందని అనుకుంటే పదిరోజులుగా కొనసాగిస్తున్నారని.. ఇలాంటి దీక్షల్ని పోలీసులు చేయనివ్వరని అనుకున్నానని.. ప్రత్యక్షంగా దీక్షకు మద్దతు తెలుపడానికే వచ్చానని’ బండ్ల ప్రసంగించారు.
అంతేకాదు సీఎం రమేశ్ దీక్షను వేయినోళ్ల పొగిడారు.. పొట్టి శ్రీరాములు ప్లేసులో టంగుటూరి ప్రకాశం పంతులును చేర్చి ఆయన దీక్షతో సీఎం రమేష్ దీక్షను పోల్చారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఈ దీక్ష నిలిచిపోతుందని చెప్పుకొచ్చారు. దాంతో అక్కడున్న వారంతా అవాక్కయ్యారు.
స్వతహాగా బండ్ల గణేష్ కాంగ్రెస్ వాది.అయితే ఈయనకు ఇతర పార్టీలపై వైరం ఉండదు. అన్ని పార్టీలతోనూ సఖ్యతగా ఉంటారు. బొత్స సత్యనారాయణకి అత్యంత దగ్గరి మనిషిగా పేరు తెచ్చుకున్నాడు. కేసీఆర్ అంటే కూడా బండ్లకు ఇష్టం.. చంద్రబాబు అన్నా ప్రేమనే.. పవన్ అంటే ఇక వల్లమాలిన అభిమానం.. ఇలా అందరూ తనవాళ్లు అనుకుంటూ ఎవ్వరూ కష్టాల్లో ఉన్న వాలిపోతున్న బండ్ల గణేష్ వైఖరి ఇప్పుడు ఎవ్వరికీ అంతుబట్టడం లేదు.
ఇక బండ్ల గణేష్ సీఎం రమేశ్ దీక్షకు హాజరవడంపై పవన్ ఫ్యాన్స్ ట్విట్టర్ లో ఫైర్ అవుతున్నారు. సీఎం రమేశ్ దీక్షలో పవన్ ను అందరూ తిడుతుంటే.. అక్కడి ఎలా వెళ్లావంటూ బండ్లగణేష్ ను ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతూ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు.