Begin typing your search above and press return to search.

రూపాయి అప్పున్నాడ‌ని..ఆ బ్యాంక్ ఎంత వేధిస్తోందంటే?

By:  Tupaki Desk   |   2 July 2018 10:05 AM GMT
రూపాయి అప్పున్నాడ‌ని..ఆ బ్యాంక్ ఎంత వేధిస్తోందంటే?
X
వేలాది కోట్లు బ్యాంకుల‌కు టోపీ పెడుతూ.. గుట్టు చ‌ప్పుడు కాకుండా విదేశాల‌కు చెక్కేస్తున్న వైనాలు చాలానే చూస్తున్నాం. ఇలాంటి ద‌ర్జారాయుళ్ల విష‌యంలో పెద్ద‌గా రియాక్ట్ కాని బ్యాంకులు సామాన్యుల్ని మాత్రంఎంత‌గా వేధిస్తారో.. మ‌రెంత‌గా అవ‌మానిస్తారో తాజా ఉదంతాన్ని చూస్తే ఇట్టే అర్థ‌మ‌వుతుంది. చెన్నైలో తాజాగా వెలుగు చూసిన బ్యాంకు తీరు చూసినోళ్లకు ఒళ్లు మండిపోతోంది.

కేవ‌లం రూపాయి అప్పు ఉన్నాడ‌న్న కార‌ణంగా బ్యాంకు అనుస‌రిస్తున్న తీరును ప‌లువురు త‌ప్పు ప‌డుతున్నారు. ప్ర‌స్తుతం కోర్టులో ఉన్న ఈ వ్య‌వ‌హారంలోకి వెళితే.. కాంచీపురం సెంట్ర‌ల్ కో ఆప‌రేటివ్ బ్యాంక్ ప‌ల్ల‌వ‌రం శాఖ‌లో కుమార్ అనే వ్య‌క్తి త‌న వ్య‌క్తిగ‌త అవ‌స‌రాల కోసం 2010 ఏప్రిల్‌ లో బంగారాన్ని తాక‌ట్టు పెట్టి రూ.1.23ల‌క్ష‌ల మొత్తాన్ని అప్పుగా తీసుకున్నారు. కొద్ది రోజుల త‌ర్వాత మ‌ళ్లీ మ‌రికాస్త బంగారాన్ని తాక‌ట్టు పెట్టి రెండోసారి రూ.1.63 ల‌క్ష‌ల మొత్తాన్ని అప్పుగా తీసుకున్నారు. 2011 మార్చిలో తొలిసారి తీసుకున్న రుణానికి సంబంధించి వ‌డ్డీతో స‌హా అప్పు చెల్లించి బంగారు ఆభ‌ర‌ణాల్ని విడిపించుకున్నారు.

త‌ర్వాతి కొద్ది రోజుల‌కు రెండోసారి తీసుకున్న అప్పును సైతం చెల్లించారు. గ్యారెంటీగా బ్యాంక్ ద‌గ్గ‌ర ఉంచిన బంగారు ఆభ‌ర‌ణాల్ని ఖాతాదారుడికి తిరిగి ఇవ్వ‌లేదు. అంతేకాదు.. రెండు ఖాతాల్లో చెరో రూపాయి చొప్పున అప్పు ఉందంటూ బంగారు ఆభ‌ర‌ణాలు తిరిగి ఇవ్వ‌లేదు. స‌రే.. మీకు ఇవ్వాల్సిన రూపాయి ఇచ్చేస్తానంటూ బ్యాంక్ ను కోరితే.. రూపాయి తీసుకోవ‌టం కుద‌ర‌దంటూ మ‌డ‌త పేచీ పెడుతూ బంగారు న‌గ‌ల్ని తిరిగి ఇవ్వ‌టం లేదు.

ఇదేదో ఒక‌రోజు రెండు రోజులు కాదు.. గ‌డిచిన ఐదేళ్లుగా కుమార్ బ్యాంక్ చుట్టూ త‌న న‌గ‌ల కోసం తిరుగుతూనే ఉన్నాడు. రెండు ఖాతాల‌కు రూపాయి చొప్పున అప్పు ఉన్నాడంటూ వారు బంగారు న‌గ‌ల్ని వెన‌క్కి ఇవ్వ‌టం లేదు. తానెంత స‌హ‌నంతో ప్ర‌య‌త్నిస్తున్నా.. రియాక్ట్ కాని బ్యాంకు అధికారుల తీరుకు విసిగిపోయిన కుమార్‌.. త‌న ఆభ‌ర‌ణాలు త‌న‌కు తిరిగి ఇవ్వాల‌ని కోరుతూ తాజాగా మద్రాస్ కోర్టులో పిటిష‌న్ వేశారు. దీన్ని ప‌రిశీలించిన కోర్టు కేసును విచార‌ణ‌కు తీసుకొని కుమార్ వాంగ్ములాన్ని రికార్డు చేసింది. బ్యాంక్ కు నోటీసులు జారీ చేశారు. మ‌రీ.. ఉదంతంపై బ్యాంకు అధికారులు ఎలాంటి వాద‌న‌ను వినిపిస్తార‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.