Begin typing your search above and press return to search.

16కోట్ల బకాయి: భూమా ఆస్తుల జప్తు ప్రకటనచేసిన బ్యాంక్

By:  Tupaki Desk   |   4 Jun 2021 1:30 PM GMT
16కోట్ల బకాయి: భూమా ఆస్తుల జప్తు ప్రకటనచేసిన బ్యాంక్
X
భూమా నాగిరెడ్డి బతికున్న హయాంలో నంద్యాల ఆంధ్రా బ్యాంక్ నుంచి రుణం తీసుకొని ‘జగత్’ డెయిరీని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఆయన జీవించినంత కాలం రుణాన్ని చెల్లిస్తూ వచ్చారని సమాచారం. అయితే ఆయన ఆకస్మికమరణంతో రుణ చెల్లింపులకు బ్రేక్ పడినట్టుగా తెలుస్తోంది.

తాజాగా జగత్ డెయిరీకి ఆంధ్రా బ్యాంక్ నుంచి తీసుకున్న రుణాన్ని చెల్లించకపోవడంతో సదురు బ్యాంక్ మాతృసంస్థ ‘యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ తాజాగా పత్రికల్లో భూమా కుటుంబ ఆస్తుల జప్తు ప్రకటన ఇవ్వడం సంచలనమైంది. ఈ రుణం భారీగా పెరిగిందని మొత్తం ఇప్పటికీ రూ.16కోట్లకు అప్పులు పెరిగాయని సమాచారం.

అయితే ఈ రుణం పొందేందుకు గతంలో భూమా కుటుంబ సభ్యులకు చెందిన మొత్తం ఆస్తులను సెక్యూరిటీగా పెట్టినట్టు తెలుస్తోంది. ఈ ఆస్తుల విలువ రూ.100 కోట్లపైమాటేనని టాక్ వినిపిస్తోంది.

బ్యాంక్ ప్రకటన ప్రకారం.. తమకు బకాయిపడ్డ రుణాలను రెండు నెలల్లోపు చెల్లించాలని లేదంటే మొత్తం ఆస్తులను జప్తు చేస్తామని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా హెచ్చరిస్తూ ప్రకటన జారీ చేసిందట.. ఈ మేరకు కర్నూలు జిల్లాలో ఈ వ్యవహారం చర్చనీయాంశమైంది.

అయితే ఈ తనఖా పెట్టిన ఆస్తులను భూమా అఖిలప్రియ కుటుంబం అమ్మేశారని.. అది అలా చాలా మంది చేతులు మారిందని ప్రచారం సాగుతోంది. తాజాగా బ్యాంకు జప్తు హెచ్చరికల నేపథ్యంలో జప్తు ఉన్న ఆస్తి అని తెలియక కొన్న వారంతా నిండా మునిగారని గగ్గోలు పెడుతున్నారట.. మరి ఈ వ్యవహారం ఎలా తేలుతుంది? నిజమా? కాదా? లేక వట్టి ప్రచారమా? అన్నది తేలాల్సి ఉంది. ఈ జప్తు ప్రకటనపై భూమా అఖిలప్రియ కుటుంబం నుంచి ఇప్పటిదాకా ఎలాంటి స్పందన రాలేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.