Begin typing your search above and press return to search.

భగ్గుమన్న బెంగళూరు.. రోడ్డెక్కిన విద్యార్థులు

By:  Tupaki Desk   |   19 Dec 2019 3:47 PM IST
భగ్గుమన్న బెంగళూరు.. రోడ్డెక్కిన విద్యార్థులు
X
పౌరసత్వ సవరణ చట్టం మంటలు అంటుకుంటున్నాయి. ప్రశాంతతకు మారుపేరు, సాఫ్ట్ వేర్ సిటీ అయిన బెంగళూరు కూడా తాజాగా భగ్గుమంది. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న నిరసన జ్వాలలు బెంగళూరుకు పాకాయి.

కర్ణాటక రాజధాని బెంగళూరులో నిరసన ప్రదర్శనలు, ఆందోళనలు గురువారం ఉగ్రరూపం దాల్చాయి. బెంగళూరులోని ఐఐఎస్సీ సహా పలు విశ్వవిద్యాలయాల విద్యార్థులు భారీ ఆందోళనలు నిర్వహించారు. ప్రముఖ చరిత్రకారుడు రామచంద్రగుహ సహా పలువురు ప్రముఖులు బెంగళూరుకు తరలివచ్చి ఆందోళనలకు మద్దతు తెలుపడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. బెంగళూరు సెంట్రల్ లో విద్యార్థులు గుమిగూడి ప్రదర్శవన నిర్వహించారు.

దీంతో కర్ణాటక సీఎం యడ్యూరప్ప 144 సెక్షన్ ను విధించారు. 72 గంటల పాటు నిషేధాజ్ఞలు ఉంటాయని అరెస్టుల పర్వానికి తెరతీశారు. విద్యార్థులు మాత్రం 144 సెక్షన్ ను పట్టించుకోకుండా ఆందోళనలు కొనసాగించారు. పోలీసులు, విద్యార్థుల మధ్య తోపులాట జరిగింది. కేంద్రం, కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థులు నినాదాలు చేశారు.

ఈ ఆందోళనలో పాల్గొన్న రామచంద్రగుహ మీడియాతో మాట్లాడుతూ దేశం మొత్తం వ్యతిరేకిస్తున్న పౌరసత్వ సవరణ చట్టాన్ని బీజేపీ మాత్రం సమర్థిస్తూ పట్టుదలకు పోతోందని విమర్శించారు. బీజేపీ ఉద్దేశం నెరవేరబోదని స్పష్టం చేశారు. ఆయన మాట్లాడుతుండగానే పోలీసులు వచ్చి రామచంద్రగుహను అరెస్ట్ చేసి తరలించారు