Begin typing your search above and press return to search.

ప్రేమించిన వ్యక్తి కోసం సముద్రాన్ని ఈది భారత్ కు వచ్చిన బంగ్లాదేశ్ యువతి

By:  Tupaki Desk   |   2 Jun 2022 10:44 AM IST
ప్రేమించిన వ్యక్తి కోసం సముద్రాన్ని ఈది భారత్ కు వచ్చిన బంగ్లాదేశ్ యువతి
X
ఇదేం సినిమా కాదు. రీల్ కు మించిన రియల్ స్టోరీ. ప్రేమ.. ప్రేమంటూ సొల్లు మాటలు చెప్పే చాలామందికి ఇది కదరా ప్రేమంటే అన్న భావన కలిగేలా ఉన్న ఈ స్టోరీలోకి వెళితే.. ప్రేమ కోసం ఇంత సాహసం చేసిందా? అంటూ ఆశ్చర్యపోతాం. ఇలాంటివి చేయాలంటే ప్రపంచంలో ప్రేమకు తప్పించి.. మరి దేనికి ఇంత శక్తి ఉండదేమో? తాను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలన్న ఒకే ఒక్క తలంపుతో బంగ్లాదేశ్ కు చెందిన యువతి గంటల పాటు సముద్రాన్ని ఈదుతూ భారత్ కు వచ్చేసిన ఉదంతంగా దీన్ని చెప్పాలి.

బంగ్లాదేశ్ నుంచి పశ్చిమ బెంగాల్ లకు వచ్చిన ఈ యువతి ఉదంతం ఇప్పుడు సంచలనంగా మారింది. అందరిని ఆశ్చర్యానికి గురి చేసే ఈ స్టోరీలోకి వెళితే.. బంగ్లాదేశ్ కు చెందిన కృష్ణ మండల్‌ అనే యువతికి ఫేస్ బుక్ లో కోల్ కోతాకు చెందిన అభిక్ మండల్ అనే యువకుడితో పరిచయమైంది.

అది కాస్తా ప్రేమగా మారింది. అతడ్ని పెళ్లి చేసుకోవాలని మనసులో ఉన్నా.. ఆమెకు పాస్ పోర్టు లేదు. దీంతో.. తన ప్రియుడ్ని కలుసుకోవటానికి ఒక భారీ సాహసానికే తెర తీసింది.

బంగ్లాదేశ్ లో తానున్న ప్రాంతం నుంచి భారత్ కు రావటానికి భారీ ప్లాన్ వేసింది. బంగ్లాదేశ్ లో రాయల్ బెంగాల్ టైగర్లకు నెలువైన సుందర్ బన్ అడవుల్లోకి ప్రవేశించి.. అక్కడి నుంచి క్షేమంగా సముద్ర తీరానికి చేరుకొని.. అక్కడి నుంచి సముద్రంలో ఈదుకుంటూ పశ్చిమ బెంగాల్ కు చేరుకుంది. ఆ తర్వాత తన ప్రియుడ్ని కోల్ కతాలోకలుసుకుంది. వీరిద్దరు మూడురోజుల క్రితం కలిశారు. కోల్ కతాలోని కాళీ ఆలయంలో వీరిద్దరి పెళ్లి జరిగింది.

అయితే.. భారత్ లోకి అక్రమంగా ప్రవేశించిన నేపథ్యంలో ఆమెను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వీరి ప్రేమ గురించి తెలిసినప్పటికి నిబంధనలకు విరుద్దంగా దేశంలోకి ప్రవేశించిన నేపథ్యంలో ఆమెను బంగ్లాదేశ్ రాయబార కార్యాలయ అధికారులకు అప్పగించాలని నిర్ణయించారు.

అయితే.. ఇలాంటి అరుదైన ఉదంతాలకు సంబంధించి ఆమె ప్రేమను మన్నించి.. దాని కోసం ఆమె ప్రాణాలకు సైతం లెక్కచేయకుండా పడిన తపనతో ప్రత్యేక కేసుగా పరిగణిస్తే బాగుంటుంది. ఇలాంటి విషయాల్లో ప్రభుత్వాలు కాస్తంత చొరవ తీసుకుంటే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.