Begin typing your search above and press return to search.

బండ్ల ఆశలకు కాంగ్రెస్ నీళ్లు!

By:  Tupaki Desk   |   14 Nov 2018 9:46 AM GMT
బండ్ల ఆశలకు కాంగ్రెస్ నీళ్లు!
X
బండ్ల గణేష్ ఎమ్మెల్యే ఆశలు అడియాశలు కాబోతున్నాయా.. పరిస్థితులు చూస్తుంటే అలానే కనిపిస్తున్నాయంటున్నారు విశ్లేషకులు. కాంగ్రెస్ పార్టీ తొలి జాబితాలో ఆయనకు టిక్కెట్ కేటాయించలేదు. పైగా ఆయన పోటీ చేయాలనుకుంటున్న రాజేంద్ర నగర్ స్థానాన్ని హోల్డ్ లో ఉంచింది. మలి విడతలోనూ ఆయన పేరు ప్రకటించలేదు. మూడో జాబితాలోనూ సీటు కేటాయించే అవకాశాలు తక్కువగా ఉన్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

బండ్ల గణేష్ ఎంతో ఉత్సాహంగా కాంగ్రెస్ పార్టీలో చేరారు.. బండ్ల గణేష్ అనే నేను.. అని అసెంబ్లీలో అనాలని ఆయన కోరికట. అందుకే కాంగ్రెస్‌ పార్టీ తీర్థం పుచ్చుకున్నానని చెప్పుకొచ్చాడు. ఖచ్చితంగా తెలంగాణాలో కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగర్ సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. షాద్ నగర్ లేదా రాజేంద్ర నగర్ నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. కానీ, ఆయనకు కాంగ్రెస్ అధిష్ఠానం షాకుల మీద షాకులు ఇస్తూనే ఉంది. ఆయన ఆశల మీద నీళ్లు జల్లుతూ కూడా షాద్ నగర్ ను ఇంకొకరికి కేటాయించింది. ఇక, రాజేంద్రనగర్ పైనే ఆయన ఆశలు పెట్టుకున్నారు.

ఇటీవల ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబును కూడా కలిసిన ఆయన, ఆ స్థానాన్ని తనకు వదిలేయాలని కోరారు. బాబు మాత్రం ఎటువంటి హామీ ఇవ్వలేదని తెలిసింది. సుదీర్ఘ కసరత్తుల అనంతం అర్థ రాత్రి విడుదల చేసిన తొలి జాబితాలో గణేష్ పేరు లేదు. తాజాగా ప్రకటించిన రెండో జాబితా 10 మందిలోను అతని పేరును లేదు. అంతేకాకుండా గణేష్‌ ఆశిస్తున్న రాజేంద్ర నగర్‌ స్థానాన్ని పెండింగ్‌లో ఉంచింది.

గత ఎన్నికల్లో రాజేంద్రనగర్ నుంచి టీడీపీ అభ్యర్థి ప్రకాష్ గౌడ్ బరిలోకి దిగి గెలిచారు. అనంతరం ఆయన టీఆర్ ఎస్‌ లో చేరారు. ఇప్పుడు ఆ పార్టీ తరపున బరిలోకి దిగుతున్నారు. ఈసారి టీడీపీనే ఆ టికెట్‌ ఇవ్వాలని పట్టుబడుతోంది. మరోవైపు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత - మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తన కుమారుడు కార్తిక్‌ రెడ్డికి ఇక్కడి నుంచి పోటీకి సై అంటున్నారు. ఫ్యామిలీకి ఒకే టికెట్‌ సిద్ధాంతమన్నా కాంగ్రెస్‌.. ఇప్పటికే ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి - ఆయన సతీమణి పద్మావతి - కోమిటి రెడ్డి బ్రదర్స్‌ - మల్లు బ్రదర్స్‌లకు టికెట్లు ఇచ్చింది. దీంతో ఆమె ఈ టికెట్‌ కోసం తీవ్ర కసరత్తులు చేస్తోంది.

ఇటువంటి పరిస్థితుల్లో బండ్ల గణేశ్‌ కు టిక్కెట్ లభించే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఒకవేళ ఈ స్థానాన్ని మిత్రపక్షమైన టీడీపీకి వదిలేస్తే.. బండ్ల ఏ నిర్ణయం తీసుకోబోతున్నారో అన్న చర్చ మొదలైంది.