Begin typing your search above and press return to search.

సైలెంట్ గా దెబ్బేస్తున్న బ్యాంకులు

By:  Tupaki Desk   |   28 May 2018 8:41 AM GMT
సైలెంట్ గా దెబ్బేస్తున్న బ్యాంకులు
X
దేశంలో మ‌రే ప్ర‌ధాన‌మంత్రి హ‌యాంలో లేని రీతిలో పేదోళ్ల‌కు బ్యాంకు ఖాతాల్ని తెరిపించిన ఘ‌న‌త ప్ర‌ధాని మోడీకే చెల్లుతుంది. ఉద్య‌మ‌స్ఫూర్తితో కోట్లాది అకౌంట్ల‌ను బ్యాంకుల్లో తెరిపించి పుణ్యం క‌ట్టుకున్నారు మోడీ. నిరుపేద‌లు.. సాదాసీదా ప్ర‌జ‌ల ఖాతాల‌తో జ‌రిగే లావాదేవీల సంగ‌తి ఎలా ఉన్నా.. బ్యాంక‌ర్ల మీద ప‌ని భారం భారీగా పెరిగిపోయిన ప‌రిస్థితి.

సాధార‌ణ ప్ర‌జ‌లు తెరిచే బ్యాంకు ఖాతాల‌కు ఎలాంటి ఆంక్ష‌లు లేకుండా ప్ర‌వేశ పెట్టిన బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్ల విష‌యంలో బ్యాంక‌ర్లు తాజాగా అనుస‌రిస్తున్న వైనం ఇప్పుడు షాకింగ్ గా మారింద‌ని చెబుతున్నారు. ఈ బ్యాంక్ ఖాతాల నుంచి నాలుగుసార్లు ఉచితంగా సొమ్ము విత్ డ్రా చేసుకునే నిబంధ‌న ఉంది.అయితే.. దీనికి సంబంధించి తాజాగా ఒక సైలెంట్ మార్పు ఒక‌టి చేసేశాయి.

ఇప్ప‌టివ‌ర‌కూ ఉన్న నాలుగుసార్లు ఖాతా నుంచి న‌గ‌దును విత్ డ్రా చేసుకునే రూల్ ను కాస్త మార్చేసి.. షాకింగ్ నిర్ణ‌యాన్ని తీసుకున్న‌ట్లుగా తేలింది. నాలుగు సార్ల కంటే ఎక్కువ‌గా అంటే.. ఐదోసారి బ్యాంక్ ఖాతా నుంచి డ‌బ్బులు డ్రా చేసుకుంటే..ఆ బ్యాంక్ ఖాతాను సాధార‌ణ ఖాతాగా మార్చేయాల‌న్న ప్ర‌పోజ‌ల్ ను తెర మీద‌కు తీసుకొచ్చారు. ఈ విష‌యాన్ని ఖాతాదారుల‌కు ఎలాంటి ముంద‌స్తు స‌మాచారం ఇవ్వ‌టంలోనూ.. వారికి అవ‌గాహ‌న పెంచే విష‌యంలోనూ బ్యాంకులు స‌రైన ప‌ద్ద‌తుల్ని పాటించ‌టం లేదు.

ఎప్పుడైతే నాలుగు సార్లు న‌గ‌దు విత్ డ్రా చేసేసి.. ఐదోసారికి వెళ్లారో అప్ప‌టి నుంచి ఆటోమేటిక్ గా స‌ద‌రు బ్యాంక్ ఖాతాను సాధార‌ణ ఖాతాగా ప‌రిగ‌ణిస్తారు. దీంతో.. సాధార‌ణ ఖాతాలో ఎలా అయితే రాయితీలు.. క‌నీస న‌గ‌దు నిల్వ విష‌యంలో ఉన్న మిన‌హాయింపులు ఉండ‌వో.. ఈ ప్ర‌త్యేక ఖాతాల‌కు ఇదే విధానాన్ని అమ‌లు చేస్తారు. ఈ విధానంలో క‌నీస బ్యాలెన్స్ ను ఖాతాలో ఉంచాల్సి ఉంటుంది. లేని ప‌క్షంలో జ‌రిమానా త‌ప్ప‌నిస‌రి. ఈ తీరు ఏ మాత్రం మంచిది కాద‌ని చెబుతున్నారు. పేదోళ్లకు బ్యాంక్ ఖాతాలు తెరిచిన‌ట్లే తెరిచి.. ఇలా రూల్స్ మార్చేస్తే ఏ కార‌ణంతో ఖాతాలు తెరిచారో అదేమీ నెర‌వేరకుండా పోతుంది. ఈ నేప‌థ్యంలో బీఎస్బీడీఏ ఖాతాల విష‌యంలో రూల్స్ ను మారిస్తే మంచిది. సామాన్యుల మీద బ్యాంకుల భారం ప‌డ‌కుండా ఉంటే మంచిద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.