Begin typing your search above and press return to search.

కేసీఆర్ కలల టవర్ కు చైనా కంపెనీ రెడీ

By:  Tupaki Desk   |   31 Oct 2015 4:07 AM GMT
కేసీఆర్ కలల టవర్ కు చైనా కంపెనీ రెడీ
X
కేసీఆర్ కల ఒకటి నిజం కానుంది. హైదరాబాద్ కు మకుటాయమానంగా ఉండటమే కాదు.. దేశంలోనే ప్రతి ఒక్కరూ తెలంగాణ రాష్ట్రం వైపు చూసేలా ఒక అద్భుతమైన టవర్ ను నిర్మించాలన్న తపనను ఆయన ఇప్పటికే బయటకు చెప్పారు. హుస్సేన్ సాగర్ ఒడ్డున దేశంలోనే అతి పెద్ద టవర్ ను నిర్మించాలని.. అది హైదరాబాద్ మహానగరానికి ఐకాన్ లా ఉండాలన్న కోరికను పలుమార్లు బయటపెట్టారు.

కొద్ది రోజుల క్రితం తన మనసులోని కోరికను బయటపెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ తర్వాత దీనిపై పెద్దగా మాట్లాడింది లేదు. దీంతో.. ఆయన చెప్పే చాలా ప్రాజెక్టుల మాదిరే.. టవర్ ప్రాజెక్టు కూడా చేరిందన్న మాట వినిపించింది. అయితే.. తన కలను సాకారం చేసుకునేందుకు మార్గాల్ని అన్వేషించే పనిలో ఉన్న కారణంతోనే ఆయన ఈ అంశాన్ని మళ్లీ ప్రస్తావించలేదని తేలింది. సాగర తీరాన నిర్మించే భారీ టవర్ నిర్మాణం కోసం చైనా కంపెనీ ఒకటి ఆసక్తి ప్రదర్శించింది. ప్రాజెక్టుకు అయ్యే ఖర్చులో 85 శాతం నిధులను భరించేందుకు బ్యాంక్ ఆఫ్ చైనా సంసిద్ధతను వ్యక్తం చేసింది.

తాజాగా వారు సాగర తీరాన్ని సందర్శించటమే కాదు.. టవర్ మోడళ్లకు సంబంధించిన ప్రతిపాదనల్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకొచ్చినట్లుగా చెబుతున్నారు. కేసీఆర్ అధికార నివాసంలో కలిసిన బ్యాంక్ ఆఫ్ చైనా కంపెనీ అధికారులు ఓకే చెప్పేశారు. దీంతో.. టవర్ నిర్మాణానికి సంబంధించి కీలక అడుగు పడినట్లైంది. సాగర తీరాన టవర్ తో పాటు.. మూసీనదిపై వంతెన.. దుర్గం చెరువుపై సస్పెన్షన్ బ్రిడ్జ్ నిర్మించేందుకు సీసీసీసీ హైవే కన్సల్టెన్సీ ముందుకొచ్చింది. గతంలో కేసీఆర్ చైనా పర్యటన సందర్భంగా పలు కంపెనీలతో భేటీ అయ్యారు. వాటి ఫలితమే తాజా ప్రతిపాదనలుగా చెబుతున్నారు. మొత్తంగా తెలంగాణలో తన మార్క్ నిర్మాణాలు నిర్మించాలన్న తన కలను నిజం చేసుకోవటానికి ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రంగా కసరత్తు చేస్తున్నట్లు తాజా భేటీలు స్పష్టం చేస్తున్నాయని చెప్పొచ్చు.