Begin typing your search above and press return to search.

బెంగళూరులో పరిస్థితి ఇంత దారుణంగా ఉంది!

By:  Tupaki Desk   |   13 Sep 2016 4:30 AM GMT
బెంగళూరులో పరిస్థితి ఇంత దారుణంగా ఉంది!
X
కావేరీ జలాల విషయంలో సుప్రీం కోర్టు జారీచేసిన ఉత్తర్వుల అనంతరం కర్ణాటకలో నిరసనలు, కావేరీ పేరున దాడులు మిన్నంటాయి. కోర్టు తీర్పు అనంతరం మొదట్లో ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు, ప్రజలు, సినీ నటుల రూపంలో శాంతియుత వాతావరణంలో ఆందోళనలు జరగగా.. సోమవారం మాత్రం అవి హింసాత్మకంగా మారిపోయాయి. ఆందోళన కారులతో పాటు, అసాంఘిక శక్తులు కూడా చేరిపోయాయో ఏమిటో కానీ.. వందలసంఖ్యలో తమిళనాడు నెంబర్ ప్లేట్ తో ఉన్న వాహనాలు ద్వంసమయ్యాయి. కోట్లాది రూపాయల ఆస్తినష్టంతో పాటు ఒకరి ప్రాణాలు కూడా పోవడం జరిగింది. ఈ పరిస్థితులే చెబుతున్నాయి ప్రస్తుతం బెంగళూరు లో పరిస్థితి ఎలా ఉందో.

అయితే ఈ వ్యవహారం పూర్తిగా న్యాయనిపుణులకు, ప్రభుత్వాలకు సంబందించిన అంశం. ఇది వారి మధ్య తేలి ఫలితంగా ప్రజలకు మేలు జరగాల్సింది పోయి నేరుగా ప్రజలే ఈ రంగంలోకి దిగడం.. ఆఖరికి కర్ణాటకలో తమిళనాడు రిజిస్ట్రేషన్ కలిగిన వాహనాలు - తమిళనాడులో కర్ణాటక రిజిస్ట్రేషన్ కలిగిన వాహనాలను ధ్వంసం చేసుకొవడం - తగులబెట్టుకోవడం వరకూ పరిస్థితి చేరింది. ఇదే సమయంలో తమిళనాడులోని కన్నడిగుల హోటళ్లుపై దాడులు చేసిన తమిళులకు సంబందించిన వార్తలు, ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాల్లో - వైరల్ అవడం - అనంతరం కర్ణాటకలోని ప్రసార మాధ్యమాల్లో కూడా ప్రసారమవడంతో కర్ణాటక వ్యాప్తంగా నిరసనకారులు రెచ్చిపోయారు. ముఖ్యంగా బెంగళూరులో ఉన్న తమిళనాడు రిజిస్ట్రేషన్ కలిగిన దాదాపు 25 వాహనాలకు నిరసనకారులు నిప్పుపెట్టారు.

మొత్తంగా ఒక్క బెంగళూరులోనూ దాదాపు వందకు పైగా వాహనాలు నిరసనకారుల ఆగ్రహానికి ఆహుతయ్యాయి. ఈ వ్యవహారం ఇతర ప్రాంతాలకు కూడా పాకుతున్న తరుణంలో హోంశాఖ అధికారులు అత్యవసర సమావేశం జరిపి బెంగళూరు - మైసూరు - మండ్యా లతో పాటు కర్ణాటకలోని కావేరి నదీ పరివాహక ప్రాంతంలోని జలాశయాల చుట్టుపక్కల 144 సెక్షన్ విధించారు. ఇదే సమయంలో కర్ణాటకలో తమిళులు ఎక్కువగా నివసించే ప్రాంతాల్లో పోలీసు బలగాలను ఏర్పాటు చేశారు. ఈ స్థాయిలో ఉంది కర్ణాటకలోని పరిస్థితి.

ఈ నేపథ్యంలో తమిళనాడులోని కర్ణాటక రాష్ట్ర ప్రజలకు రక్షణ కల్పించాల్సిందిగా తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు ఇప్పటికే లేఖ రాశారు కర్ణాటక సీఎం సిద్దరామయ్య.

ఇదే సమయంలో నిరసనలు అంతకంతకూ పెరుగుతూ ఉండటం - ఆగ్రహ జ్వాలలు అంతెత్తున ఎగసిపడటంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా బీఎంటీసీ విభాగం పూర్తిగా బస్సు సర్వీసులను రద్దు చేసింది. ముఖ్యంగా తమిళనాడుకు వెళ్లే దాదాపు అన్ని బస్సులను రద్దు చేస్తూ అధికారులు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకూ రోడ్లపైనే అలజడి చేసిన నిరసన కారులు బెంగళూరులోని కన్వర్జీస్ సాప్ట్‌ వేర్ సంస్థలోకి చొచ్చుకువెళ్లి అక్కడి సిబ్బందిని బయటికి పంపించేశారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బెంగళూరు ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలని తన పౌరుల్ని అమెరికా కోరింది. పరిస్థితి సద్దుమణిగే వరకూ గార్డెన్ సిటీకి వెళ్లొద్దంటూ చెప్పింది. దీంతో పరిస్థితి గ్రహించిన మిగిలిన ఐటీ కంపెనీలు ముందు జాగ్రత్త చర్యగా సెలవు ప్రకటించాయి.

ఇదే సమయంలో బెంగళూరులో పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి కర్ఫ్యూ విధించిన పోలీసులు అదనపు బలగాలను మోహరించారు. కాగా, రాజగోపాల నగర - విజయనగర - బ్యాటరాయణపుర - కామాక్షిపాళ్య - కెంగేరీ - మాగడి రోడ్డు - రాజాజీనగర ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు