Begin typing your search above and press return to search.

ఫుల్ గా తాగేసి.. బెంగళూరు పోలీసులకు చుక్కలు చూపించిన అమ్మాయిలు

By:  Tupaki Desk   |   20 April 2020 4:45 AM GMT
ఫుల్ గా తాగేసి.. బెంగళూరు పోలీసులకు చుక్కలు చూపించిన అమ్మాయిలు
X
లాక్ డౌన్ వేళ ఎవరిళ్లలో వారు మాత్రమే ఉండాలి. ఒకవేళ.. బయటకు రావాల్సి వస్తే అందుకు అనుమతులు తప్పనిసరి. ఇందుకు భిన్నంగా ఎవరైనా బయటకు వస్తే.. వారిపై కఠిన చర్యలు తీసుకోవటం తెలిసిందే. నిబంధనలు ఇలా ఉన్నప్పటికీ కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులోచోటు చేసుకున్న తాజా పరిణామం గురించి తెలిస్తే అవాక్కు అవ్వాల్సిందే.

లాక్ డౌన్ వేళ.. మద్యం దుకాణాల్ని మూసి ఉన్నప్పటికి పూటుగా తాగేసిన అమ్మాయిలు కారులో అమిత వేగంతో దూసుకెళ్లటమే కాదు.. వారిని నిలువరించే ప్రయత్నం చేసిన బెంగళూరు పోలీసులకు సినిమా చూపించిన వైనం షాకింగ్ గా మారింది. లాక్ డౌన్ వేళ.. మిగిలిన చోట్ల మాదిరే బెంగళూరులోనూ పలు చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. అయితే.. ఒక కారులో ఫుల్ గా తాగేసిన అమ్మాయిలు పలువురు వేగంగా నడుపుతూ చెక్ పోస్టు వద్దకు వచ్చారు.

వాహనాన్ని తనిఖీ చేస్తుండగా..ఆ అమ్మాయిలు సీరియస్ అయ్యారు. తమ కారును ఎందుకు ఆపారంటూ ఆగ్రహం వ్యక్తం చేయటంతో పాటు.. తమకు తగిన అనుమతులు ఉన్నాయంటూ వాదనకు దిగారు. లీలా ప్యాలెస్ సమీపంలోచోటు చేసుకున్న ఈ ఉదంతంతో అనుమానం వచ్చిన పోలీసులు.. అమ్మాయిలు మద్యం సేవించారా? లేదా? అన్న విషయాన్ని తేల్చేందుకు బ్రీతింగ్ టెస్టులు నిర్వహించే ప్రయత్నం చేశారు.

దీంతో అలెర్ట్ అయిన అమ్మాయి.. పోలీసుల మీదకే వాహనాన్ని దూకించే ప్రయత్నం చేశారు. ఊహించని ఈ పరిణామానికి పోలీసులు షాక్ కు గురి కాగా.. వేగంగా కారును పోనిచ్చి తప్పించుకున్నారు. రోడ్లు మొత్తం ఖాళీగా ఉన్న వేళ.. అమ్మాయిల కారును ఛేజ్ చేసి పట్టుకునే విషయంలో బెంగళూరు పోలీసులు ఫెయిల్ అయినట్లుగా తేలింది. దీంతో సీరియస్ అయిన పోలీసులు. .ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మాయిల కారు లెక్క తేల్చాలన్న పట్టుదలతో ఉన్నట్లు చెబుతున్నారు. మరేం చేస్తారో చూడాలి.