Begin typing your search above and press return to search.

మోడీకి గిట్ట‌ని ఆర్థిక‌వేత్త‌కు బ్రిట‌న్ అగ్ర‌తాంబూలం

By:  Tupaki Desk   |   24 April 2018 5:56 AM GMT
మోడీకి గిట్ట‌ని ఆర్థిక‌వేత్త‌కు బ్రిట‌న్ అగ్ర‌తాంబూలం
X
రఘురామ్‌రాజన్‌....రిజర్వుబ్యాంక్‌ మాజీ గవర్నర్‌. ఒక ద‌శ‌లో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీకి స‌న్నిహితుడనే పేరున్న రాజ‌న్‌...రిజర్వుబ్యాంకు గవర్నర్‌గా మూడేళ్ల‌పాటున్నారు. అయితే మోడీకి అత్యంత ఇష్ట‌మైన‌ నోట్ల రద్దు తదితర అంశాలపై కేందాన్ని విమర్శించారు. దాంతో నరేంద్రమోడీ ప్రభుత్వం ఆయనకు మరో విడుత గవర్నర్‌గా పని చేసే అవకాశం ఇవ్వలేదు. ప‌ద‌వుల‌పై పెద్ద‌గా కాంక్ష‌లేని రాజ‌న్ అమెరికాకు వెళ్లిపోయారు. అయితే ఆయ‌న‌కు వెతుక్కుంటూ అవ‌కాశాలు వ‌స్తున్నాయి. రిజర్వు బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్‌కు మరో కీలక పదవి లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ గవర్నర్ రేసులో రాజన్ ముందువరుసలో నిలిచినట్లు తెలుస్తున్నది. దీనిపై బ్రిటన్‌కు చెందిన ఫైనాన్షియల్ టైమ్స్ ఇటీవల ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది.

రాజన్‌కు ఆర్థిక రంగంపై మంచి పట్టు ఉండటంతో బ్రిటన్‌కు చెందిన సెంట్రల్ బ్యాంక్ ఆయనవైపు మొగ్గుచూపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ ప్రస్తుత గవర్నర్ మార్క్ కార్నే వచ్చే ఏడాదిలో పదవీ విరమణ చేయబోతున్నారు. దీంతో యూకే చాన్సలర్ ఫిలిప్ హమ్మోండ్ నేతృత్వంలోని ప్రత్యేక కమిటీ మార్క్ స్థానాన్ని భర్తీ చేయడానికి ఇటీవల కసరత్తు ప్రారంభించింది. ఈ కసరత్తు పూర్తిస్థాయికి చేరకపోయినప్పటికీ పలువురు ఆర్థికవేత్తల పేర్లు పరిశీలనలో ఉన్నాయని, దీనిపై పలు ఊహగానాలు కూడా వస్తున్నాయని హమ్మోండ్ తెలిపారు. రాజన్‌తోపాటు యూకేఎస్ ఫైనాన్షియల్ కండక్ట్ ఆథార్టీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆండ్రూ బైలే, బీవోఈ చీఫ్ ఆర్థికవేత్త యాండీ హల్దేనా కూడా పోటీపడుతున్నారు.

2013లో ఆర్‌బీఐ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన రాజన్‌ 2014లో అంతర్జాతీయ మానిటరీ ఫండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా అవకాశం వచ్చినా వెళ్లకుండా ఆర్‌బీఐలోనే తన సేవలు కొనసాగించారు. 2016లో పదవి కాలం పూర్తయిన తర్వాత అమెరికా యూనివర్శిటీలో ప్రొఫెసర్‌గా బాధ్యతలు సాగిస్తున్నారు రాజన్. మ‌రోవైపు గ‌త ఏడాది ఆయ‌న‌కు రాజ్య‌స‌భ చాన్స్ ఇచ్చేందుకు ఆమ్ ఆద్మీ సిద్ధ‌మైన‌ప్ప‌టికీ...ఆయ‌న తిరస్క‌రించారు.