Begin typing your search above and press return to search.

బంజారాహిల్స్ పోలీసుల పిలుపు.. ర‌విప్ర‌కాశ్ అరెస్ట్ లాంఛ‌న‌మే!

By:  Tupaki Desk   |   6 Jun 2019 12:04 PM GMT
బంజారాహిల్స్ పోలీసుల పిలుపు.. ర‌విప్ర‌కాశ్ అరెస్ట్ లాంఛ‌న‌మే!
X
మీడియాలో పెద్ద మ‌నిషిగా ఒక వెలుగు వెలిగిన టీవీ9 మాజీ సీఈవో ర‌విప్ర‌కాశ్ పై ప‌లు కేసులు న‌మోదైన సంగ‌తి తెలిసిందే. దీనికి సంబంధించిన డ్రామా గ‌డిచిన కొద్ది రోజులుగా సాగుతున్న‌దే. 27 రోజుల దాగుడుమూత‌ల త‌ర్వాత త‌న‌కు తానే సైబ‌రాబాద్ క‌మిష‌న‌రేట్ కు వ‌చ్చిన ర‌విప్ర‌కాశ్‌.. గ‌డిచిన మూడు రోజులుగా విచార‌ణ‌కు హాజ‌ర‌వుతున్నారు. ఎన్ని రోజులు విచార‌ణ‌కు హాజ‌రైనా ఫ‌లితం మాత్రం ఏమీ ఉండ‌ట్లేద‌న్న మాట పోలీసు వ‌ర్గాల నుంచి బ‌య‌ట‌కు వ‌స్తోంది.

ఇదిలా ఉంటే.. ఫోర్జ‌రీ.. నిధుల మ‌ళ్లింపు కేసులో ర‌విప్ర‌కాశ్ కు బంజారాహిల్స్ పోలీసుల నుంచి తాజాగా నోటీసులు ఇవ్వ‌నున్నారు. కాసేప‌ట్లో సీఆర్ పీసీ 41 కింద పోలీసులు నోటీసులు ఇవ్వ‌నున్నారు. దీంతో.. ర‌విప్ర‌కాశ్ శుక్ర‌వారం (రేపు) బంజ‌రాహిల్స్ పోలీస్ స్టేష‌న్ కు వెళ్లాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డుతుంది.

రెండో రోజు పోలీసులు చెప్పిన స‌మ‌యానికి గంట‌న్న‌ర ఆల‌స్యంగా వ‌చ్చిన ర‌విప్ర‌కాశ్‌.. ఈ రోజు (గురువారం) మాత్రం అందుకుభిన్నంగా పోలీసులు చెప్పిన ప‌ది గంట‌ల స‌మ‌యానికి సైబ‌రాబాద్ పోలీస్ క‌మిష‌న‌రేట్ కు హాజ‌ర‌య్యారు. సుదీర్ఘ విచార‌ణ చేసిన‌ప్ప‌టికీ ర‌విప్ర‌కాశ్ చేత పోలీసులు స‌మాధానాలు చెప్పించ‌లేక‌పోయార‌ని.. త‌న జ‌వాబుల‌తో పోలీసుల‌కు చుక్క‌లు క‌నిపించేలా ర‌విప్ర‌కాశ్ చేసిన‌ట్లుగా చెబుతున్నారు.

పోలీసుల విచార‌ణ‌కు ఎంత‌కూ స‌హ‌క‌రించ‌ని నేప‌థ్యంలో ర‌విప్ర‌కాశ్ ను అరెస్ట్ చేసే అవ‌కాశం ఉందంటున్నారు. దీనికి సంబంధించిన ప్ర‌క్రియ దాదాపుగా పూర్తి అయ్యింద‌ని.. శుక్ర‌వారం బంజారాహిల్స్ పోలీస్ స్టేష‌న్ లో విచార‌ణ‌కు హాజ‌రైన త‌ర్వాత‌.. సాయంత్రం త‌ర్వాత ఆయ‌న్ను అదుపులోకి తీసుకుంటారంటున్నారు. దీంతో.. క‌నీసం మూడు రోజుల పాటు జైల్లో రిమాండ్ లో ఉండాల్సి ఉంటుందంటున్నారు. ఈ వాద‌న‌లో నిజం ఎంత‌న్న‌ది తేలాలంటే మ‌రో రోజు ఆగాల్సిందే.