Begin typing your search above and press return to search.

గార్డెన్ సిటీలో ఫారిన్ దొంగ‌లు!

By:  Tupaki Desk   |   15 July 2018 4:51 AM GMT
గార్డెన్ సిటీలో ఫారిన్ దొంగ‌లు!
X
రీల్ లో క‌నిపించేవి కొన్ని రియ‌ల్ గా చోటు చేసుకుంటాయి. తాజాగా అలాంటిదే గార్డెన్ సిటీగా పేరున్న బెంగ‌ళూరులో చోటు చేసుకుంది. ధ‌నిక దేశ‌మైన అమెరికాకు చెందిన దొంగ‌ల ముఠా (కాకుంటే వీరు స్పానిష్ మాత్ర‌మే మాట్లాడుత‌న్నారు) ఒక‌టి తాజాగా బెంగ‌ళూరులో పోలీసుల‌కు దొరికిపోయింది. హాలీవుడ్ సినిమాల్లో మాదిరి బెంగ‌ళూరులోని ఖ‌రీదైన ఇళ్ల‌ల్లో జొర‌బ‌డి.. దొంగ‌త‌నాలు చేసే దొంగ‌ల ముఠాను ప‌ట్టుకున్న వైనం ఆస‌క్తిక‌రంగా మారింది.

ఈ ఎపిసోడ్ లో మ‌రింత ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. ఈ దొంగ‌ల ముఠాను లీడ్ చేసేది ఒక మ‌హిళ కావ‌టం. కేవ‌లం స్పానిష్ మాత్ర‌మే మాట్లాడే ఈ ముఠాను తాజాగా బెంగ‌ళూరు పోలీసులు అదుపులోకి తీసుకొని జైలుకు త‌ర‌లించారు. దౌత్య‌ప‌ర‌మైన అంశాల కార‌ణంగా వారి పేర్ల‌ను వెల్ల‌డించ‌ని పోలీసులు ఫోటోలు మాత్రం బ‌య‌ట‌కు విడుద‌ల చేశారు. ఇంత‌కీ.. ఈ విదేశీ దొంగ‌ల ముఠా బెంగ‌ళూరులో చేసే దోపిడీల తీరు కాస్త భిన్నంగా ఉండ‌టం గ‌మ‌నార్హం.

అమెరికాలోని కొలంబియాకు చెందిన ఒక మ‌హిళ చాలాకాలం క్రితం టూరిజం వీసాపై భార‌త్‌ కు వ‌చ్చింది. దేశ‌మంతా తిరుగుతూ బెంగ‌ళూరుకు చేరుకుంది. ఫారిన‌ర్లు అధికంగా ఉండే ఈ సిటీ ఆమె దృష్టిని ఆక‌ర్షించింది. అంతేకాకుండా ధ‌నిక న‌గ‌రంగా ఉండ‌టాన్ని గుర్తించిన ఈ మ‌హిళ తేలిగ్గా సంపాదించుకోవ‌టానికి దోపిడీల‌ను మార్గంగా చేసుకుంది. త‌మ దేశానికి చెందిన మ‌రో న‌లుగురిని పిలిపించింది. వీరంతా ఒక ముఠాగా మారి హైటెక్ ప‌ద్ద‌తుల్లో చోరీలు చేయ‌టం షురూ చేశారు.

టార్గెట్ చేసిన ఇంటి ముందు ఖ‌రీదైన కారును ఆపిన మ‌హిళ ముందు వాహ‌నంలో నుంచి బ‌య‌ట‌కు దిగుతుంది. కాలింగ్ బెట్ నొక్కుతుంది. ఒక‌వేళ త‌లుపు తెరుచుకొని ఎవ‌రు? అంటే.. అడ్ర‌స్ కోస‌మ‌ని వివ‌రాలు అడిగి మెల్ల‌గా అక్క‌డి నుంచి జారుకుంటుంది. ఒక‌వేళ‌.. ఎంతసేపు బెల్ నొక్కినా స్పంద‌న లేకుంటే.. త‌న ద‌గ్గ‌రి వాకీటాకీల‌తో ఆ స‌మాచారాన్ని కారులోని ముఠా స‌భ్యుల‌కు అందిస్తుంది. వెంట‌నే వారు వ‌చ్చి త‌లుపును బ్రేక్ చేసి.. ఇంటిని దోచేస్తారు. ఈ విధంగా ప‌లు ఇళ్ల‌ను టార్గెట్ చేశారు. అయితే.. ఇటీవ‌ల ఒక వ్యాపార‌స్తుడి ఇంటిని దోచే క్ర‌మంలో సీసీ కెమేరాల‌కు వారు దొరికారు. దీంతో వీరిని ట్రేస్ చేసిన అధికారులు వారిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల‌కు మ‌స్కా కొట్టి పారిపోయే ప్ర‌య‌త్నం చేయ‌గా.. పెప్ప‌ర్ స్ప్రేతో వారిని నిలువ‌రించి అడ్డుకున్నారు.