Begin typing your search above and press return to search.

ప్ర‌పంచంలోనే తొలిసారి.. కాన్పు నెల‌కే మ‌రో కాన్పు!

By:  Tupaki Desk   |   28 March 2019 11:57 AM GMT
ప్ర‌పంచంలోనే తొలిసారి.. కాన్పు నెల‌కే మ‌రో కాన్పు!
X
ప్ర‌పంచంలో ఎప్పుడూ జ‌ర‌గ‌నిది.. వైద్య చ‌రిత్ర‌లో ఇప్ప‌టివ‌ర‌కూ చోటు చేసుకోని ఉదంతం ఒక‌టి బంగ్లాదేశ్ లో చోటుచేసుకుంది. ఈ వ్య‌వ‌హారం ఇప్ప‌టివ‌ర‌కూ ప్ర‌పంచంలో మ‌రెక్క‌డా న‌మోదు కాలేద‌ని చెబుతున్నారు. రోటీన్ గా చూస్తే.. ఒక కాన్పు త‌ర్వాత మ‌రో కాన్పుఅంటే.. త‌క్కువ‌లో త‌క్కువ ఏడాది ఖాయం. లేదంటే ప‌ది.. ప‌ద‌కొండు నెల‌లు ప‌క్కా. కానీ.. ఒక కాన్పుకు.. రెండో కాన్పుకు మ‌ధ్య కేవ‌లం 25 రోజుల తేడాతో ప్ర‌సవం కావ‌టం.. మొత్తం ముగ్గురు పిల్ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చిన మ‌హిళ వైనం ఇప్పుడు విస్మ‌యానికి గురి చేస్తోంది.

ఇంత‌కీ ఇలా ఎలా జ‌రిగింద‌న్న సంగ‌తి చూస్తే..

బంగ్లాదేశ్ కు చెందిన అరిపా సుల్తానా అనే మ‌హిళ‌కు ఫిబ్ర‌వ‌రి 25న నెల‌లు నిండ‌ని ఒక మ‌గ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చారు. నొప్పులు రావ‌టంతో ఆమెను ఆసుప‌త్రికి త‌ర‌లించారు. నార్మ‌ల్ డెలివ‌రీ అయ్యింది. త‌ల్లీ బిడ్డా.. ఇద్ద‌రు క్షేమంగా ఉండ‌టంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. త‌ర్వాత ఆమెను ఇంటికి పంపారు. ఇక్క‌డే మ‌రో విచిత్రం చోటు చేసుకుంది.

మొద‌టి కాన్పు జ‌రిగిన 25 రోజుల‌కు ఆమెకు మ‌రోసారి తీవ్ర‌స్థాయిలో నొప్పులు వ‌చ్చాయి. దీంతో ఆందోళ‌న‌కు గురైన ఆమె కుటుంబ స‌భ్యులు వెంట‌నే ఆమెను ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఆమెను ప‌రీక్షించిన వైద్యులు ఆశ్చ‌ర్యానికి గుర‌య్యారు. ఎందుకంటే.. ఆమె గ‌ర్భంలో మ‌రో ఇద్ద‌రు శిశువులు ఉన్న‌ట్లుగా గుర్తించారు. వెంట‌నే ఆమెకు స‌ర్జ‌రీ చేశారు. ఆమె ఇద్ద‌రు క‌వ‌ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చారు. ఇంత‌కీ ఇదెలా సాధ్య‌మైందంటే.. సుల్తానాకు రెండు గ‌ర్భాలు ఉండ‌టంతో ఇది సాధ్య‌మైంది. తొలి కాన్పు మొద‌టి గ‌ర్భంలో ఉండ‌గా.. రెండో గ‌ర్భంలో క‌వ‌ల‌లు ఉన్నారు.

ఒక మ‌హిళ‌కు రెండు గ‌ర్భాలు ఉండ‌టం చాలా అరుద‌ని.. ఇక‌.. ఇలా జ‌ర‌గ‌టం ఇప్ప‌టివ‌ర‌కూ జ‌రగ‌లేద‌న్న మాట‌ను అక్క‌డి వైద్యులు చెబుతున్నారు. ప్ర‌స్తుతం ముగ్గురు పిల్ల‌ల‌తో సుల్తానా క్షేమంగా ఉన్నారు. అంద‌రిని విస్మ‌యానికి గురి చేస్తున్న అంశం ఏమంటే.. తొలి కాన్పు స‌మ‌యంలో చికిత్స చేసిన వైద్యులు ఆమె గ‌ర్భంతో ఉన్న‌ట్లు గుర్తించ‌క‌పోవ‌టం. ఎందుకిలా జ‌రిగింద‌న్న దానికి ఆసుప‌త్రి వ‌ర్గాలు స‌మాధానం చెప్ప‌లేక‌పోతున్నాయి.