Begin typing your search above and press return to search.

రేవంత్ రెడ్డితో బండ్ల గణేష్.. ఏంటి కథ?

By:  Tupaki Desk   |   24 Jun 2022 12:49 PM GMT
రేవంత్ రెడ్డితో బండ్ల గణేష్.. ఏంటి కథ?
X
2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందర కాంగ్రెస్ లో చేరిన నటుడు, నిర్మాత బండ్ల గణేష్ చేసిన రచ్చ అంతా ఇంతాకాదు.. కాంగ్రెస్ కూడా బండ్ల గణేష్ కు ప్రాధాన్యతనిచ్చి ఏకంగా అధికారప్రతినిధిని చేసేసింది. దీంతో మీడియా మైకుల ముందు చెలరేగిపోయిన బండ్ల గణేష్ నాడు కాంగ్రెస్ అధికారంలోకి రాకుంటే 7ఓ క్లాక్ బ్లేడ్ తో గొంతు కోసుకుంటానని శపథం చేశారు.

అయితే బ్యాడ్ లక్.. నాడు 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయింది. బండ్ల గణేష్ కల నెరవేరలేదు. ఇక టీఆర్ఎస్ యాంటీగా చాలా మాటలు అన్న బండ్ల గణేష్ కాంగ్రెస్ ఓడిపోవడంతో ఇక మనస్థాపం చెందిన మొత్తం రాజకీయాలనే వదిలేశాడు.. రాజకీయాలకు తనకు సంబంధం లేదంటూ అస్త్రసన్యాసం చేశాడు.

అప్పటి నుంచి ఇప్పటివరకూ అసలు రాజకీయాల మాట ఎత్తలేదు. మధ్యలో పవన్ కు సపోర్టుగా.. జనసేనకు మద్దతుగా మాట్లాడారు. కానీ అధికారికంగా మాత్రం జనసేనలో చేరలేదు.

ఇటీవల సినీ రంగానికి చెందిన రోజాకు మంత్రి పదవి ఇవ్వడంతో బండ్ల గణేష్ హర్షం వ్యక్తం చేశాడు. రోజాను మంత్రిగా చూడడం చాలా ఆనందంగా ఉందని.. ఆమెకు మంత్రి పదవి ఇచ్చిన సీఎం జగన్ కు బండ్ల గణేష్ ధన్యవాదాలు తెలిపారు. ఇక తాను మాత్రం ప్రస్తుతం రాజకీయాల్లో లేనని బండ్ల గణేష్ తెలిపారు. గతంలో కాంగ్రెస్ లో ఉన్న మాట వాస్తవమేనని.. కానీ ప్రస్తుతం తాను ఏ పార్టీలో లేనని తేల్చిచెప్పారు.

గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం తనకు బాధ కలిగించిందన్నారు. తనకు ప్రతీ పార్టీలో స్నేహితులు ఉన్నారని.. కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి.. టీఆర్ఎస్ లో రంజిత్ రెడ్డి తనకు మంచి స్నేహితులని బండ్ల అన్నారు. స్నేహాలకు, రాజకీయాలకు సంబంధం లేదని బండ్ల అన్నారు.

తాజాగా బండ్ల గణేష్ ను కలిశాడు రేవంత్ రెడ్డి. ఏదో కార్యక్రమంలో వీరిద్దరూ కలుసుకున్నారు. రేవంత్ రెడ్డితో ఫొటో దిగిన బండ్ల గణేష్ దాన్ని ట్విట్టర్ లో షేర్ చేస్తూ.. ‘నా సోదరుడు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి’తో అంటూ ఆయనను ట్యాగ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు. ఈ ఫొటో వైరల్ అయ్యింది. చూస్తుంటే బండ్ల గణేష్ అడుగులు కాగ్రెస్ వైపు పడుతున్నట్టు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మళ్లీ బండ్ల గణేష్ యాక్టివ్ అయ్యేలానే కనిపిస్తున్నాడు.